Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం900 మంది కాంట్రాక్టు కార్మికులు క్రమబద్ధీకరణ

900 మంది కాంట్రాక్టు కార్మికులు క్రమబద్ధీకరణ

- Advertisement -

టీజీఎస్‌ఆర్టీసీ ఆదేశాలు జారీ.. బ్రెడ్‌ విన్నర్‌ స్కీం కింద అమలు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ ఆర్టీసీలో 900మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తూ టీజీఎస్‌ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. సర్క్యులర్‌ సైతం విడుదల చేసింది. ఆర్టీసీలో కన్సాలిడేటేడ్‌ పే కింద ఇప్పటికే రెండేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్‌ కానుంది. ఈ ఆదేశాలు ఈ మార్చి 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్టీసీ వైస్‌ చైర్మెన్‌, ఎండీ పేర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపోతే ఎలాంటి అసెస్‌మెంట్‌ టెస్ట్‌ పాస్‌ కావాల్సిన అవసరం కూడా లేదని ఆర్టీసీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్టీసీ కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. నియామకపు తేదీ నుంచి రెండేండ్ల సర్వీస్‌ పూర్తిచేసిన ఉద్యోగులను మార్చి 1, 2026 నుంచి రెగ్యులర్‌ చేయనున్నారు.

ఈ మార్చి 1, తర్వాత రెండేండ్ల సర్వీసు పూర్తి చేసే ఉద్యోగుల సేవలు, రెండు సంవత్సరాలు పూర్తయిన తేదీ తర్వాత వచ్చే నెల మొదటి నుంచి క్రమబద్ధీకరణను వర్తింపజేస్తారు. ఈ రెండేండ్ల కాలంలో ఉద్యోగుల సేవల్లో కనీసం 240 పనిదినాలు పనిచేసి ఉండాలి. మాతృత్వ సెలవులు కూడా పని దినాలుగానే పరిగణిస్తారు. లాంగ్‌లీవ్‌, సిక్‌ లీవ్‌, గైర్హాజరు కారణంగా లేదా ఫుట్‌-ఆప్‌ డ్యూటీలో ఉన్న ఉద్యోగుల సేవలు, వారు తిరిగి విధుల్లో చేరిన తర్వాత తాజా మార్గదర్శకాలను అమలు చేసి రెగ్యులర్‌ చేస్తారు. ఆర్టీసీ ఆదేశాల నేపథ్యంలో దీర్ఘకాలికంగా ఆర్టీసీలో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్‌లో ఉండగా మరణించిన కార్మికులు, అనారోగ్యం కారణంగా మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన డ్రైవర్‌ కుటుంబీకులకు బ్రెడ్‌ విన్నర్‌ స్కీం కింద కాంట్రాక్టు ప్రాతిపాదికన గతంలో ఆర్టీసీ యాజమాన్యం పోస్టింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇతర సంఘాలు కూడా
కాంట్రాక్టు కార్మికులను ఆర్టీసీ రెగ్యులర్‌ చేసిన నేపథ్యంలో యాజమాన్యానికి ఈయూ నాయకులు ఈదురు వెంకన్న, టీఎంజీ నేత మారంరెడ్డి థామస్‌రెడ్డి, టీజేఎంయూ నేత హనుమంతు ముదిరాజ్‌, ఎన్‌ఎంయూ నాయకులు ఎన్‌.మౌలానా, నాయకులు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్‌, యాదగిరి తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎస్‌డబ్ల్యూఎఫ్‌ హర్షం
టీజీఎస్‌ఆర్టీసీలో బ్రెడ్‌ విన్నర్‌ స్కీం కింద డ్రైవర్‌, కండక్టర్‌, సెక్యూరిటీ గార్థులుగా కాంట్రాక్టు పద్ధతిలో నియామకమై రెండేండ్లు సర్వీసు పూర్తి చేసిన 900 మంది కార్మికులను క్రమబద్ధీకరించడం పట్ల టీజీ స్టాఫ్‌ ఫండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ ) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్టీసీలో సర్వీస్‌లో ఉండగా మరణించిన కార్మికులు, అనారోగ్యం కారణంగా మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన డ్రైవర్‌ కుటుంబీకులకు బ్రెడ్‌ విన్నర్‌ స్కీం కింద కాంట్రాక్టు ప్రాతిపాదికన యాజమాన్యం పోస్టింగ్‌ ఇచ్చిందన్నారు.

కాగా ఇది నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న కారణంగా, వారందరి అపాయింట్‌మెంట్‌ తేదీ నుంచి రెగ్యులర్‌ చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చిందని గుర్తు చేశారు. గతంలో ఈ పథకం కింద చేసిన నియామకాలన్నీ రెగ్యులర్‌ చేశారన్నారు. కాంట్రాక్టు విధానంలో రిక్రూట్‌ చేయడం వల్ల వారంతా మానసిక వేదన, అభద్రత పొందారనీ, ఇప్పటికైనా రెగ్యులర్‌ చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్‌లోనూ రెగ్యులర్‌ విధానంలోనే నియామకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -