Saturday, October 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకుల్సుంపురాలో హైడ్రా కబ్జాల తొలగింపు

కుల్సుంపురాలో హైడ్రా కబ్జాల తొలగింపు

- Advertisement -

1.30 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
రూ.110 కోట్ల విలువైన భూమి

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ గోషామహల్‌ నియోజకవర్గ పరిధిలోని ఆసిఫ్‌నగర్‌ మండలం కుల్సుంపూర్‌లో సర్వే నెం.50లో ఆక్రమణలను శుక్రవారం హైడ్రా తొలగించింది. వ్యాపారి అశోక్‌సింగ్‌ ఆక్రమణలో ఉన్న 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అశోక్‌సింగ్‌.. అక్కడ షెడ్లు వేసి విగ్రహ తయారీదారులకు అద్దెకు ఇస్తున్నాడు. ఆయితే ఆ భూమి ప్రభుత్వానికి చెందినదని, దాన్ని కాపాడాలంటూ హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను హైదరాబాద్‌ కలెక్టర్‌ కోరారు. అంతేకాకుండా ప్రజావాణిలో సైతం స్థానికుల నుంచి ఫిర్యాదులందాయి. ఈ క్రమంలో హైడ్రా అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకున్నాక హైడ్రా కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆ భూమి తనదేనంటూ అశోక్‌ సింగ్‌ సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో హైడ్రా కమిషనర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం అధికారులు ఆక్రమణలను తొలగించారు.

ఇప్పటికే రెండుసార్లు ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగించారు. అయినప్పటికీ ఆ స్థలం ఖాళీ చేయకుండా తిరిగి షెడ్లు వేసిన అశోక్‌ సింగ్‌ అద్దెలను తీసుకుంటున్నాడు. ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులపై దాడులకు పాల్పడ్డాడు. అతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో భూకబ్జాదారుడుగా, రౌడీ షీటర్‌గా కేసులు నమోదయ్యాయి. లంగర్‌హౌస్‌, మంగళహాట్‌, శాహినాయత్‌గంజ్‌ పోలీసు స్టేషన్లలో అశోక్‌సింగ్‌పై సుమారు ఎనిమిదికి పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా ఫెన్సింగ్‌ వేసింది. కుల్సుంపురలో స్వాధీనం చేసుకున్న భూమిని ప్రజావసరాల కోసం వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించాలనుకుంటున్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -