గత శుక్రవారం జరిగిన రిజర్వ్ బ్యాంక్ బోర్డు మీటింగ్ 2025 ఆర్థిక సంవత్సరానికి తన లాభాలనుండి కేంద్ర ప్రభుత్వానికి రూ. 2,68,590 కోట్లు రికార్డ్ డివిడెండ్ ప్రకటించింది. ఇదే ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన అత్యధిక డివిడెండ్. విదేశీ మారకద్రవ్య లావాదేవీలు, బ్యాంకులకు ఇచ్చిన అప్పుల మీద వడ్డీ, బంగారం నిల్వల పెరిగిన విలువ ప్రభుత్వ బాండ్ల అమ్మకాలు ఇతర లావాదేవీల ద్వారా రిజర్వ్ బ్యాంక్ లాభాలను సంపాదిస్తుంది. తన నిర్వహణ ఖర్చులు, కంటిన్జెన్సి (అత్యవసర) నిధి అవసరాలు పోను మిగిలిన లాభాల నుండి ప్రభుత్వానికి డివిడెండ్ సొమ్ము బదిలీ చేస్తుంది. గత సంవత్సరం డివిడెండ్‌తో పోల్చినప్పుడు 27 శాతం ఎక్కువ ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్. గడిచిన పదేళ్లలో రూ.10,75,589 కోట్లు ప్రభుత్వ ఖజానాకి డివిడెండ్ రూపంలో సమకూర్చింది.
ప్రభుత్వానికి ఇదొక బొనాంజా. ప్రభుత్వానికి ఆర్థిక లోటు ఒక సమస్యగా మారిన సందర్భంలో రిజర్వ్ బ్యాంక్ అతి పెద్ద మొత్తాల్లో ప్రకటిస్తున్న డివిడెండ్లు ఒక పెద్ద ఊరట. ఇది ప్రత్యేక వనరుగా కూడా మారింది. కానీ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన డివిడెండ్ల కంటే ప్రభుత్వం డిమాండ్ చెయ్యటం, రిజర్వ్ బ్యాంక్ దాన్ని తిరస్కరించిన సందర్భాలు కూడా లేకపోలేదు. దీనికి పరిష్కారంగా 2019 లో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ బిమల్ జలాన్ నేతృత్వం లోన్ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ విలువలో 5 నుండి 7.50 శాతం ఉండాలని సిఫారసు చేసింది. కానీ రిజర్వ్ బ్యాంక్ బోర్డు దాన్ని ఐదు శాతంగా ఖరారు చేసింది. అయినా ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ డివిడెండ్ ప్రకటించిన సందర్భంలో చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి. అవి అసందర్భం, అర్థరహితం కాదు.
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ నియంత్రణ, కరెన్సీ ముద్రణ, బ్యాంకింగ్ పాలసీల రూపకల్పన, విదేశీ కరెన్సీ నిధుల నిల్వలు లాంటి విధులతో పాటు రిజర్వ్ బ్యాంక్ రెండు అతి ముఖ్యమైన విధులను కూడా నిర్వహిస్తుంది. మొదటిది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బ్యాంకర్. అంటే ప్రభుత్వ లావాదేవీల ఖాతాలను నిర్వహించటంతో పాటు అంతిమ రుణదాత (లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్) పాత్ర ప్రధానం. దేశ ఆర్థిక వ్యవస్థ ఏ కారణాల వల్లనైనా గడ్డు పరిస్థితులలో పడొచ్చు. ఉదాహరణకు ఆర్థిక మాంద్యం ఏర్పడటం, కరోనా లాంటి ఉపద్రవాలు సంభవించడం. అలాంటప్పుడు ప్రభుత్వానికి అదనపు ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యత రిజర్వ్ బ్యాంక్‌దే. రెండవది బ్యాంకులకు బ్యాంకర్ విధి. బ్యాంకింగ్ రంగం కానీ, ఏదైనా బ్యాంక్ దివాలాతీసే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆర్థిక. వన రులు సమకూర్చి బ్యాంకులను ఆదుకోవడం కూడా అతి ముఖ్యమైన విధి.
వీటితోపాటు అంతర్జాతీయంగా విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో ఒడి దుకులవలన నష్టాలు రావచ్చు. దీనికి తగిన వనరులు రిజర్వ్ బ్యాంక్ కు అవసరం. దేశ ఆర్థికాభివృద్ధికి, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగా లైన పౌల్ట్రీ, చేపల రొయ్యల పెంపకం, సెరికల్చర్ లాంటి రంగాలకు బ్యాం కులు మంజూరు చేసే రుణాలకు నిధులు (రిఫైనాన్స్) నాబార్డ్ సమ కూరుస్తుంది. నాబార్డ్ చట్టం ప్రకారం ఆ నిధులు రిజర్వ్ బ్యాంక్ నాబార్డ్‌కి రిఫైనాన్స్ చెయ్యాలి. ఈ మధ్య కాలంలో అదనపు నిధుల కేటాయింపులు జరగటం లేదు. దీనివలన గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలకు తగినంతగా రుణాలు బ్యాంకింగ్ రంగం కల్పించలేకపోవటానికి ఇదొక కారణం. అందుకే అనేక మంది ఆర్థిక నిపుణులు రిజర్వ్ బ్యాంక్ లాభాల నుంచి ప్రభుత్వానికి డివిడెంట్‌కంటే కంటిన్జెన్సీ ఫండ్‌కి కేటాయిపులు ఇంకా పెరగాలని అభిప్రాయ పడుతున్నారు.
– పి.వెంకట్రామయ్య
కేంద్ర ప్రభుత్వానికిరిజర్వ్ బ్యాంక్ రికార్డ్ డివిడెండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES