Friday, February 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగ్రూప్‌ 1 అర్హులకు ఊరట

గ్రూప్‌ 1 అర్హులకు ఊరట

- Advertisement -

సింగిల్‌ బెంచ్‌ తీర్పు రద్దు..డివిజన్‌ బెంచ్‌ కీలక తీర్పు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రూప్‌-1 కొలువులకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో విజయం లభించింది. వీరి నియామకాలపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును పూర్తిగా రద్దు చేసింది. గ్రూప్‌-1 జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, ఎంపికైన అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్లను అనుమతించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సింగ్‌, మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం 123 పేజీల కీలక తీర్పు వెలువరించింది. సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేసింది.

గ్రూప్‌ 1 పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని తేల్చింది. అవకతవకలు జరిగినట్టుగా ఆధారాలు కూడా లేవని స్పష్టం చేసింది. గ్రూప్‌-1 జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును రద్దు చేయడమే కాకుండా మెయిన్స్‌ జవాబు పత్రాలు తిరిగి మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి వెలువరించిన తీర్పును రద్దు చేసింది. జవాబు పత్రాలు తిరిగి మూల్యాంకనం చేయాలని లేకుంటే తిరిగి మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలన్న తీర్పు చెల్లదని తేల్చింది. సింగిల్‌ జడ్జి తీర్పు అమలును పూర్తిగా నిలిపివేసింది.

తీర్పులో ఏముందంటే..
గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహణ, మూల్యాంకన విధానం, హాల్‌ టికెట్ల జారీ, పరీక్ష కేంద్రాల కేటాయింపు తదితర అంశాలపై ఆరోపణలకు ఆధారాలు లేవని డివిజన్‌ బెంచ్‌ తీర్పులో వివరించింది. ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలకు రెండు హాల్‌ టిక్కెట్లు ఇవ్వడం వల్ల ఎవరికీ నష్టం వాటిల్లలేదనీ, ఈ విధానం ఇతర పరీక్షల్లో కూడా అమలు జరిగిందని తెలిపింది. అభ్యర్థికి అన్యాయం జరిగినట్టు ఆధారాలు చూపలేదంది. పరీక్ష కేంద్రాల కేటాయింపులో మహిళా అభ్యర్థులను ప్రత్యేక కేంద్రాలకు కేటాయింపు వివక్ష కాబోదనీ, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యలో తేడాలున్నాయని చెప్పి అక్రమాలు జరిగాయంటే ఎలాగని ప్రశ్నించింది.

రెండుసార్లు చేశాక మార్కుల్లో వ్యత్యాసం ఉంటే మూడో మూల్యాంకనం చేయడం వల్ల నిష్పక్షపాతంగా జరిగిందనీ, మొదటి, రెండో మూల్యాంకనాల్లో 15 శాతానికి మించి మార్కుల్లో తేడా ఉంటే మూడో మూల్యాంకనం చేయడం పారదర్శకతకు నిదర్శమని స్పష్టం చేసింది. వ్యక్తిగత ఆరోపణల ఆధారంగా పరీక్షల ప్రక్రియ ఆగడానికి వీల్లేదని చెప్పింది. పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీక్‌, సామూహిక కాపీయింగ్‌ వంటివి జరిగాయని ఎవరూ చెప్పలేదనీ, ఆ తరహా ఆధారాలు కూడా ఎవరూ చూపలేదని తెలిపింది. పోస్టుల భర్తీ వ్యవహారంలో కోర్టు జోక్యానికి కచ్చితమైన ఆధారాలు ఉండాలని పేర్కొంది. కాబట్టి సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్టు డివిజన్‌ బెంచ్‌ ప్రకటించింది.

గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ, మూల్యాం కనంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అనుసరించిన విధానాలు, నిబంధనలు చట్టబద్ధం గానే ఉన్నాయని ధర్మాసనం తేల్చింది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానాలను నిర్ణయించే స్వేచ్ఛ ఉందని తేల్చి చెప్పింది. పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలు లేనప్పుడు, తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెబుతున్న లోపాలు రుజువుకానప్పుడు కోర్టులు జోక్యం చేసుకోరాదని వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వాటిని ఉదహరించింది.

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణ వ్యవహారంలో పరీక్ష మొత్తం న్యాయ సమ్మతంగా జరగలేదనే ఆరోపణలకు ఆధారాలు లేవని అభిప్రాయపడింది. అభియోగాలను నిర్ధారించే స్థాయిలో ఆధారాలు లేవని వెల్లడించింది. కొన్ని పరిపాలనా పరమైన లోపాలు ఉన్నప్పటికీ అవి పరీక్షల మొత్తం రద్దు చేయడానికి లేదా పునర్మూల్యాంకనానికి ఆదేశించడానికి సరిపోవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. టీఎస్సీపీఎస్సీ, అర్హత పొందిన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తున్నట్టు వెల్లడించింది.

ఇదీ నేపథ్యం..
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) 2024 ఫిబ్రవరిలో గ్రూప్‌-1లో 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువరించింది. 2024 అక్టోబరు 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. మార్చి 30న ప్రధాన పరీక్షలో అన్ని పరీక్షలకు 21,085 మంది హాజరవ్వగా, వారందరికీ టీజీపీఎస్సీ మార్కులను వెల్లడించింది. అర్హత పరీక్ష ఇంగ్లీష్‌తో పాటు ప్రధాన పరీక్షలైన ఆరు పేపర్ల మార్కులను ప్రకటించింది. అయితే టీజీపీఎస్సీ గ్రూప్‌1 మెయిన్స్‌లో జవాబు పత్రాల మూల్యాంకనం, ఎగ్జామ్‌ సెంటర్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తెలుగు మాధ్యమంలో జవాబులు రాసిన వారికి తీరని అన్యాయం జరిగిందని కూడా ఆ పిటిషన్లలో పేర్కొన్నారు.

ఈ పిటిషన్లను అనుమతిస్తూ గతంలో జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు సుదీర్ఘ విచారణ అనంతరం గత ఏడాది సెప్టెంబర్‌ 9వ తేదీన తీర్పు చెప్పారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని తీర్పులో తప్పుపట్టింది. తుది మార్కుల జాబితా, జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను రద్దు చేసింది. సుప్రీంకోర్టు సంజయ్ సింగ్‌ వర్సెస్‌ యూపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేసులో వెలువరించిన తీర్పు ప్రకారం మోడరేషన్‌ విధానం అనుసరించి పునర్మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. లేకపోతే మొత్తం మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తీర్పులో తేల్చి చెప్పింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ టీజీపీఎస్సీతోపాటు అర్హత సాధించిన పలువురు అభ్యర్థులు వేసిన అప్పీళ్లను ద్విసభ్య ధర్మాసనం ఆమోదించడంతో వివాదానికి తెరపడింది.

టీజీపీఎస్సీ వాదన..
సర్వీస్‌ కమిషన్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌ రెడ్డి వాదిస్తూ, రెండు హాల్‌ టికెట్లు జారీ చేయడం పరిపాలనా సౌలభ్యం కోసమేనని చెప్పారు. ఇలా చేయడం వల్ల అభ్యర్థులకు నష్టమేమీ జరగలేదన్నారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ ఎలాంటి పక్షపాతం లేదన్నారు. వికలాంగుల సౌకర్యార్థం ఒక కేంద్రాన్ని అదనంగా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వివరించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యలో స్పల్ప వ్యత్యాసం ప్రాథమిక సమాచారం, పరీక్షా కేంద్రాల నుంచి అధికారికంగా వచ్చిన సమాచారంలో వ్యత్యాసమేగానీ ఎలాంటి పొరపాట్లు జరగలేదన్నారు.

అన్ని పేపర్లను రెండు సార్లు మూల్యాంకనం చేశామని, 15శాతం కంటే ఎక్కువ మార్కుల్లో తేడా ఉంటే మూడోసారి మూల్యాంకనం జరిగిందన్నారు.. ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. బార్‌కోడ్‌ వ్యవస్థతో పూర్తిగా గోప్యతను పాటించామన్నారు. మూల్యాంకుల ఎంపిక పూర్తిగా కమిషన్‌ అధికార పరిధిలోనిదని, వారంతా అర్హత ఉన్న నిపుణులేనని చెప్పారు. సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టేయాలని అర్హత సాధించిన అభ్యర్థుల తరఫు న్యాయవాదులు వాదించారు.

అప్పీళ్లను కొట్టేయండి.
సింగిల్‌ జడ్జి తీర్పు చట్టబద్ధమేనని సింగిల్‌ జడ్జి వద్ద పిటిషన్లు దాఖలు చేసిన వాళ్ల తరఫు న్యాయవాదులు వాదించారు. పరీక్షా కేంద్రాల సంఖ్య పెరగడం, కొన్ని కేంద్రాల్లో పరీక్షలు రాసిన వాళ్లు అధిక సంఖ్యలో అర్హత సాధించడం, తెలుగు మీడియంలో పరీక్ష రాసిన వాళ్లకు తీరని అన్యాయ జరగడం వంటి అనేక కీలక విషయాలను సింగిల్‌ జడ్జి శాస్త్రీయంగా గుర్తించారని చెప్పారు. అప్పీళ్లను డిస్మిస్‌ చేయాలని కోరారు.

అర్హులకు నియామక పత్రాలు
ఇదిలా ఉండగా, గతంలోనే డివిజన్‌ బెంచ్‌ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఎంపికైన 562 మందికి ప్రభుత్వం ఇప్పటికే నియామక పత్రాలను అందజేసింది. తాజా తీర్పుతో నియమితులైన వారందరికీ పెద్ద ఎత్తున ఊరట లభించింది. తాజాగా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వెలువరించిన తీర్పుతో ఎంపికైన 562 మంది అభ్యర్థుల భవితవ్యంపై అనిశ్చితి తొలగిపోయింది. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్‌-1 పోస్టుల నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -