జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు
అఖిలపక్షం ఆధ్వర్యంలో ‘హలో రైతన్న చలో భోరజ్’
సీసీఐ ఆంక్షలు తొలగించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పత్తి, సోయా పంట దిగుబడుల కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలను ఎత్తేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. ‘హలో రైతన్న చలో భోరజ్’ పేరుతో భోరజ్ మండల కేంద్రంలో 44వ జాతీర రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపై బైటాయించి నినాదాలు చేస్తూ జొన్న రొట్టెలు తింటూ నిరసన తెలిపారు. దీందో రుహదారికి ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రహదారి దిగ్బంధనం కార్యక్రమానికి ఎలాంటి అనుమతులూ లేవని ఉదయం నుంచే పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆందోళన కార్యక్రమం ఆలస్యంగా ప్రారభమైనప్పటికీ రైతులు పెద్ద సంఖ్యలో రహదారిపైకి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ అయిన సీసీఐ కొనుగోలు చేస్తున్న పత్తిలో తేమను 20శాతం వరకు సడలించాలని డిమాండ్ చేశారు.
కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎకరాకు ఏడు క్వింటళ్ల పత్తి కొనుగోలు నిబంధన ఎత్తేయాలని కోరారు. బయోమెట్రిక్ విధానంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని, కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు సడలించి పంట దిగుబడులు కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, అఖిలపక్షం, రైతు సంఘం అధ్యక్షులు బండి దత్తాత్రి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, సీపీఐ సహాయక కార్యదర్శి సిర్ర దేవేందర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు నంది రామయ్య, రైతు నాయకులు గోవర్ధన్ యాదవ్, విజ్జగిరి నారాయణ పాల్గొన్నారు.



