Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయంపెండింగ్‌ సమస్యలు పరిష్కరించండి

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించండి

- Advertisement -

త్రిసభ్య కమిటీకి ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైౖర్మెన్‌ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రి సభ్య కమిటీ చైౖర్మెన్‌ నవీన్‌మిట్టల్‌, ఇతర సభ్యులను కలిసి సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన చర్చల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈనెల 6న జరిగిన ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంటిజెంట్‌ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించిన తీర్మానాలను మూడు విభాగాలుగా చేసి అత్యవసర, ఆర్థికేతర, ఆర్థిక సమస్యలను అధికారులకు వివరించినట్టు తెలిపారు. వీటితో పాటు ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం, పెండింగ్‌ బిల్లుల విడుదల, నూతన పెన్షన్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరణ, పొరుగు సేవల ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ తదితర సమస్యలను పరిష్కరించాలని కమిటీకి విన్నవించామని తెలిపారు. 317 జీవో ద్వారా మరి కొన్ని రకాల బదిలీలకు అవకాశం కల్పించాలనీ, ప్రభుత్వ ఖజానాపై తక్షణ భారం పడని 24 అంశాలను తొలుత పరిష్కరించాలని విజ్ఞప్తి చేశామని వివరించారు. ఆర్థికభారం పడే 14 అంశాలను దశల వారీగా పరిష్కరించాలని కోరినట్టు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పట్ల కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందించారనీ, ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె.రామకృష్ణ, డా.నిర్మల, ఎస్‌.రాములు, బాణాల రాంరెడ్డి, రమేష్‌ పాక, హన్మంతరావు, సీపీఎస్‌ దర్శన్‌ గౌడ్‌, సాల్మన్‌ నాయక్‌, శశిధర్‌ రెడ్డి, మహిపాల్‌ రెడ్డి, రవికుమార్‌, చంద్రశేఖర్‌ గౌడ్‌, హరికిషన్‌, వెంకట్‌, గోపాల్‌, హబీబ్‌ మస్తాన్‌, లక్ష్మయ్య పులి, హేమలత, సుగంధిని, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -