Saturday, December 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగాంధీ పేరు తొలగింపు అక్షేపణీయం

గాంధీ పేరు తొలగింపు అక్షేపణీయం

- Advertisement -

ఉపాధిహామీ చట్టం పేరు మార్చడం సమాఖ్య వ్యవస్థపై దాడి : కేంద్రంపై మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించి వికసిత్‌ భారత్‌ జీ రామ్‌ జీగా మార్చడం ఆక్షేపణీయమని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త బిల్లు కేవలం ఒక పేరు మార్పు మాత్రమే కాదనీ, ఇది దేశ సమాఖ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై శుక్రవారం స్పందించారు. ఈ చట్టంలో 60:40 నిధుల నిష్పత్తిని తెరపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉపాధి హామీని బలహీనపరచాలని చూస్తోందని విమర్శించారు. ఈ నిబంధన వల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. ఇది పేదలకు పని కల్పించే చట్టాన్ని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అధికారాలను తగ్గిస్తూ కేంద్రం తన పెత్తనాన్ని పెంచుకోవడానికి ఈ బిల్లును ఒక ఆయుధంగా వాడుకుంటోందనీ, ఇది రాజ్యాంగం కల్పించిన రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాలరాయడమేనని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ మౌనాన్ని ఆయన తప్పుబట్టారు. 60:40 నిష్పత్తి వల్ల రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకుండా కాంగ్రెస్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న కపటత్వాన్ని ఆయన ప్రశ్నించారు. బయట సమాఖ్య వ్యవస్థ గురించి, రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ లోపల మాత్రం రాష్ట్రాలను బలహీనపరిచే బీజేపీ చర్యలకు లోపాయికారిగా మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. అధికార కేంద్రీకరణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాలు అని ఈ బిల్లు ద్వారా మరోసారి స్పష్టమైందని తెలిపారు. నిరుపేదలకు పని కల్పించే ఈ చట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ దీన్ని సంస్కరణగా చిత్రీకరించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం దేశాభివృద్ధికి విఘాతమని స్పష్టం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని దాని మౌలిక స్వరూపం దెబ్బతినకుండా కాపాడాలనీ, గాంధీ పేరును యధావిధిగా కొనసాగిస్తూ రాష్ట్రాల హక్కులను గౌరవించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
గాంధీ పేరు తొలగింపు దేశానికి మంచిది కాదు :
మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌
గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడంతోపాటు మహాత్మాగాంధీ పేరును తొలగించడం దేశానికి మంచిది కాదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం పార్లమెంటులో ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో వీబీ జీ రామ్‌ జీ బిల్లును తెచ్చారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు ముఖ్యమైన తప్పిదాలు చేసిందని తెలిపారు. మహాత్మా గాంధీ పేరు తీసేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం భరించేదని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించాలని నిబంధన పెట్టడం సరైంది కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులను భరించలేవని తెలిపారు. దీంతో పేదరికం పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ ఉపాధి హామీ చట్టం రద్దవుతుందని పేర్కొన్నారు. వామపక్ష పార్టీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం వచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -