– మొత్తుకుంటున్నా పట్టించుకోని కేంద్ర సర్కార్
– ఆయిల్ పామ్ దిగుమతులపై ప్రభావం..పడిపోయిన రేట్లు
– పాడి రైతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో నేటికీ 60శాతానికిపైగా ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. అలాంటి రంగంపై కార్పొరేట్ల కన్ను పడింది. లాభాల వేటలో భాగంగా చట్టాలు మార్చాలనీ, సుంకాలు తగ్గించాలనే కార్పొరేట్ల ఆదేశాలకు తలొగ్గి మోడీ సర్కారు రైతాంగం పొట్టకొడుతు న్నది. అమెరికా, యూరోపియన్ దేశాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య మూడో ఒప్పందాలు దేశ రైతాంగానికి ప్రాణసంకటంగా మారబోతున్నా యి. ఈ ఒప్పందాల ప్రభావం తెలంగాణలో పాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, నూనెగిం జలు పండించే రైతులపైనా పడబోతున్నది.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వేరుశనగ, నువ్వులు, కుసుమలు, పామాయిల్ సాగవుతున్నాయి. ఆయిల్ మీద దిగుమతి సుంకం 27 శాతం ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం 17 శాతానికి తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా ఆయిల్‌పామ్ సాగును విపరీతంగా ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రంలో 5 లక్షలా 70 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతున్నది. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెల పంటల దిగుమతిపై సుంకాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం పదేపదే కోరుతూ వస్తున్నది. ఇప్పటికే నాలుగైదు సార్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు సైతం రాశారు. ప్రత్యక్షంగా కలిసి ఇదే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. అయినా కార్పొరేట్ల ప్రయోజనాలే మా ధ్యేయం అన్నట్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదురక ముందు టన్ను పామాయిల్ గెలలకు రూ.24 వేలు లభించేది. ఒప్పందం జరిగాక అది రూ.17 వేల వరకు పడిపోయింది. దీని ద్వారా ఏటా నాలుగైదు వేల కోట్ల రూపాయలను ఒక్క తెలంగాణ రాష్ట్ర రైతాంగమే నష్టపోనున్నది.
తెలంగాణలో సొసైటీల్లో రిజిస్ట్రర్ అయిన పాల రైతులు 3.5 లక్షలకుపైనే ఉన్నారు. ఇదికాకుండా ఒకటెండ్రు బర్రెలు, ఆవులు, గేదెలు పెంచి ఊర్లలో పాలు అమ్ముకునే వారు కూడా ఉన్నారు. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల పరిశ్రమపై తెలంగాణలో లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పటికే వారికి సరైన పాలరేటు దక్కట్లేదు. పాలపొడి, బట్టర్ చీజ్ లాంటివి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే పాడి రైతుల ఉపాధి దెబ్బతింటుంది. రైతులతో పాటు సహకార రంగంలో ఉన్న విజయ, మదర్ డెయిరీ, ముల్కనూరు, కరీంనగర్ డెయిరీల ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉంది. గొర్రె, మేక మాంసం దిగుమతులపై సుంకం ఎత్తివేతతో మన రాష్ట్రంలోని ఆ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారిపై ప్రత్యక్షం గానో, పరోక్షంగానే ప్రభావం పడనున్నది. మన రాష్ట్రానికి సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరుంది. ఒక్క గద్వాల జిల్లాలోనే విత్తనాలను పండించే రైతులు 25 వేల మంది ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విత్తన ముసాయిదా చట్టం తెచ్చిందనే విమర్శ ఉంది. కొత్త చట్టంతో ఇప్పుడు విత్తనాలు ఉత్పత్తి చేసే రైతులకు, విత్తనాలను కొనే రైతులకు కూడా నష్టం చేకూరే ప్రమాదముంది. విదేశీ కంపెనీలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ సౌకర్యం కల్పించడం అత్యంత ప్రమాదకరం. ప్రపంచవ్యాప్తంగానూ బహుళజాతి సంస్థలైన బెయర్, సిన్‌జెంటా, డూపాయింట్, కార్గిల్ కంపెనీలు విత్తనంపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. దీంతో విత్తనం రైతుకు ఖరీదైపోతుంది. ఒకసారి వాడిన విత్తనం వాడినా ఆ కంపెనీలు కేసులు పెట్టే ప్రమాదముంది. ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే విత్తనాలు కూడా వచ్చే ప్రమాద ముంది. మన దగ్గర జెనిటిక్ విత్తనాల(ఒక బీటీ పత్తి తప్ప)ను వాడట్లేదు. దీని వల్ల ప్రజల ఆరోగ్యమే కాకుండా పర్యావరణం కూడా దెబ్బతినే ప్రమాదముంది. మన రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. నరేంద్రమోడీ ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిబేళ్ల దిగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ఈ ఏడాది యధేచ్ఛగా దిగుమతి అయ్యింది. దీని ప్రభావం మన రాష్ట్రంపైనా పడింది. ఓవైపు కాలం కాక, మరోవైపు మద్దతు ధరకు సగం పంటనే కొనటం వంటి కారణాలతో పది లక్ష మంది పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలి సిందే. వరి, పత్తి తర్వాత మొక్కజొన్న మేజర్ పంట. డిమాండ్ ఉంది. మద్దతు ధర కంటే ఎక్కువ కూడా వస్తున్నది. దీని దిగుమతి కూడా కేంద్రం మార్గాలు తెరిచింది. దీంతో మున్ముందు మొక్కజొన్న రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదముంది.
వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర
ఎఫ్‌టీఏ ఒప్పందం ఆర్థిక వలసరాజ్యానికి ద్వారం తెరిచినట్టే. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయబోతున్నాం. విస్తారమైన భారతీయ మార్కెట్‌ను కార్పొరేట్లకు అప్పగించే మార్గాలను మోడీ సర్కారు బార్లా తెరుచుకుంటూ పోతున్నది. 60 శాతానికిపైగా ప్రజలకు జీవనోపాధి అయిన వ్యవసాయ రంగమనే తేనెతుట్టెను మోడీ సర్కారు కదుపుతున్నది. ఇది ప్రమాదకరం. ప్రజల ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదముంది. తెలంగాణలోని పత్తి, మొక్కజొన్న, నూనెగింజల పంటలు పండించే రైతులతో పాటు పాడిపరిశ్ర మైనా తీవ్ర ప్రభావం పడబోతున్నది. జరగబోయే నష్టాన్ని రైతులకు విడమర్చి చెబుతార. కేంద్ర విధానాలపై పోరాటాలకు సన్నద్ధం చేస్తాం.
– టి.సాగర్, రైతు సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి



