తెలుగులో తొలి నేపథ్య గాయని, నటి రావు బాలసరస్వతి దేవి (97) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
లలిత సంగీత సామ్రాజ్ఞిగా పేరొందిన బాల సరస్వతి దేవి ఆకాశవాణి సంగీత కార్యక్రమాలతో అందరికీ సుపరిచితురాలు. నేపథ్యగాయనిగా ఆమె సంగీత ప్రియులకు ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం ఆమె సొంతం.
మద్రాస్‌లో 1928 ఆగస్ట్ 28న పార్థసారధి, విశాలాక్షి దంపతులకు బాలసరస్వతి జన్మించారు. చిన్నప్పట్నుంచే కర్ణాటక, హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నారు. తన 6వ ఏట ‘నమస్తే నా ప్రాణనాథ’, ‘ఆకలి సహింపజాల’ వంటి పాటలను సోలోగా పాడారు. సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘సతీ అనసూయ’ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయం అయ్యారు. నేపథ్య గాయనిగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, సింహళ భాషల్లో దాదాపు 2 వేలకు పైగా పాటలు పాడారు. అలాగే ‘సతీ అనసూయ’, ‘బాలయోగిని’, ‘ఇల్లాలు’, ‘చంద్రహాస’, ‘రాధిక’, ‘సువర్ణమాల’, ‘వాలి సుగ్రీవ’ వంటి చిత్రాల్లోనూ నటించి, మెప్పించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి రావు బాలసరస్వతి దేవి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
బాలసరస్వతి మరణం కలచివేసింది. నటి, గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు. – బాలకృష్ణ
సరస్వతి కన్నుమూశారని తెలిసి చింతించా. లలిత సంగీతంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, ఆకాశవాణిలో ఎన్నో గీతాలు ఆలపించారు. – పవన్ కళ్యాణ్
ప్రముఖ నేపథ్య గాయని, నటి రావు బాలసరస్వతి దేవి ఇకలేరు
- Advertisement -
- Advertisement -