Sunday, November 23, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపంచాయతీల్లో 50శాతంలోపే రిజర్వేషన్లు

పంచాయతీల్లో 50శాతంలోపే రిజర్వేషన్లు

- Advertisement -

మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఎంపీడీవోలకు వార్డు మెంబర్‌ స్థానాలు… ఆర్డీవోలకు సర్పంచ్‌ స్థానాల ఖరారు బాధ్యతలు
2011 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌ రిజర్వేషన్లు
2024 కులగణన సర్వే ప్రకారం బీసీ రిజర్వేషన్లు
జీవో 46ను విడుదల చేసిన సీఎస్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. డెడికేటెడ్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదం తెలుపడంతో సర్పంచ్‌, వార్డు మెంబర్ల రిజర్వేషన్లకు విధివిధానాలను ఖరారు చేస్తూ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో నెం.46ను జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రొటేషన్‌ పద్ధతిలో సీట్లను కేటాయిస్తారు. రెండ్రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. స్థానిక ఎన్నికలపై ఈ నెల 24న హైకోర్టులో కేసు విచారణ ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించినట్టు కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయనుంది. అలాగే విచారణ ముగించాలని కోరతారని సమాచారం. దీనిపై హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 25 లేదా 26న స్థానిక ఎన్నికల షెడ్యూలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది.

2024 కుల సర్వే ప్రకారమే బీసీ సర్పంచ్‌ల ఖరారు…
బీసీ సర్పంచ్‌ స్థానాలకు 2024 కులగణన సర్వే ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌ల స్థానాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వార్డు మెంబర్ల రిజర్వేషన్లను 2024 కులగణన సర్వే అధారంగా నిర్ణయిస్తారు. గత ఎన్నికల్లో రిజర్వ్‌ చేసిన వార్డులు/గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్‌ చేయరాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 244 ప్రకారం షెడ్యూల్డ్‌ ఏరియాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తారు. వంద శాతం ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్‌ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్‌ చేయాలి.

ఎస్టీ రిజర్వేషన్లను మొదట ఖరారు చేసి, ఆ తర్వాత ఎస్సీలు, ఆ తర్వాతే బీసీ కేటాయింపులు చేస్తారు. మహిళా రిజర్వేషన్లను అన్ని కేటగిరీల్లో జనాభా ప్రాతిపదికగా లెక్కించి ఖరారు చేయాలి. గ్రామ పంచాయతీ వార్డుల సంఖ్య తక్కువైతే, మొదట మహిళా ప్రాధాన్యత ఆ తర్వాత లాటరీ పద్ధతి పాటించాలి. 2019 ఎన్నికల్లో అమలు కాని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగిస్తూనే, కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు మొదటి సాధారణ ఎన్నికలుగా పరిగణిస్తారు. వార్డు రిజర్వేషన్ల నిర్ణయం ఎంపీడీవో, సర్పంచ్‌ రిజర్వేషన్ల ఖరారు ఆర్డీవోల ఆధ్వర్యంలో జరగాలి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్ల ఖరారుకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

24లోగా సమర్పించండి : పంచాయతీ రాజ్‌ శాఖ
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ రిజర్వేషన్లను పూర్తి చేసి ఈ నెల 24లోగా అందజేయాలని పంచాయతీరాజ్‌ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు శనివారం ఆ శాఖ డైరెక్టర్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. ఖరారు కాపీలను పెన్‌ డ్రైవ్‌-రిజిస్టర్‌లో సంతకం చేసి జిల్లా గెజిట్‌ కాపీలు మూడు సెట్‌లతో పాటు వాటిని స్కాన్‌ చేసి పంపించాలని ఆదేశించింది. గెజిట్‌ కాపీలను జిల్లా పంచాయతీ అధికారి స్వయంగా అందజేయాలని సర్క్యూలర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -