నవతెలంగాణ -ముధోల్
విఆర్ఎల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ గురువారం ముధోల్ తహశీల్దార్ కార్యాలయంలో విఆర్ఎ జేఏసీ ఆధ్వర్యంలో తహశీల్దార్ శ్రీలతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు. 2020 సెప్టెంబర్ 9న గత ప్రభుత్వం అసెంబ్లీలో విఆర్ఎ లకు, పే స్కేలు వారసులకు ఉద్యోగులు ఇస్తామని ప్రకటించినా.. నేటివరకు అమలు చేయాలేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 5 55 మంది విఆర్ఎ లు డిగ్రీ చదివిన వారిని జూనియర్ అసిస్టెంట్ గా, ఇంటర్ చేసిన వారికి రికార్డు అసిస్టెంట్ గా పదో తరగతి లోపు చదివినవారిని ఆఫీస్ సబర్డినేట్ గా రెవెన్యూ శాఖతోపాటు, మున్సిపల్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్య, వైద్య , శాఖలో చేర్చారని అన్నారు.
మిగతా 3797 మంది విఆర్ఎ ల వారసులకు ఉద్యోగా ఉత్తర్వులు ఇవ్వకుండా గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు ఆరోపించారు. జీవో నెంబర్ 81, 85 ప్రకారం వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో రెండు సంవత్సరం లుగా ఎదురుచూస్తున్న జీవోలు ఇచ్చినా స్పందన లేదని వారు పేర్కొన్నారు.
కొందరు తండ్రి ఉద్యోగం కోసం అన్నదమ్ములకున్న అరెకరం భూమిని రాసిచ్చారని వారు వాపోయారు. అప్పులు చేసి తమ సోదరులకు లక్షల రూపాయలు వాటి కింద ఇచ్చారని వారు పేర్కొన్నారు. ఉద్యోగం రాక చేసినప్పులకు వడ్డీలు పెరిగి ఆర్థికంగా మానసికంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్, ముత్యం, భూమన్న, పోతన్న, తదితరులు, పాల్గొన్నారు.