Sunday, November 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు

సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు

- Advertisement -

తాగునీటికి ఇబ్బంది లేకుండా పనులు
డిసెంబర్‌ 1 నుంచి నీటిని ఖాళీ చేస్తాం
విడతల వారీగా నీటి విడుదల
నీటిని విడుదల చేస్తూ ప్రాజెక్టు డ్యామేజీ పరిశీలన : ఈఎన్‌సీ అంమ్జాద్‌ హుస్సేన్‌

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
సింగూరు ప్రాజెక్టు డ్యాం ప్రమాదంలో ఉందని, మరమ్మతుల కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిందని ఇరిగేషన్‌ జనరల్‌ ఈఎన్‌సీ అంమ్జాద్‌ హుస్సేన్‌, మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌ రెడ్డి తెలిపారు. శనివారం ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీలు సింగూరు ప్రాజెక్టును పరిశీలించి కట్ట డ్యామేజీ, కట్ట కుంగిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సింగూరు ప్రాజెక్టు డ్యామేజీ అయ్యింది వాస్తవమేనని అన్నారు. దీనిపై ఆధారపడి మిషన్‌ భగీరథ, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ సిస్టం నడుస్తుందని తెలిపారు. ఆ రెండు కీలకమైన వాటర్‌ స్కీమ్స్‌ పూర్తిగా సింగూరుపై ఆధారపడి ఉందని, కాబట్టి ఇబ్బందులు లేకుండా నిపుణుల కమిటీని ప్రభుత్వం వేసిందన్నారు. ఇరిగేషన్‌, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌, ఈఎన్‌సీ కలిసి ప్రాజెక్టును పరిశీలించినట్టు తెలిపారు.

నీటి కెపాసిటీకి తగ్గట్టు డ్యాం డ్యామేజీ పరిశీలన చేస్తూ ఎక్కడి వరకు ప్రాజెక్టు డ్యామేజీ అయ్యిందో తెలుసుకుంటామని, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డ్యాం డ్యామేజీ ఎంత వరకు అయ్యిందో ఆ మేరకు మరమ్మతులు చేపడతామని వివరించారు. మొదటగా ప్రభుత్వ అనుమతి తీసుకుని మూడు శాఖలు సమన్వయంతో డ్యామ్‌ను రిపేర్‌ చేస్తూ విడతల వారీగా పనులు కొనసాగిస్తూ మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. మరో 50 సంవత్సరాల వరకు ప్రాజెక్టుకు రిపేర్లు రాకుండా చర్యలు తీసుకుంటూ పనులను చేపడతామని, ప్రాజెక్టు కింది భాగం నుంచి రిపేర్‌ చేస్తామని, పై భాగం నుంచి రిపేర్‌ చేస్తే కట్ట పాడైపోయే అవకాశం ఉంటుందన్నారు. ప్రాజెక్టు కింద భాగం ఎంత వరకు గట్టిగా ఉందో పరిశీలించి అక్కడి నుంచి ప్రాజెక్టు రిపేర్‌ చేయాల్సి ఉంటుందని, మరమ్మతులు చేస్తున్న సందర్భంగా రైతులకు సాగుకు, ప్రజలకు తాగుకు నీటి ఇబ్బందులు లేకుండా పనులు చేపడతామని తెలిపారు. మిషన్‌ భగీరథ, ఇరిగేషన్‌, వాటర్‌ వర్క్స్‌ శాఖలు సమన్వయంతో పని చేస్తూ ఎప్పటికప్పుడు ఉమ్మడి పర్యవేక్షణ చేస్తూ పనులు కొనసాగిస్తామన్నారు.

డిసెంబర్‌ 1 నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం
డిసెంబర్‌ 1వ తేదీ నుంచి పనులు ప్రారంభించి జూన్‌ నెల వరకు పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు తెలిపారు. ఈ పనుల కోసం టెండర్లు పూర్తి అయ్యాయన్నారు. నీటి ఇబ్బందులు రాకుండా ప్రాజెక్టు డ్యామేజీ అంచనా వేసి పనులు ప్రారంభించాలని ఆగామని, రిపేర్ల కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే అగ్రిమెంట్‌ చేసి పనులను ప్రారంభిస్తామన్నారు. సింగూరు పూర్తి కెపాసిటీ 29.9 టీఎంసీలు ఉండగా కట్ట బలహీనంగా ఉండటంతో ప్రస్తుతం 16.5 టీఎంసీలు నిల్వ ఉంచినట్టు వివరించారు. బర్మ్‌ లెవల్‌ 518 ఉంటుంది. అక్కడ కూడా 9 టీఎంసీల నీరు నిలువ ఉంటుందన్నారు. అక్కడి వరకు నీటిని విడుదల చేసి డ్యాం డ్యామేజీని అంచనా వేస్తామని, సింగూరు ప్రాజెక్టు కట్ట నాలుగు ప్లేస్‌లలో డ్యామేజీ అయ్యిందన్నారు.

కట్ట 800 మీటర్లు కంప్లీట్‌ జారీ పోయిందని, అదే విధంగా కట్ట మొత్తం 6.5 కిలోమీటర్లు మొత్తం కుంగిపోయిందని తెలిపారు. ప్రస్తుతానికి కట్టకు ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. అలాగే, ప్రాజెక్టు నుంచి రైతులకు సాగుకు నీరిచ్చే కాలువకు రిపేర్‌ చేస్తామని, ఆ పనులు కూడా వీటితో పాటు ప్రారంభిస్తామని తెలిపారు. సింగూరు కెనాల్‌ నుంచి 40వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తామని, వారికి సరఫరా చేసేందుకు పంపింగ్‌ ద్వారా నీటిని అందించవచ్చన్నారు. ప్రాజెక్టును పరిశీలించిన వారిలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌, డిజైన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణ రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ సీజీఎం బ్రిజేష్‌, సంగారెడ్డి చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఈ పోచమల్లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -