Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅనుమతుల్లేని కేబుళ్లను తొలగించండి

అనుమతుల్లేని కేబుళ్లను తొలగించండి

- Advertisement -

ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఆదేశం

నవతెలంగాణ-హైదరాబాద్‌
విద్యుత్‌ స్తంభాలకు అనుమతి లేకుండా ఉన్న కేబుళ్లను వెంటనే తొలగించాలని ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ఆదేశించింది. అనుమతులున్న వాటిని గుర్తించి, అవి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలంది. వాటిపై చట్టప్రకారం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అంతేగాకుండా అనుమతులున్న కేబుల్‌ ఏజెన్సీలు అనధికారిక కేబుళ్లను తొలగించడానికి విద్యుత్‌ సిబ్బందికి సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ కేబుళ్లను తొలగించడానికి, ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, టీజీఎస్పీడీసీఎల్‌లకు గత విచారణలో ఆదేశించిన మేరకు సోమవారం అఫిడవిట్లను దాఖలు చేశాయి. విద్యుత్‌ స్తంభాలకు చాలా చాలా కేబుళ్లు ఉంటున్నాయనీ, వాటిలో ఏవి చట్ట ప్రకారం ఉన్నాయో ఏవి చట్ట వ్యతిరేకంగా ఏర్పాటు చేసినవో గుర్తించేందుకు కష్టం అవుతుందని తెలిపాయి. వీటిపై చర్యలు తీసుకోడానికి చాలా సమయం పడుతుందని చెప్పాయి. ఈ వివరాలను జస్టిస్‌ నగేశ్‌ భీమపాక రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. దీనిపై తగిన ప్రతిపాదనలతో రావాలని ఆదేశించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.
హైదరాబాద్‌ సిటీలోని రామంతాపూర్‌లో విద్యుద్ఘాతంతో ఆరుగురు మరణించిన ఘటన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కేబుళ్లను కట్‌ చేయడాన్ని సవాలు చేస్తూ భారతి ఎయిర్‌టెల్‌ హైకోర్టును ఆశ్రయించింది. అన్ని అనుమతులు తీసుకున్నాకే కరెంటు స్తంభాల ద్వారా కేబుళ్లు తీసుకున్నామని తెలిపింది. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా నగరమంతా కేబుళ్లను కట్‌ చేయడం చెల్లదని తెలిపింది. ఈ వ్యవహారంపై గత విచారణలోనే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కరెంటు వైర్లు తగిలి ఆరుగురు మరణించారనీ, ఆ మృతులకు ఎవరు బ్యాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. తండ్రి చనిపోతే పుట్టినరోజు నాడే తొమ్మిదేళ్ల బాలుడు పాడె మోయాల్సిన, చితికి నిప్పు పెట్టాల్సిన దుస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. పిటిషన్‌లో ప్రతివాదిగా ఉన్న. టీజీఎస్పీడీసీఎల్‌ స్పందిస్తూ, రాష్ట్రంలో సుమారు 20 లక్షలకు పైగా స్తంబాలుంటే 1.73 లక్షల స్తంభాలకు మాత్రమే కేబుళ్లు లాగేందుకు అనుమతులున్నాయని తెలిపింది. అయితే ప్రతి స్తంభానికీ విచ్చలవిడిగా కేబుళ్లున్నాయని చెప్పింది. పరిమితికి మించి కేబుళ్లుండటంతో స్తంభాలు భారం భరించలేక వైర్లు నేలకు తగిలే ప్రమాదకర పరిస్థితులున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టు, కేబుళ్ల బరువుకు స్తంబాలు వాలిపోతుంటే కింది సిబ్బంది జేబులు సొమ్ముతో నిండుతున్నాయని వ్యాఖ్య చేసింది. అక్రమంగా కేబుళ్లు ఉన్నాయని గుర్తించినపుడు వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. ఇలాంటి విషయాలపై కఠినంగాఉండాలని తేల్చి చెప్పింది. ఆరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసింది ఆ కుటుంబాల వేదనను అర్ధం చేసుకోవాలంది.ఈ నిర్లక్ష్యానికి సమష్టి బాధ్యత తీసుకోవాల్సిందేనని పేర్కొంది. అనుమతులేని కేబుళ్లతోపాటు అనుమతులుండీ వేలాడుతూ మనిషికి తగిలేలా ఉన్న కేబుళ్లను తొలగించాల్సిందేనని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad