పునరావాసంలో అన్ని శాఖల సమన్వయం అవసరం
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నవతెలంగాణ – అచ్చంపేట
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశానికి తలమానికంగా నిలుస్తోందని, దాని ప్రత్యేకతను కాపాడుకుంటూనే టైగర్ రిజర్వ్ పరిధిలోని తరలింపు గ్రామాల పునరావాసం, పునర్నిర్మాణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అటవీ, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల పునరావాస–పునర్నివాస ప్రక్రియపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. అమరేందర్, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర పాల్గొన్నారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కొల్లంపెంట, సర్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండల పెంట గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చేపడుతున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల తరలింపు ప్రభుత్వ మార్గదర్శకాలు, ఎన్‌టీసీఏ నిబంధనల ప్రకారం కాలపరిమితిలో, పారదర్శకంగా జరగాలని, గ్రామాల పునరావాసం నిమిత్తం అచ్చంపేట డివిజన్, లింగాల్ మండలంలోని బాచారం రిజర్వ్ ఫారెస్ట్‌లో 1501.88 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇన్-ప్రిన్సిపల్ (స్టేజ్–II) అనుమతి లభించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అనుమతితో పునరావాస కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి మార్గం సుగమమైందన్నారు.
పునరావాసం అంటే కేవలం ఇళ్ల నిర్మాణమే కాకుండా సంపూర్ణ జీవన వ్యవస్థ ఏర్పాటు చేయాలని, పునరావాస ప్రాంతాల్లో త్రాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 160 మంది లబ్ధిదారులకు చెల్లించాల్సిన 15 లక్షల రూపాయల పరిహారానికి సంబంధించి జాయింట్ బ్యాంకు ఖాతాలు వెంటనే తెరవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమిని రెవెన్యూ పట్టాలతో అందించనున్నట్లు, ఆ భూమి విక్రయానికి 10 సంవత్సరాల కాల పరిమితి ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
సార్లపల్లి సర్పంచ్ రాములు గ్రామ ప్రజలకు సంబంధించిన వివిధ అంశాల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎన్జీవో ఇమ్రాన్ సిద్ధికి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



