సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్
నవతెలంగాణ – కట్టంగూర్
నార్కట్ పల్లి డలం అక్కెనపల్లి నుంచి కట్టంగూరు మండలం పరిధిలో ఉన్న ఆసిఫ్‌నగర్ కాల్వకు తక్షణం నిధులు కేటాయించి పూడిక తొలగించి మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పరడ గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆసిఫ్‌నగర్ కాల్వను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1905లో నిజాం కాలంలో నిర్మించిన ఈ కాల్వకు ఇప్పటివరకు ప్రభుత్వాలు సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు.
మండలంలోని సుమారు 15 గ్రామాలకు చెందిన 5,000 ఎకరాలకు ఈ కాల్వ ద్వారా సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రస్తుతం కాల్వ చెట్లు, మట్టి, పూడికతో నిండిపోవడంతో పాటు గేట్లు కూడా శిథిలావస్థకు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపించి కాల్వ మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులే స్వయంగా డబ్బులు వెచ్చించి మరమ్మతులు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమన్నారు. నిధుల కొరతతో గ్రామాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ లోపించడంతో పరిస్థితి దారుణంగా తయారయింది అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీసం రూ.10 లక్షలు కేటాయించి కాల్వను మరమ్మతు చేసి సాగునీరు అందించాలన్నారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు, గంజి మురళి, మండల కమిటీ సభ్యులు కొండూరు సత్తయ్య, కట్టబక్కయ్య, గడగోజు రవీంద్రాచారి, ముస్కు రవీందర్, జాలా ఆంజనేయులు, పెంజర్ల కృష్ణ, గద్దపాటి ఎల్లయ్య, ముస్కు మారయ్య, గోలి రాములు ఉన్నారు.



