ఈ నేల, దానిపైన మొలిచిన పైన్ చెట్లు,
ఆల్ఫ్స్ పర్వతాలు, డానుబే నది ప్రవాహాలు,
సుపీరియర్ సెలయేళ్ళు, థేమ్స్ ఒడ్డులు,
మంచు దారులు, ప్రాచీన గోతిక్ భవనాలు
సూర్యుడు కనిపించని ఉదయాలు
నాకు చాలా చిరపరిచితం!
Times square, Green wich line,
California, Newzealand,
Royal Albert Hall, Opera House
ఆఖరికి ఈ మట్టి లోని ప్రతి ఇసుక రేణువు నాకు తెలుసు!
ఇక్కడి గాలితో సంభాషించడం
పూలతో పాటలు పాడడం
మబ్బులతో గంతులు వేయడం
పిట్టలతో ఎగిరెళ్లడం నాకు నిరంతర కత్యం!
ఎక్కడెక్కడి వలస పక్షులు
ఎప్పటెప్పటి కన్నీటి వాగులు
ఎలాంటెలాంటి భగ స్వప్నాలు
నన్ను వెదుక్కుంటూ ఇక్కడకు రావడం
ఒకింత భరోసాను, ఇంకొంచెం జీవనేచ్ఛను
గుండెల్లో నింపుకుని తిరిగి వెళ్లడం
నాకు నిత్యానుభవం!
శతాబ్దాల కాలం నుంచీ
నువ్వు గొప్పగా చెప్పిన cultural diversity, Liberty,
Human rights, Equality మాటలను
బండగా నమ్మిన వాళ్ళం కదా…
మా మూలాలను మరవొద్దని,
మా పేగు బంధాన్ని తెంచుకోవద్దని,
మా ఆస్తిత్వాన్ని చెరిగిపోనివ్వొద్దని
మా పండుగలు, మా సంప్రదాయాలు మేం పాటిస్తున్నాం..
మీతో మేం సహజీవనం చేస్తూనే
మా తనాన్ని మేం కాపాడుకుంటున్నాం..
మరో వైపున మీ laws of the land ను గౌరవిస్తూ,
కనీసం traffic signals ని కూడా ఉల్లంఘించకుండా,
మీకు పన్నులు కడుతూ,
పడాబడిన మీ యూనివర్సిటీలను
మా పిల్లలతో నింపుతూన్నాం..
మీ techno innovations కి
మేం బుద్ధిని అందించాం..
మీ ideas కి మేం రూపాన్నిచ్చాం..
మీ GDP కి గొప్ప చేర్పుగా నిలబడ్డాం…
ఒకరికొకరం సాయంగా నిలబడి
ఇద్దరమూ ఎదుగుతూ వచ్చాం!
కానీ ఒకానొక సాయం సంధ్య వేళ – ఒక్క కుట్ర పేలింది
ఒక తాఖీదు వచ్చింది ఈ నేలను విడిచి వెళ్లాలని
ఈ మట్టితో రుణం తీరిందని, ఈ గదిని ఖాళీ చేయాలని,
”Indians… Go Back!” అని…
పుల్లలు పుల్లలుగా ఉన్నప్పుడు
ఇటువైపు కన్నెత్తి చూడని మనుషులు మీరు.
ఊరు, సముద్రాలు దాటి, జన్మ భూమి, ఖండాలు దాటి
మంచి భవిష్యత్ ను వెదుక్కుంటూ
migrate అయిన వాళ్ళం మేము..
బతుకు భయంతోనో,
రేపటి మీద అభద్రత వల్లనో ఎన్నో కష్టనష్టాలకోర్చి
రేయింబవళ్ళు శ్రమపడి
ధగధగ మెరిసే సౌధాన్ని నిర్మించుకున్నాం..
దాన్ని మీ సొంతం చేసుకోవాలనుకోవడం,
మా సంచిత శ్రమను దోచుకోవాలనుకోవడం
స్థానిక న్యాయమే కదా…
చీమలు పెట్టిన పుట్టలు పాములు ఆక్రమించడం సహజమే కదా…!
ఇప్పటిదాకా నా నైపుణ్యాల నీడలో
నా జ్ఞాన సంపద జాడలో
నా సజనల మార్గదర్శకత్వంలో
నీ అంతరంగ శక్తిని వెలికి తీసి
లోకాలన్నిటా, కాలాలంతటా
నీకంటూ ఒక identity ని ఇచ్చాక..
తెల్లవారేసరికి Alzeimers వచ్చినట్లు
నువ్వు నన్ను అనామకుడిగా చూశాక
Amnesia ఆవరించినట్లు నన్ను అపరిచితుడుగా గమనించాక
దీన్ని కూడా సహజమే అనుకోలేను కదా!
ఇన్నాళ్లకు అర్థమైంది –
”భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు”అని!
యాత్రికుడు, యాత్రా స్థలాన్ని తన చిరునామా అనుకోవద్దని..
కొమ్మపై వాలిన పిట్ట, చెట్టు తన సొంతం అనుకోవద్దని..
మట్టిని పేర్చి కట్టిన చెరువుకట్ట, ఏరు తనది అనుకోవద్దని..
పరాయి నేల మీద నిలుచున్న జాగా, మనది అనుకోవద్దని..
నేలతో అనుబంధం సహజాసహజం అనీ….
ఈ ప్రపంచంలో ఏదీ ఎవరిదీ కాదని! ఏదీ ఎవరికీ చెందదనీ!!
కాందిశీకుడెవరికీ ఆస్తి ఏమీ ఉండదని…!!!
(ఇటీవల యూరప్, అమెరికాలలో ప్రవాస భారతీయులపై పెరుగుతున్న విద్వేష వార్తలను చూసి…)
- డాక్టర్ మామిడి హరికృష్ణ 800805231



