బంధువుల ఆందోళన
నవతెలంగాణ-జనగామ
జనగామ జిల్లాలోని సబ్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న వారాల మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో మృతిని కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం జనగామ సబ్ జైలు వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వారాల మల్లయ్య.. పక్కింటి వారితో జరిగిన వివాదంలో పోలీసులు కేసు నమోదు చేయగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి గత సోమవారం జనగామ సబ్ జైలుకు తరలించారు. మనస్తాపం చెందిన మల్లయ్య శనివారం మధ్యాహ్నం మరుగుదొడ్లు కడిగే బ్లీచింగ్ పౌడర్‌ను నీళ్లలో కలుపుకొని తాగాడు. విషయం తెలుసుకున్న జైలు సిబ్బంది జనగామ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా, శనివారం రాత్రి రిమాండ్ ఖైదీ మృతిచెందాడు.
దాంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని, మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. తన భర్తను ఎవరు చంపారో.. ఎందుకు చంపారో.. చెప్పాలని పోలీసులను నిలదీస్తూ మృతుని భార్య శోకసముద్రంలో మునిగిపోయింది. మృతునికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉండగా భార్య ప్రస్తుతం గర్భవతి. విషయం తెలుసుకున్న జనగామ డీసీపీ, పోలీసులు సబ్ జైలు వద్దకు చేరుకొని.. కేసు నమోదు చేసి మృతికి గల కారణాన్ని కనిపెట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.