– సీపీఐ(ఎం) మున్సిపల్ విసృత స్థాయి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపు
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాలకు లొంగకుండా తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గట్టు శ్రీరాములు గార్డెన్ లో సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకులు ఎండి పాషా, అవ్వార రామేశ్వరి, అధ్యక్షతన మున్సిపల్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రంలో దోపిడీ, పెట్టుబడిదారీ కార్పొరేట్ సంస్థలు బలమైన శక్తిగా కొనసాగుతున్నాయి వారికి అనుకూలంగా విధానాలను పాలకులు అనుసరిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు మద్యం పెట్టుబడిగా పెట్టి గెలిచే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వస్తాయి. వాటిని ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పేద బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం శ్రామిక, కర్షక పక్షాన పోరాటాలు నిర్వహించే సీపీఐ(ఎం)ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజా పోరాటాతోనే పార్టీ బలోపేతం అవుతుందని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని, ముఖ్యంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించాలని కోరారు.
దోపిడికి భూస్వామ్యులకు వ్యతిరేకంగా పోరాటాలు జరుపుతున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా ఉద్యమాలు నడిపించే నాయకులకు ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పారు. గత సర్పంచ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎకమై కమ్యూనిస్టు నాయకులను ఓడించాలని చూసిన ప్రజల అండతో అనేకచోట్ల సీపీఐ(ఎం) అభ్యర్థులు గెలిచారని గుర్తు చేశారు. డబ్బు, మద్యంతో మభ్యపెట్టిన నిజమైన ప్రజా నాయకులకు గెలిపించారని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు .ప్రపంచంలో తమ పెత్తనం చెలాయించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. అందులో భాగంగా వెనిజులా అధ్యక్షులు మదురో దంపతులను అమెరికా సామ్రాజ్యవాదం కిడ్నాప్ చేసిందని అవేదన వ్యక్తం చేశారు. ట్రంపు ప్రపంచంలోని అన్ని దేశాలపై గుత్తాధిపత్యం కోసం బెదిరింపు చర్యలు చేస్తున్నారని, ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం అనేక దేశాలను యుద్ధం వైపు ప్రోత్సహించడం, అతని పతనానికి దారితీస్తుందని అన్నారు.
ట్రంపు ప్రపంచ వ్యతిరేక విధానాలు చేస్తుంటే మోడీ ప్రభుత్వం అతన్ని సంతోషపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అరెస్టు చేసిన విషయమై ప్రపంచ దేశాలన్నీ ఖండించాయని కానీ ట్రంప్ కు కోపం వస్తుందని భయంతో మోడీ మాత్రం మౌనంగా ఉన్నారని, అదేవిధంగా దేశంలోని ప్రభుత్వ సంస్థలు అన్నిటిని ప్రైవేటు పరం చేయడానికి మోడీ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా అడవుల్లో కొండల్లో ఉన్న ఖనిజ సంపదను ఆదాని, అంబానీలకు దోచిపెట్టడానికి మోడీ కృత నిశ్చయంతో ఉన్నాడని, అందులో భాగంగానే అడవులకు, గిరిజనులకు, రక్షణగా ఉన్న నక్సలైట్లను దారుణంగా హత్య చేస్తున్నారని, అడవుల నుంచి కొండల నుంచి గిరిజనులను తరిమి వేస్తున్నారని జాన్ వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నీరుగాచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అందులో భాగంగానే ఈ పథకానికి పేరు మార్చడంతో పాటు నిధులు కూడా తగ్గించి 40% రాష్ట్ర ప్రభుత్వాలు, 60 శాతం కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా చట్టాలు చేయడం పేదల కడుపులు కొట్టడమే నన్నారు. కేంద్రంలో బిజెపి మతోన్మాద భావాజాలాలను పెంచుతూ మరొకవైపు కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను లేబర్ కోడ్లను తీసుకొస్తూ పరిపాలన సాగిస్తుందని, రానున్న కాలంలో బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. గ్రామాల్లో బిజెపి ప్రభుత్వం మతోన్మాద భావజాల వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుందని ప్రపంచమంతా శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటే మన దేశంలో మాత్రం మూడ ఆచారాలకు కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో, సామాజిక అసమానతలు మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. సోషలిస్టు దేశాల్లో, ఎర్రజెండా పాలనలో ఆకలి, దారిద్రం ,దోపిడీ , అణచివేత, లేకుండా ప్రజలందరికీ విద్యా, ఉద్యోగం, ఉపాధి, అందించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. బీజేపీ పాలనలో మాత్రం కులాల, మతాల ,పేరిట విద్వేషాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యా, వైద్యం, సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మిగిలిపోయాయని అన్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా గెలిచిన సర్పంచులు గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్న గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, తగిన నిధులు కేటాయించాలని అన్నారు. కమ్యూనిస్టులు గెలిచిన చోట నిస్వార్ధంగా, గ్రామాల, మున్సిపాలిటీల, అభివృద్ధికై పాటుబడిన చరిత్ర ఉందని అన్నారు. కావున భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడే ,ప్రజా సమస్యల పరిష్కారానికై ,ప్రజల మధ్యన ఉండే కమ్యూనిస్టులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ సమావేశంలోసిపిఐ ఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ జిల్లా కార్యవర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ , శ్రీనివాసచారి, యాదిరెడ్డి, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, దండా అరుణ్ కుమార్, గోపగోని లక్ష్మణ్, తూర్పునూరు మల్లేశం, గోసిక స్వామి, గుర్రం నరసింహ, కందగట్ల ఆనంద్, ఉష్కావుల రమేష్, బొడ్డు అంజిరెడ్డి, కామిశెట్టి ప్రభాకర్, జయమ్మ, ధర్మ రెడ్డి ,దశరథ, పాల్గొన్నారు.



