నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలో కషీర్ హనుమాన్ వద్ద విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. నివాస గృహాలకు విద్యుత్ సరఫరా జరిగే తీగల కింద ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలు ఉండడంతో ఏమాత్రం గాలి వేసిన తరచూ విద్యుత్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని కషీర్ హనుమాన్ దేవాలయం కాలనీ ప్రజలు సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన సర్పంచ్ విద్యుత్ శాఖ ఏఈ అన్నయ్యతో మాట్లాడారు. విద్యుత్ తీగల్లోకి చొచ్చుకెళ్లిన చెట్ల కొమ్మలను తొలగించే ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో ఏఈ అన్నయ్య, తన సిబ్బందితో గురువారం విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగింప చేశారు.
చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమాన్ని ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామానికి నూతనంగా నాలుగు పవర్ ట్రాన్స్ ఫార్మర్లు మంజూరయ్యాయని, వాటిని త్వరలోనే గ్రామంలో వివిధ ప్రదేశాల్లో బిగింపజేసి గ్రామంలో విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తామన్నారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపుకు సహకరించిన ఏఈ అన్నయ్యకు గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు నవీన్ కుమార్, లైన్ మెన్ అప్సర్, స్థానికులు రేషన్ డీలర్ భూమేశ్వర్, చింత శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



