ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పున:ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది. ఈ విధంగా ఒకే చోట ఒకే ప్రధాని రెండుసార్లు ప్రారంభించడం ఎక్కడా జరిగి ఉండదు. దేశంలోనూ రాష్ట్రంలోనూ నెలకొన్న అసాధారణ రాజకీయ పరిస్థితులు, రాజకీయ పార్టీల అవకాశవాద పోకడలకు అద్దం పట్టే సందర్భమిది. 2015 అక్టోబర్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడే అమరావతికి శంకుస్థాపన జరిగింది. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం మినహా మిగిలిన వాతావరణం అచ్చం అదే. అందరూ వాళ్లే అయినప్పుడు పదేళ్లు ఆలస్యంగా మళ్లీ ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్న అనివార్యం. అప్పుడు కూడా ఇదే నాయకులు, ఇవే మాటలు చెప్పడం విన్న ప్రజలకు ఈ సందేహం రావడం సమర్థనీయమే. 2015-19 మధ్య కాలమంతా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ దశలో సింగపూర్ భాగస్వామ్యం గురించి గొప్ప ప్రచారం కూడా జరిగినప్పటికీ రాజధాని ముందుకు కదల్లేదు. ఎందుకు ?శాసనసభ చర్చలో ఈ రాజధానికి మద్దతు ప్రకటించి, అధికారంలోకి వస్తే తాము దాన్ని నిలిపివేస్తామన్న ప్రచారంలో నిజం లేదని భరోసా ఇచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హయాంలో అది ఎందుకు నిలిచి పోయింది? అప్పుడు ఇప్పుడు మధ్య జగన్ హయాంలోనూ రాష్ట్ర పాలకులతో రాజకీయ సాన్నిహిత్యం నడిపిన వెంట తిప్పుకున్న ప్రధాని మోడీకీ ప్రతిష్ట సంబంధం లేదా? జగన్ దాన్ని నిలిపివేసినప్పుడు అధికారికంగా గాని రాజకీయంగా గాని జోక్యం చేసుకున్నది లేదు. రాజధాని పూర్తిగా రాష్ట్ర శాసనసభ నిర్ణయమని ఉన్నత న్యాయస్థానాల్లో అఫిడవిట్‌లు కూడా దాఖలు చేశారు. కేంద్ర ఆధ్వర్యంలోని నలభై సంస్థలకు విలువైన భూములు కేటాయించినప్పటికీ ఏ నిర్మాణాలు చేసింది లేదు. ఇన్ని అనుభవాలున్నాయి కనుక పునః ప్రారంభోత్సవం ఎంత ఆర్భాటంగా జరిపినా ఆచరణలో ఏం జరుగుతుందన్న ప్రశ్న తప్పనిసరి.
అప్పుడు మట్టి.. ఇప్పుడు మాటలే!
గతం ఏమైనప్పటికీ అమరావతిలో కదలిక రావడాన్ని స్వాగతించవచ్చు. కానీ చరిత్ర పునరావృత మవుతుందన్నట్లు నరేంద్ర మోడీ ప్రసంగం సాగింది. 2017లో వచ్చినప్పుడు ఎలాంటి ఆర్థిక సహాయం కాని ప్రకటించింది లేదు. ప్రత్యేక హోదాకు విభజన చట్టంతో పాటు అవకాశం కల్పించిన చంద్రబాబు అడిగింది, మోడీ ఇచ్చింది శూన్యం. రూ.42 వేల కోట్ల మేరకు ఆర్థిక సహాయం కావాలని అప్పట్లో ప్రభుత్వం అడిగితే కేంద్రం రూ.1500 కోట్లు మాత్రమే సచివాలయం, శాసనసభ, రాజ్ భవన్ వంటి వాటికోసం కేంద్రం సహాయం చేసిందన్నారు. అవీ తాత్కాలిక నిర్మాణాలు గానే ఉండిపోయాయి. ఉత్సాహం కోసం నాడు చంద్రబాబు గ్రామ గ్రామాల నుంచి మట్టి తెప్పిస్తూ, నేను సైతం అన్నట్టుగా మోడీ ఢిల్లీ నుంచి మట్టి, నీళ్లు తీసుకువచ్చి హాస్యాస్పద సన్నివేశం సష్టించారు. ఎందుకంటే ఈసారైనా నిర్దిష్టమైన ప్రకటనలు గాని నిధుల మంజూరు కానీ లేవు. ప్రపంచ బ్యాంకు, హడ్కోల నుంచి 50 వేల కోట్ల అప్పు మాత్రం ఇప్పిస్తున్నారు. నక్షత్రకుడిలా వాళ్లు మోడీ కన్నా ముందుగానే అమరావతి సందర్శించి ఆదేశాలు జారీచేసి వెళ్లారు. కనీసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను వేగంగా పూర్తి చేస్తామన్న హామీ కూడా మోడీ నుంచి వచ్చింది లేదు. కనెక్టివిటీ రాకపోకల సంబంధాల పెరుగుదల గురించే ఆయన ఎక్కువగా మాట్లాడారు.
చంద్రబాబు సాంకేతిక విజన్ గురించి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే తాను అధ్యయనం చేశానని మోడీ ప్రశంసలు కురిపించడం బాగానే ఉంది. కానీ 2018లో వీరిద్దరూ విడిపోయి ఎంతగా ఆరో పణలు చేసుకున్నారో ఎలా మర్చిపోతాం? మోడీ నాయకత్వం ఉన్నందువల్లే భారతదేశం ప్రపంచశక్తిగా ఆవిర్భవిం చిందని చంద్రబాబు పొగిడితే బాబు దార్శనికత వల్లే అమరావతి పునఃప్రారంభమవుతోందని మోడీ కొనియాడారు. కేంద్ర వైఖరిలో మార్పును సూచించే ప్రకటనలు, నిధుల విడుదల లేకుండా కేంద్ర సంస్థలపై నిర్మాణం చేపట్టకుండా మోడీ వచ్చారని మురిసి పోవడంలో ఔచిత్యం ఉందా? భుజం కాయటం అండగా నిలబడటం లాంటి మాటలు రాజధాని పూర్తిచేస్తాయా? జగన్ ప్రభుత్వం అమరావతిని ఉన్న ఫలానా నిలిపివేసినప్పుడు కూడా మోడీ ఆయనతో ఉన్నారు అమరావతి ఉద్యమం పట్ల బీజేపీ వైఖరి ఏమిటన్నది కూడా చాలాకాలం పాటు అయోమయంగానే ఉండింది చివరకు రైతులు తిరుపతి యాత్ర చేసిన సమయంలోనే బీజేపీ బహిరంగంగా మద్దతు తెలిపింది. ఏది ఏమైనా రాజధాని నిర్మాణం భారం ఏపీ ప్రభుత్వమే మోయాల న్నది మోడీ వైఖరిగా స్పష్టమవుతుంది. ప్రపంచ బ్యాంకు అప్పు కేంద్రమే చెల్లిస్తుందని ఏపీ బీజేపీ నాయకులు చెప్పే మాటలకు ఆధారంగా అధికార పత్రం ఏమైనా ఉందా? మధ్యలో దాన్ని నిలిపివేసిన జగన్ పైన కూడా ఆయన ఏమి పెదవి మెదపలేదు. చంద్రబాబు రాకతో అమరావతికి దుష్టగ్రహాలు తొలగిపోయాయని మోడీ చేసిన వ్యాఖ్య జగన్‌ను ఉద్దేశించిందేనని అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం ఆధార రహితం.
సందేహాల మధ్య ‘నమో’ భజన
బాబు, పవన్, లోకేష్‌ల విషయానికి వస్తే అమరావతి నమో భజనతో మార్మోగింది. నమో మిసిలి అని కూడా లోకేష్ అభివర్ణించారు. కాశ్మీర్‌లో ఉగ్రవాద మారణకాండ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఏర్పడిన ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ మోడీని మహాశక్తిగా అలౌకిక భాషలో కీర్తించటం హాస్యాస్పదం. అన్ని పార్టీలు ఉగ్రవాదంపై పోరాటానికి మద్దతునిచ్చిన మాట నిజమే. వ్యక్తిగతంగా మోడీ ఏదో ఒంటరిగా పోరాడుతున్నట్లు చెప్పడం అశేష ప్రజానీకాన్ని తక్కువ చేయటం లాంటిదే. ఈ ముగ్గురి ప్రసంగాల్లోనూ జగన్ నిర్వాకాన్ని తీవ్రంగానే అభిశంసించారు. కానీ ఆయనకు మోడీ ఆశీర్వాదాలు అందించాలనే అంశాన్ని దాటేశారు. రాజధాని నిలిచిపోయిన సమయంలో పోరాడిన రైతులను ముఖ్యంగా మహిళలను ప్రశంసించటం బాగుంది. కానీ 9 14 సిఆర్‌డిఏ ఒప్పందంలోని అనేక అంశాలను ఇంకా అమలు చేయలేకపోయిన పరిస్థితిని మాత్రం చెప్పలేదు. విమానాశ్రయం కోసం మరో 45 వేల ఎకరాలు సేకరించటం, సమీకరించటం గురించి మాట్లాడలేదు. రైతాంగంలో ఇప్పటికే అసంతప్తి వ్యక్తమవటం ఇందుకు కారణం కావచ్చు. పదేళ్ల తర్వాత పునః ప్రారంభం చేసుకుంటున్న అమరావతినిపై సర్వ శక్తి యుక్తులు పెట్టే బదులు మరేదో నిర్మించాలని భూమి సేకరించటం అంతు పట్టని విషయం. గన్నవరం విమానాశ్రయం కోసం సేకరించిన భూములకే ఇంకా పరిష్కారం దొరకలేదు. అమరావతి వేగంగా అభివద్ధి చెందాలని కోరుకోవడం ఒకటైతే అది విశ్వనగరంగా దేశ అభివద్ధికి కేంద్రంగా మారిపోతుందని చెప్పడం ఎలా కుదురుతుంది. కొద్దిరోజుల కిందట మంత్రి నారాయణ మాట్లాడుతూ విజయవాడ గుంటూరుతో కలిపి అమరావతిని మెగాసిటీగా తీర్చిదిద్దుతామన్నారు.అదే విధానమైతే చాలా సమస్యలే వచ్చి ఉండేవే కావు. ఇప్పుడు కూడా ఒకే చోట మొత్తం కేంద్రీకరిస్తే ప్రజలు ఆమోదించరు. అది గ్రహించబట్టే చంద్రబాబు సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని లేట్‌గా ట్వీట్ చేశారు.
మారని వైసీపీ అదేపాట
ఇదే సమయంలో వైయస్సార్ పార్టీ నాయకులు పున:ప్రారంభంపై చేసే విమర్శలో ఔచిత్యం లేదు. దాన్ని పూర్తిగా పక్కకు నెట్టి మూడు రాజధానుల ముచ్చటతో కాలం గడిపి ఇప్పుడు దీనిపైన దాడి చేయటాన్ని ప్రజలు హర్షించరు. రాజధానికి లక్ష కోట్లు ఎలా వస్తాయని సవాళ్లు విసరవచ్చు. కానీ భూ సమీకరణతో సహా జరిగిన ప్రక్రియ వాస్తవికంగా ముగించాలి కదా? రాజధాని కట్టేబదులు మహానగరం అంటూ చంద్రబాబు పక్కదోవ పట్టించారని వారు అంటున్నారు. మరి తాము రాజధాని వరకే పరిమితమై కట్టి ఉండాలి కదా? దాదాపు పూర్తయిన భవనాలను కూడా పాడు పెట్టడం, మొత్తం అడవిలా అల్లుకుపోతుంటే ఉపేక్షించడం ఎంత బాధ్యతరాహిత్యం? తమకు నలభై శాతం మంది ఓట్లేశారు కనుక వారంతా అమరావతికి వ్యతిరేకమేనని కొంతమంది వైసీపీ వర్గాలు చెప్పుకోడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటుకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపినప్పటికీ ఆ దిశలోనైనా వైసీపీ ప్రభుత్వం చేసింది ఏంటి ?విశాఖలో పాలన రాజధాని అంటూ రిషికొండపై వేల కోట్లు ఖర్చు చేయడం తప్ప నిజంగా జరిగిన అభివద్ధి కార్యక్రమాలు ఏమిటి?
ప్రజా రాజధానిగా అమరావతి అనే పల్లవిని మళ్లీ వినిపిస్తున్నది గానీ పెట్టుబడిపెట్టే ప్రపంచ బ్యాంకు అందుకు ఒప్పుకోవటం జరిగే పనేనా? ఇప్పటికే రాజధానిలో టోల్స్‌తో సహా పెట్టిన ఖర్చు రాబట్టడం ఎలాగనే చర్చ బ్యాంకు లేవనెత్తుతున్నది. ఆ అప్పులతో రాజధాని కట్టడం అంటే అడుగడుగునా ఆంక్షలు షరతులకు తలవంచడమే. ఏమైనా రాజధాని ప్రక్రియను వేగంగా, ప్రజోపయోగకరంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. మూడేళ్లలో పనులు పూర్తవుతాయి అంటే, అర్థం అప్పటికి ఈ ప్రభుత్వం చివరి ఏడాది పాలనలో ఉంటుంది. జమిలి ఎన్నికలు వంటి మాటలు వింటున్న దష్ట్యా ఈలోగా ఏం జరుగుతుందో చూడాల్సిందే.
ఉచ్చులోనే ప్రాంతీయ పార్టీలు
రాజధాని విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడే వైసీపీ కేంద్రాన్ని మాత్రం పల్లెత్తు మాట అనదు. వైసీపీ విషయంలో బీజేపీ ఇంకా పాత సంబంధాలు తెంచుకోలేదనే సమాచారం ఒకటైతే వీరు కూడా దాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారని ఆ వర్గాల కథనం. ఈ సమయంలో తెలంగాణ రాజకీయాలు చూస్తే రజతోత్సవం పేరిట భారీగా సభ జరిపిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా తన సుదీర్ఘ ప్రసంగంలో ఒక్క వాక్యం మినహా బీజేపీని, కేంద్రాన్ని విమర్శించింది లేదు. తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని, ఏకైక విలనని పదేపదే చెప్పడం ద్వారా ఆయన బీజేపీకి సంతోషం కలిగించారు. వచ్చేసారి తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ అదే పనిగా ప్రచారం చేసుకుంటున్నా బీఆర్‌ఎస్‌కు బీజేపీతో పోరాడటం ప్రధానాంశంగా లేదని కేసీఆర్ తేల్చేశారు. పవన్‌కళ్యాణ్ వంటి వారు ఎంతగా బీజేపీని మోస్తున్న ప్పటికీ తెలంగాణలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీి నేతలు ప్రకటించేసారు. అయినా ఏపీలో మాత్రం వారు పూర్తిగా బీజేపీని సంతోషపెట్టే దిశలోనే పనిచేస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని కూడా ఇటీవల తెలుగుదేశం బీజేపీకే కేటాయించింది. కాశ్మీర్ ఉగ్రవాద హత్యాకాండ సాకుగా చూపి మతాల మధ్య స్పర్ధ పెంచటం మంచిది కాదని సరైన మాట చెప్పినందుకు తెలుగుదేశం అధికార ప్రతినిధి గాయత్రిని బీజేపీి సస్పెండ్ చేయించింది. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు ప్రాంతీయ పార్టీలు బీజేపీ ఉచ్చులో పడిపోవటం ఆమోదించలేని విషయం.
తెలకపల్లి రవి
బీజేపీ ఉచ్చులో తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES