అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో
న్యూయార్క్‌లో 80వ యూఎన్ సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ
న్యూయార్క్: భారత్ అమెరికాకు చాలా ముఖ్యమైనదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. న్యూయార్క్ ప్యాలెస్‌లో 80వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిసిన రూబియో పైవిధంగా వ్యాఖ్యానించారు. వాణిజ్యం, రక్షణ శక్తితో సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై చర్చించినట్టు ఆయన తెలిపారు. ఓవైపు భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ఇరువురి విదేశాంగ మంత్రుల భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.దాదాపు గంట సేపు జరిగిన ఈ సమావేశం వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధాలు వంటి ఖనిజాలు, ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరిపామని రూబియో తెలిపారు. ఈ సందర్భంగా యూఎన్‌జీఏలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యానని మర్కో రూబియో ఎక్స్‌లో పోస్టు చేశారు. భారత్‌తో సంబంధాలు యూఎస్‌కు కీలకమని రూబియో పేర్కొన్నారని ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిసింది. క్వాడ్‌తో సహా ఇండో- పసిఫిక్ ప్రాంతాలను ప్రోత్సహించేందుకు అమెరికా- భారత్ కలిసి పనిచేసేందుకు రూబియో, జైశంకర్‌లు అంగీకరించారని పేర్కొంది.
మార్కో రూబియోతో భేటీ ఆనందంగా ఉంది : జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ కావడం తనకు చాలా ఆనందంగా ఉందంటూ జైశంకర్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా అనేక అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై తమ మధ్య సంభాషణలు జరిగినట్టు తెలిపారు. ప్రాధాన్య రంగాల్లో పురోగతి సాధించేందుకు నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని తాము నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా 2025 అక్టోబర్-నవంబర్ నాటికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ముగించాలని రెండు దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ ఒప్పందం 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుత యూఎస్ 191 బిలియన్ల నుంచి యూఎస్ 500 బిలియన్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కాగా మర్కో రూబియో, జైశంకర్ చివరిసారిగా జులైలో వాషింగ్టన్ డీసీలో జరిగిన క్వాడ్ సదస్సులో పాల్గొన్నారు. విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఇరుదేశాల మంత్రులు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.