నవతెలంగాణ వనపర్తి
వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో నెలకొన్న ప్రజా సమస్యల తో పాటు నిరుద్యోగ యువత సమస్యలను కూడా పరిష్కరించాలని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య (డివైఎఫ్ఐ) వనపర్తి జిల్లా కార్యదర్శి గడ్డికోపుల మహేష్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యేకు విన్నవించారు. గోపాల్పేట మండలంలోని చెన్నారం నుంచి మాచుపల్లి మీదుగా సింగోటం వరకు డబుల్ రోడ్డు పనులు నడుస్తున్నాయని, సంవత్సరాలు గడుస్తున్న ఇంకా పూర్తి కాలేదని, వాటిని వెంటనే పూర్తి చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రైమరీ స్కూల్ నిర్మాణం సంవత్సరాలు గడుస్తున్న నిర్మాణంలోనే ఉంది పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. హెల్త్ సెంటర్ బిల్డింగ్ను పూర్తి చేయాలన్నారు. గ్రామంలోని డ్రైనేజీ నిర్మాణాలు చేయాలని, అలా చేయకుంటే మురుగునీరు చెరువు నీరు మొత్తం గ్రామంలోని ఇండ్ల పైకి వస్తున్నాయన్నారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీలు వేశారని, కానీ బయటికి డ్రైనేజీ పోవడం లేదన్నారు. నీరు రోడ్లపైనే పారుతుండటంతో పాములు, తేళ్లు ఇళ్లలోకి వస్తున్నాయన్నారు. కావున నీరు పోవడానికి డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎస్సీ కాలనీలోని ఐమాక్స్ లైట్ల దగ్గర కరెంటు స్తంభం ప్రమాదకరంగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఆ ప్రాంతంలో నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. కరెంటు వైర్లకు చెట్ల కొమ్మలు తగలకుండా కొమ్మలను తొలగించాలని పేర్కొన్నట్లు తెలిపారు. పై సమస్యలను త్వరలో పూర్తి చేయకపోతే గ్రామ ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు రాజశేఖర్, నరసింహ, రమేష్, శివ, భూషణ, శంకర్, శ్రీకాంత్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.