Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుత్వరలో ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ

త్వరలో ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ

- Advertisement -

– డిగ్రీలో సిలబస్‌ మార్చాం
– ఇంగ్లీష్‌ సబ్జెక్టులో విప్లవం రాబోతున్నది
– ఎప్‌సెట్‌ మాక్‌ కౌన్సెలింగ్‌తో విద్యార్థులకు ప్రయోజనం
– సీఎస్‌ఈలో చేరిన అందరికీ ఉద్యోగాలు రావు
– ఇంజినీరింగ్‌ కోర్‌ బ్రాంచీల్లో చేరినా ఉపాధి అవకాశాలు : నవతెలంగాణతో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ బాలకిష్టారెడ్డి

విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి చెప్పారు. ఆ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వ్యవసాయం, రైతాంగానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఇక నుంచి విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. నిధులను కేటాయిస్తుందని వివరించారు. డిగ్రీలో సిలబస్‌ను మార్చామన్నారు. ఇంగ్లీష్‌ సబ్జెక్టులో విప్లవం రాబోతున్నదనీ, విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా మార్పులు చేశామని చెప్పారు. ఇంజినీరింగ్‌ సహా వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు విజయవంతమయ్యాయని అన్నారు. ఎప్‌సెట్‌ మాక్‌ కౌన్సెలింగ్‌తో విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)లో చేరిన విద్యార్థులందరికీ ఉద్యోగాలు రాబోవని స్పష్టం చేశారు. కోర్‌ బ్రాంచీల్లో చేరినా ఉద్యోగాలు తప్పనిసరిగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నవతెలంగాణ పదో వార్షికోత్సవం సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు బాలకిష్టారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు…
ఇంగ్లీష్‌ సబ్జెక్టుపై పరిజ్ఞానం ఉంటేనే ఉద్యోగావకాశాలు
‘పదో వార్షికోత్సవం సందర్భంగా నవతెలంగాణ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు. ప్రజలకు ఉపయోగపడే వార్తలు మరిన్ని రావాలి. డిగ్రీ కర్రికులమ్‌ ఎప్పటి నుంచో అప్‌డేట్‌ చేయలేదు. ఆ ప్రాసెస్‌ను ప్రస్తుత విద్యా సంవత్సరంలో పూర్తి చేశాం. కమిటీలు వేసి కసరత్తు చేశాం. కర్రికులమ్‌ మార్చడం యూజీసీ తప్పనిసరి చేసింది. సోషల్‌ సైన్సెస్‌కు పురుషోత్తం, సైన్స్‌కు మహమూద్‌, బీఏ, బీకాం, లా, ఇతర కోర్సులకు తాను చైర్మెన్‌గా వ్యవహరించాం. డిగ్రీ ఇంగ్లీష్‌లో విప్లవం రాబోతున్నది. ఆ సబ్జెక్టుపై ఆసక్తి కలిగించేలా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉదాహరణలు, సంభాషణలు జోడించాలని నిర్ణయించాం. అందుకనుగుణంగా పాఠ్యాంశాలను రూపకల్పన చేశాం. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందుతాయనీ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉప యుక్తంగా ఉంటుందని భావిస్తున్నాం. విద్యార్థుల సాధన కోసం వర్క్‌బుక్స్‌ రూపొందిస్తున్నాం. ఆడియో పాఠాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంగ్లీష్‌ సబ్జెక్టును బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరిన విద్యార్థులందరూ చదువుతారు. ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్‌ అంటే భయం. పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఉన్నది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు ఇంగ్లీష్‌ పరిజ్ఞానం అవసరం. అప్పుడే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ఇంగ్లీష్‌ పట్ల భయాన్ని పోగొట్టాలి. అందుకనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తున్నాం.’అని బాలకిష్టారెడ్డి అన్నారు.
విజయవంతంగా సెట్స్‌ నిర్వహణ
‘రాష్ట్రంలో ఇంజినీరింగ్‌తోపాటు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు (సెట్స్‌) విజయవంతంగా నిర్వహించాం. ప్రశ్నాపత్రం లీకేజీ లేకుండా, కంప్యూటర్లు మొరాయించకుండా పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది హాల్‌టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించాం. దాన్ని విద్యార్థులు స్కాన్‌ చేస్తే వారి నివాసం నుంచి పరీక్షా కేంద్రానికి ఎంత దూరం ఉంది, ఎంత సమయంలో చేరుకుంటారనే సమాచారం తెలుసుకోవచ్చు. దానివల్ల ఆలస్యంగా రాకుండా విద్యార్థులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎప్‌సెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షలకు 5,20,871 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 4,74,719 మంది పరీక్షలకు హాజరయ్యారు.’అని బాలకిష్టారెడ్డి వివరించారు.
డిగ్రీలో కామన్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ అమలు
‘డిగ్రీ విద్యకు సంబంధించి అన్ని విశ్వవిద్యాలయాల్లో కామన్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ను అమలు చేయాలని నిర్ణయించాం. డిగ్రీ విద్యార్థులకు కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చాం. అయితే సిలబస్‌ అప్‌డేట్‌గా లేదు. దాన్ని గుర్తించి సిలబస్‌ను మార్చాం.ప్రస్తుత విద్యాసంవత్సరంలో డిగ్రీ మొదటి సెమిస్టర్‌ విద్యార్థులకు కొత్త సిలబస్‌ అమల్లోకి వస్తుంది. విద్యార్థుల కోసం రీడింగ్‌ మెటీరియల్‌ను సిద్ధం చేశాం.’అని బాలకిష్టారెడ్డి చెప్పారు.
ఇక విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత
‘విశ్వవిద్యాలయాలకు సరిపోను నిధుల్లేవనేది, అధ్యాపక పోస్టుల భర్తీ లేదనేది వాస్తవం.సీఎం రేవంత్‌రెడ్డి వర్సిటీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. దానిమీద కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ అధ్యాపకులు, సిబ్బంది పరిస్థితి ఏంటన్న సమస్య మా ముందుకు వచ్చింది. వారిని రక్షించేందుకు అధ్యయనం చేశాం. ఇందుకోసమే జాప్యం జరిగింది. విశ్వవిద్యాల యాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేస్తాం. వర్సిటీలకు నిధులు కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. నా ప్రయత్నం చేశాను. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టికి విజ్ఞప్తి చేశాను. అయినా నిధులు పూర్తిస్థాయిలో రాలేదు. రైతుభరోసా, రైతు రుణమాఫీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటి నుంచి విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తారు. త్వరలోనే నిధులు వస్తాయి.’అని బాలకిష్టారెడ్డి వివరించారు.
కన్వీనర్‌ కోటా సీట్లు వంద శాతం స్థానికులకే
‘ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మాక్‌ కౌన్సెలింగ్‌ను ఈ ఏడాది ప్రవేశపెట్టాం. మాక్‌ కౌన్సెలింగ్‌ వల్ల సీట్ల కేటాయింపును చూసుకుని ఎప్‌సెట్‌ మొదటి విడతలో వెబ్‌ఆప్షన్లను మార్చారు. దానివల్ల 36 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు లోకల్‌, నాన్‌ లోకల్‌ అంశంపై ఉన్నత విద్యామండలి నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్నది. కన్వీనర్‌ కోటా సీట్లను వంద శాతం స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించాం. అన్ని ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్‌ను చేపట్టాం.’అని బాలకిష్టారెడ్డి చెప్పారు.
ఇంజినీరింగ్‌ కోర్‌ బ్రాంచీలపై అవగాహన పెంచాం
‘ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ), డిగ్రీలో బీఎస్సీ, బీకాం కంప్యూటర్‌ కోర్సుల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు. కోర్‌ బ్రాంచీలకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు చెప్తున్నాం. అవగాహన కల్పిస్తున్నాం. సీఎస్‌ఈలో చేరిన విద్యార్థుల్లో వంద మందికి ఉపాధి అవకాశాలు దొరికితే వెయ్యి మంది చేరుతున్నారు. మిగతా 900 మంది పరిస్థితి ఏంటీ?. వాళ్లు ఉద్యోగాల్లేక రోడ్డు మీదికి వస్తున్నారు. ఇంజినీరింగ్‌లో కోర్‌ బ్రాంచీలను రక్షించాలి. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కూడా చెప్తున్నారు. కోర్‌ బ్రాంచీల్లో చేరినా ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి.’అని బాలకిష్టారెడ్డి అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img