Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంఉపాధి హామీపై మోడీ సర్కార్‌ వైఖరికి ప్రతిఘటన

ఉపాధి హామీపై మోడీ సర్కార్‌ వైఖరికి ప్రతిఘటన

- Advertisement -

ఈ నెల 10 నుంచి ఫిబ్రవరి 12 వరకు దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమం : రౌండ్‌టేబుల్‌ సమావేశం పిలుపు
2005 ‘ఉపాధి’ చట్టాన్ని పునరుద్ధరించాలి.. 2025 కార్పొరేట్‌ దోపిడీ చట్టాన్ని చెత్తబుట్టలో వేయాలి

నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘2025 ఉపాధి చట్టం’ దేశ గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగ యువత, మహిళలపై కేంద్రం ప్రకటించిన బహిరంగ యుద్ధమని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు విమర్శించారు. వీబీ జీ రామ్‌ జీ కి వ్యతిరేకంగా ఈ నెల 10 నుంచి పిబ్రవరి 12 వరకు మొదటి దశ ఉద్యమాన్ని ప్రకటించారు. గురువారం నాడిక్కడ హరికిసాన్‌ సుర్జిత్‌ భవన్‌లో వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాలు, రేగ సంఘర్ష మోర్చ్‌ సంయుక్తంగా రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశం వీబీ జీ రామ్‌ జీ చట్టాన్ని తీవ్రంగా ఖండించింది. బి. వెంకట్‌, అనురాధ జోహాల్‌, నిర్మల్‌, ముఖేష్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి 100కి పైగా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 150 మంది జాతీయ నాయకులు హాజరయ్యారు.

ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ జయతి ఘోష్‌ సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడుతూ 2005 చట్టం గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పిస్తే, 2025 చట్టం దాన్ని కూల్చివేసిందన్నారు ప్రభుత్వం తీరు దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టేలా ఉందని విమర్శించారు. సంగర్చ్‌ మోర్చా నేత నిఖిల్‌ దేవ్‌ 2005 చట్టంలో అమలు చేసిన ప్రాంతాల్లో, ప్రజల్లో వచ్చిన సానుకూల మార్పులు గురించి వివరించారు. 60 రోజులు ఉపాధి రద్దు చేయాలని ఏ రైతు సంఘం అడిగిందని ఎస్‌కేఎం నేతలు ప్రశ్నించారు. ఎంఎస్పీ కావాలని కోరితే ఉపాధి కోల్పోయేలా చేస్తారా అంటూ నిలదీశారు.. ఉద్యమానికి మేమూ మద్దతు తెలుపుతామన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ మా సమ్మెల్లో ఉపాధి హామీ కూడా ప్రధాన డిమాండ్‌గా ఉందని తెలిపారు. 2005 ఉపాధి హామీ చట్టంతో ప్రజలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న చట్టబద్ధమైన పని హక్కును కేంద్రం లాక్కుంటోందని, కార్పొరేట్‌ లాభాల కోసం పేదల బతుకులను బలిపెడుతోందని సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 2005 చట్టాన్ని పునరుద్ధరించాలని, 2025 నల్ల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్త విశాల ఐక్య ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు సమావేశం ప్రకటించింది.

మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక
గ్రామీణ పేదల పని హక్కును కాలరాస్తే దేశవ్యాప్త ఉద్యమంతో తగిన బుద్ధి చెబుతామని సమావేశం హెచ్చరించింది. 2025 చట్టం రద్దు వరకు ఈ పోరాటం ఆగదని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. అనంతరం బి. వెంకట్‌ ప్రవేశపెట్టిన ఉద్యమ తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఐక్య పోరాటానికి సంఘీభావం
దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఉద్యమానికి సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, యువజన, విద్యార్థి, వికలాంగుల సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్స్‌ వంటి ప్రధాన సంఘాల నేతలు ప్రత్యక్ష మద్దతు ప్రకటించారు. సంఘీభావమే కాదు, ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ అఖిల భారత అధ్యక్షలు సుదీప్‌ దత్తా, ఏఐటీయూసీ నాయకులు వి. శ్రీరి, ఐఎన్‌టీయూసీ నేత రఫియా, ఎస్కేఎం నేత రాజన్‌, ప్రేమ్‌ సింగ్‌, మహిళా సంఘాల నుంచి ఐద్వా నాయకురాలు ప్రొఫెసర్‌ అర్చన ప్రసాదూ చర్చలను సమీక్షస్తూ మాట్లాడారు. గౌరియా, మాధురితో పాటు అనేక మంది నాయకులు కూడా మాట్లాడారు.

పోరాట కార్యాచరణ
అఖిల భారత స్థాయిలో విశాల ఐక్య వేదిక : ఉపాధి అంశంపై పనిచేస్తున్న వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాలు, సంఘర్ష మోర్చా., వివిధ సంఘాలు, సంస్థలు, వ్యక్తులు మేధావులతో కూడిన ఒక విశాల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలి.
సమన్వయ కమిటీ : ఉద్యమ పర్యవేక్షణ కోసం జాతీయ స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి.
నెల రోజుల ఉద్యమం: జనవరి 10 నుంచి ఫిబ్రవరి 12 వరకు దేశవ్యాప్తంగా నిరంతర నిరసనలు.
పంచాయతీ తీర్మానాలు: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనవరి 26న దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు.
ఫిబ్రవరి 2న (ఉపాధి హామీ ప్రారంభ దినం) ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి, ”పని హక్కు మా జన్మహక్కు” అని ప్రతిజ్ఞ చేయడం.
సార్వత్రిక సమ్మె : ఫిబ్రవరి 12న నిర్వహించనున్న అఖిల భారత కార్మికుల జనరల్‌ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ గ్రామీణ ప్రాంతాల్లో భారీ నిరసనలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -