నవతెలంగాణ- హైదరాబాద్: పరువునష్టం కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఊరట లభించింది. అదనపు సాక్షులను అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గౌహతి హైకోర్టు కొట్టివేసింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేస్తూ.. జస్టిస్ అరుణ్ దేవ్ చౌదరితో కూడిన సింగిల్ జడ్జ్ బెంచ్ సోమవారం కామ్రూప్ మెట్రోపాలిటన్ అదనపు సెషన్జ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టింది. ఈ కేసులో ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అంజన్‌కుమార్ బోరా దాఖలు చేసిన తొమ్మిదేళ్ల నాటి పరువునష్టం కేసులో .. 2023 మార్చిలో ట్రయల్ కోర్ట్ మెజిస్ట్రేట్ ఆరుగురు సాక్షుల వాంగ్మూలాలను రికార్డింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ముగ్గురు అదనపు సాక్షుల జాబితాను అనుమతించేందుకు నిరాకరిచింది. ఈ ఉత్తర్వులను బోరా సవాలు చేశారు. ఈ కేసులో కొత్త సాక్షులను చేర్చుకోవడానికి అనుమతిస్తూ కామ్రూప్ మెట్రోపాలిటన్ అదనపు సెషన్స్ జడ్జి సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాహుల్‌గాంధీ గతేడాది జులైలో గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. వరుస విచారణల తర్వాత.. గౌహతి హైకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చింది. అలాగే కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.