Sunday, October 5, 2025
E-PAPER
Homeఖమ్మంరిజర్వేషన్ రొటేషన్‌ తో సామాజిక న్యాయానికి దెబ్బ 

రిజర్వేషన్ రొటేషన్‌ తో సామాజిక న్యాయానికి దెబ్బ 

- Advertisement -

– అశ్వారావుపేట మండల పరిషత్ ఎన్నికల్లో గిరిజనుల ఆవేదన
నవతెలంగాణ – ఆశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిషత్ పరిధిలో జరగనున్న 2025 రెండవ సాధారణ ఎన్నికల్లో రిజర్వేషన్ల రొటేషన్ విధానం అమలు నేపథ్యంలో సామాజిక న్యాయం దెబ్బతింటుందన్న చర్చ జరుగుతుంది. స్థానికులు చెబుతున్నదేమిటంటే మండలంలోని ఎక్కువ శాతం ఓటర్లు గిరిజనులే అయినప్పటికీ,రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ కేటాయింపుల కారణంగా వారికీ రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదు అని. ఈ పరిస్థితి సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తోంది అంటున్నారు.

– ఓటర్ల గణాంకాలు 

– గిరిజనులు అధికంగా ఉన్నా రిజర్వేషన్ తక్కువ
అశ్వారావుపేట మండల పరిధిలో మొత్తం 30,699 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో గిరిజనులు (ఎస్టీ) 18,175 (59.2%),వెనుకబడిన వర్గాలు (బీసీ) 9,355 (30.4%),దళితులు  (ఎస్సీ) 1,666 (5.4%), ఇతరులు అనగా కమ్మ,రెడ్డి లు (ఓసీ ) 1,632 (5.3%) మంది ఉన్నారు. ఈ గణాంకాలు చూస్తే గిరిజనులు మండల జనాభాలో స్పష్టమైన మెజారిటీ కలిగి ఉన్నారు. అయినప్పటికీ రొటేషన్ విధానం ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడంతో,గిరిజనులకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదు.

తిరుమలకుంట సెగ్మెంట్ లో 58% గిరిజనులు ఉన్నా బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. తిరుమలకుంట సెగ్మెంట్  పరిధిలో 2,571 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎస్టీ లు 1,503 (58%), బీసీ లు 911 (35%), ఎస్సీ లు 50 (2%), ఓసీ  (ఇతరులు) 107 (4%) ఉన్నారు. అయితే ఈ సెగ్మెంట్‌ కు రొటేషన్ విధానం ప్రకారం బీసీ (మెన్/ఉమెన్) రిజర్వేషన్ కేటాయించారు. స్థానిక గిరిజన సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. “మొత్తం ఓటర్లలో దాదాపు 60 శాతం గిరిజనులే ఉన్నా, వారికి రిజర్వేషన్ ఇవ్వకపోవడం సామాజిక అన్యాయం” అని వారు అంటున్నారు.

కొత్త మామిళ్ళ వారిగూడెం సెగ్మెంట్ లో  54% గిరిజనులు ఉన్నా బీసీ (మహిళ) రిజర్వేషన్ కొత్త మామిళ్ళ వారిగూడెం సెగ్మెంట్  పరిధిలో 3,521 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎస్టీ లు 1,904 (54%), బీసీ లు 1,456 (41%), ఎస్సీ లు 260 (7%), మరియు ఇతరులు 28 (1%) ఉన్నారు. ఇక్కడ కూడా గిరిజనులు అధికంగా ఉన్నప్పటికీ, రొటేషన్ విధానం ప్రకారం బీసీ (ఉమెన్) రిజర్వేషన్ ఇవ్వబడింది.

స్థానికులు ఏమంటున్నారంటే  “ఓటర్ల వాస్తవ శాతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రొటేషన్ కేటాయింపులు చేయడంతో  పేద వర్గాల ప్రాతినిధ్యాన్ని దెబ్బతీస్తోంది అని.” నందిపాడు,గుమ్మడవల్లి  కొన్ని చోట్ల సరిపడే కేటాయింపులు,మరికొన్ని చోట్ల వ్యతిరేకం. నందిపాడు సెగ్మెంట్ లో మొత్తం 2,975 ఓటర్లలో, 2,166 (73%) ఎస్టీ లు ఉన్నారు. ఈ సెగ్మెంట్‌ కు ఎస్టీ (మెన్/ఉమెన్) రిజర్వేషన్ ఇవ్వడం సరైన నిర్ణయంగా భావిస్తున్నారు. అయితే గుమ్మడవల్లి సెగ్మెంట్ లో 4,090 ఓటర్లలో, ఎస్టీ లు 1,432 (35%), బీసీ లు 1,428 (35%), ఎస్సీ లు 42, మరియు ఇతరులు 229 మంది ఉన్నారు. ఇక్కడ కూడా రొటేషన్ ప్రకారం ఎస్టీ (ఉమెన్) రిజర్వేషన్ కేటాయించారు.

ఈ రెండూ ఒకదానికొకటి విరుద్ధమైన ఉదాహరణలు గా ఉన్నాయి. ఒకచోట ఎస్టీ లు అధికంగా ఉన్నా అదే రిజర్వేషన్ వస్తుంది. మరొకచోట సమాన శాతం ఉన్నా అదే రిజర్వేషన్ కొనసాగుతోంది. బచ్చువారిగూడెం,గాండ్లగూడెం లో గిరిజనులు మెజారిటీ ఉన్నా అన్ రిజర్వడ్ కేటాయింపు బచ్చువారిగూడెం లో మొత్తం 2,835 ఓటర్లలో, ఎస్టీ లు 1,359 (48%), బీసీ లు 492, మరియు ఎస్సీ లు 34 ఉన్నారు. అయినప్పటికీ ఈ సెగ్మెంట్‌ ను ఆన్ రిజర్వడ్ గా ప్రకటించారు.

గాండ్లగూడెం లో పరిస్థితి మరింత ఆశ్చర్యకరం. 

మొత్తం 3,524 ఓటర్లలో, ఎస్టీ లు 2,628 (75%) ఉన్నా, ఇక్కడ కూడా అన్ రిజర్వడ్  (మెన్ /ఉమెన్) రిజర్వేషన్ కేటాయించారు. స్థానిక గిరిజన నాయకులు ఏమంటున్నారు అంటే “ఇలాంటి నిర్ణయాలు సామాజిక సమానత్వానికి వ్యతిరేకం అని. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వారికి ప్రాతినిధ్యం ఇవ్వాలి అంటున్నారు.” నారాయణపురం,వినాయకపురం లోనూ అసమాన కేటాయింపులు నారాయణపురం సెగ్మెంట్‌ లో మొత్తం 4,168 ఓటర్లలో, ఎస్టీ లు 1,716 (41%), బీసీ లు 1,028, మరియు ఎస్సీ లు 446 ఉన్నారు. ఇక్కడ అన్ రిజర్వడ్ (ఉమెన్) రిజర్వేషన్ కేటాయించారు.

వినాయకపురం లో మొత్తం 4,316 ఓటర్లలో, ఎస్టీ లు 1,005 (23%), బీసీ లు 1,045, మరియు ఎస్సీ లు 277 ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఎస్టీ  (మెన్/ఉమెన్) రిజర్వేషన్ ఇచ్చారు. ఇది మరోసారి రొటేషన్ విధానం జనాభా వాస్తవికతను పరిగణించక పోతున్నదనడానికి నిదర్శనం. ఊట్లపల్లి,అచ్యుతాపురం లో రొటేషన్ ఫలితంగా యాదృచ్ఛిక కేటాయింపులు ఊట్లపల్లి సెగ్మెంట్ లో 4,918 ఓటర్లలో, ఎస్టీ లు 1,887 (38%), బీసీ లు 906, మరియు ఇతరులు 297 ఉన్నారు. రొటేషన్ ప్రకారం ఇక్కడ ఎస్టీ (ఉమెన్) రిజర్వేషన్ ఇవ్వబడింది.

అదే సమయంలో అచ్యుతాపురం లో 3,101 ఓటర్లలో, ఎస్టీ లు 1,006 (32%), బీసీ లు 1,093 (35%) ఉన్నా, అదే ఎస్టీ  (మెన్/ఉమెన్ ) రిజర్వేషన్ కొనసాగుతోంది. ఈ విధమైన వ్యత్యాసాలు రొటేషన్ పద్ధతిలో ఉన్న “నిర్దిష్టత లేమి”ని స్పష్టంగా చూపుతున్నాయి. నారం వారిగూడెం – 55% గిరిజనులు, కానీ బీసీ రిజర్వేషన్ ఇచ్చారు.

నారం వారిగూడెం సెగ్మెంట్లో 2,853 ఓటర్లలో, ఎస్టీ లు 1,569 (55%), బీసీ లు 772, ఎస్సీ లు 196, మరియు ఇతరులు 316 ఉన్నారు. ఇంత భారీ శాతం గిరిజనులు ఉన్నప్పటికీ, రొటేషన్ ప్రకారం ఇక్కడ బీసీ (మెన్ /ఉమెన్) రిజర్వేషన్ కేటాయించారు. స్థానిక గిరిజన నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. “మా సమాజం మెజారిటీ అయినప్పటికీ, రొటేషన్ పేరుతో మా ప్రాతినిధ్యాన్ని తీసేస్తున్నారు. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం,” అన్నారు. ఈ దృష్టిలో రొటేషన్ పద్ధతి ఉద్దేశ్యం కోల్పోతోంది అనిపిస్తుంది.

మండలంలోని 11 ఎంపీటీసీ  సెగ్మెంట్లలో కనీసం 7 సెగ్మెంట్లలో గిరిజనులు మెజారిటీ గా ఉన్నారు. కానీ వాటిలో కేవలం 4 సెగ్మెంట్లలో మాత్రమే ఎస్టీ రిజర్వేషన్ ఉంది. దీనికి విరుద్ధంగా, బీసీ రిజర్వేషన్లు గిరిజనులు అధికంగా ఉన్న సెగ్మెంట్ల లోనూ కేటాయించబడ్డాయి. దీంతో రిజర్వేషన్ పద్ధతి సమానత కోసం కాకుండా అసమానత సృష్టిస్తున్నట్లు స్థానికులు అంటున్నారు.

విశ్లేషకులు,సంఘాలు సమీక్ష కోరుతున్నారు.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రొటేషన్ పద్ధతి ప్రతి వర్గానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ, అది వాస్తవ జనాభా శాతాలను పరిగణించకపోవడం వల్ల సామాజిక న్యాయం సూత్రం కాగితాల మీదే మిగిలిపోతుంది.

“రొటేషన్ సరైన విధానం కావొచ్చు, కానీ దానిని వాస్తవ పరిస్థితుల ప్రకారం సర్దుబాటు చేయాలి. ఓటర్ల సామాజిక శాతం కూడా పరిగణనలోకి తీసుకోవాలి” అని ఒక మాజీ మండల అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం గిరిజన సంఘాలు మరియు సివిల్ సొసైటీ సంస్థలు ఈ అంశంపై అధికారులకు రిజర్వేషన్ల పునః సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. “నిజమైన సామాజిక న్యాయం కేవలం విధానాల్లో కాదు, వాస్తవ ప్రాతినిధ్యం లో ప్రతిబింబించాలి.” అని వారి వాదన.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -