Thursday, October 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ రూ.303 కోట్లు విడుదల చేయండి

ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ రూ.303 కోట్లు విడుదల చేయండి

- Advertisement -

ఆర్థిక శాఖాధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ బకాయిలు రూ.303 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌ షిప్‌ మొత్తాన్ని ఒకేసారి క్లియర్‌ చేయాలని ఆదేశించారు. నిరాశలో ఉన్న వేల కుటుంబాల్లో డిప్యూటీ సీఎం ఆదేశాలు ఆనందం నింపింది. ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ విదేశాల్లో ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదగాలని ఆలోచనతో వేలాది మంది పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌పై విదేశాలకు వెళ్లారు. గత ప్రభుత్వ కాలం నుంచి ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ అందకపోవడంతో విదేశాల్లో ఉన్న విద్యార్థులు, రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ అందక మరోవైపు అమెరికా, యూకే వంటి దేశంలో కొత్త కొత్త ఆంక్షలతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి తీవ్రమైంది.

ఆయా దేశాల్లో గతంలో మాదిరిగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. అక్కడ రోజురోజుకు ఆర్థిక భారం పెరిగిపోతుంది. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న ఎడ్యుకేషన్‌ లోన్‌ భారం పెరుగుతుంది. ఈ పరిస్థితిలన్నిటిని అవగాహన చేసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమస్యను ప్రాధాన్యత అంశంగా భావించి ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని ఒకేసారి క్లియర్‌ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం ఆదేశాలతో వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి. కష్టకాలంలో ప్రభుత్వం ప్రతి విద్యార్థికి సుమారు రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో తమ బిడ్డలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారనీ, తమ ఇబ్బందులు తొలగిపోతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి రాష్ట్రానికీ, దేశానికి తిరిగి అర్థవంతమైన సేవలు అందించే అవకాశం కలుగుతుందని ఆశాభావంతో ఉన్నట్టు ఓవర్సీస్‌ విద్యార్థులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -