– రాజ్యాంగేతర శక్తులు రాజ్యమేలుతున్నాయి
– కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత, ప్రొఫెసర్ పసునూరి రవీందర్
– తాండూర్‌లో పూలే, అంబేద్కర్ జనజాతర
– సూర్యాపేట, మెదక్ జిల్లాల్లోనూ సభలు
నవతెలంగాణ-తాండూరు/సూర్యాపేట/ సంగారెడ్డి
”మహాత్మా జ్యోతిబాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తుది శ్వాస వరకూ మనువాదానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష ప్రతిఘటన ఉద్యమాలు నిర్మించారు.. వారే మన ఆధునిక భారతావని నిర్మాతలు.. వారి స్ఫూర్తితో మనువాదాన్ని ప్రతిఘటించాలి” అని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ డాక్టర్ పసునూరి రవీందర్ పిలుపునిచ్చారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో బుధవారం వికారాబాద్, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లో పూలే, అంబేద్కర్ జన జాతర సభలు జరిగాయి. తాండూరు పట్టణంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కన్న అధ్యక్షతన జరిగిన సభలో రవీందర్ ప్రసంగించారు. ఫూలే, అంబేద్కర్ లాంటి మహనీయులను దేశంలో ఒక సామాజిక తరగతికి పరిమితం చేయటం ద్వారా వారిని అవమానిస్తున్నారని అన్నారు. మనువాదంపై ఫూలే నడిపిన ఉద్యమాలు, సంస్కరణల వల్లే దేశం నేడు ఈ స్థితిలో ఉందన్నారు. బీజేపీ సర్కార్ విధానాల వల్ల రాజ్యాంగం ప్రమాదంలో పడుతోందన్నారు. ప్రజాస్వామ్య దేశాన్ని మతరాజ్యంగా మార్చే కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫూలే, అంబేద్కర్ పుట్టిన ఏప్రిల్ నెలను కేవీపీఎస్ మహనీయుల మాసంగా పాటించడంపై అభినందించారు. జన జాతర సందర్భంగా తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.మైపాల్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు పి.ఆనంద్‌కుమార్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల సురేష్, కేవీపీ సహాయ కార్యదర్శి బక్కని రాజు తదితరులు పాల్గొన్నారు.
హక్కులను కాపాడుకునే దిశగా పోరాటం : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
వివక్షలు లేని సమసమాజ స్థాపనే ధ్యేయంగా ఆత్మగౌరవం, సమానత్వం, కులనిర్మూలన కోసం కేవీపీఎస్ పోరాడుతోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌బాబు అన్నారు. సూర్యాపేటలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాజ్యంగాన్ని కాపాడాల్సిన, వివక్షను రూపుమాపాల్సిన పాలకులే అంతరాలను సృష్టిస్తూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమళ్ల హుస్సేన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వసంత సత్యనారాయణ పిళై, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మరి నాగేశ్వర్‌రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, ఎంఇఎఫ్ జిల్లా అధ్యక్షులు వల్లపట్ల క్రిష్ణ, నర్సింహారావు, మాల ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు నామ నాగయ్య, పీఎన్‌ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్పుల వెంకన్న, ప్రయివేటు టీచర్స్ యూనియన్ జిల్లా కన్వినర్ నర్సింగరావు, గిరిజన సంఘం నాయకులు మోతిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మనువాదంపై పోరాటమే మహనీయులకు ఘన నివాళి :ప్రముఖ అంబేద్కర్ వాది జేబి రాజు, గాయకులు ఏపూరి సోమన్న
మనువాదంపై పోరాటం చేయడమే మహనీయులకు ఘనమైన నివాళి అని ప్రముఖ అంబేద్కర్ వాది జేబి రాజు, కేవిపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, బహుజన ప్రజా వాగ్గేయకారులు ఏపూరి సోమన్న అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అతిమేల మాణిక్ అధ్యక్షతన బైక్ ర్యాలీ నిర్వహించారు. పహల్గాంలో ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ సభలో కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వేల సంవత్సరాల మనుస్మృతి శూద్రులకు విద్యను నిషేధిస్తే, ఫూలే దంపతులు అందరికీ విద్య కోసం తుది శ్వాస వరకు కృషి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి.అశోక్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
మనువాదాన్ని ప్రతిఘటించండి
- Advertisement -
RELATED ARTICLES