Thursday, October 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంత్వరగా తేల్చండి

త్వరగా తేల్చండి

- Advertisement -

హమాస్‌కు ట్రంప్‌ డెడ్‌లైన్‌

వాషింగ్టన్‌ : గాజాలో శాంతి స్థాపన కోసం తాను చేసిన ప్రతిపాదనపై మూడు నాలుగు రోజుల్లోగా స్పందించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హమాస్‌కు డెడ్‌లైన్‌ విధించారు. శాంతి ప్రణాళికను ఇజ్రాయిల్‌, అరబ్‌ నేతలు ఇప్పటికే ఆమోదించారని ఆయన చెప్పారు. ‘హమాస్‌ ఏదో ఒకటి తేల్చేయాలి. ప్రణాళికను అంగీకరించడమో లేదా తిరస్కరించడమో జరగాలి. లేనిపక్షంలో విషాదాంతం తప్పదు’ అని శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. ప్రతిపాదనపై సంప్రదింపులకు అవకాశం ఉంటుందా అని ప్రశ్నించగా పెద్దగా ఉండబోదని బదులిచ్చారు. తన ప్రణాళికకు అంగీకారం తెలిపినందుకు ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూకు ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్‌ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళిక ప్రకారం తన వద్ద ఉన్న ఆయుధాలను హమాస్‌ అప్పగించాల్సి ఉంటుంది.

అంతేకాక బందీలుగా ఉన్న ఇజ్రాయిలీలను విడుదల చేయాల్సి ఉంటుంది. గాజా పాలనలో హమాస్‌కు ఎలాంటి పాత్ర ఉండబోదు. గాజాను విడిచిపెట్టి వెళ్లిపోవాలని భావించే వారితో శాంతియుతంగా సహజీవనం సాగించేందుకు హమాస్‌ సభ్యులు అంగీకరిస్తే వారికి క్షమాభిక్ష ప్రసాదించి సురక్షితంగా తరలిపోయేందుకు అవకాశం ఇస్తారు. కాగా ట్రంప్‌ ప్రణాళికపై హమాస్‌ బృందం అధ్యయనం జరుపు తోందని ఖతార్‌ విదేశాంగ శాఖ ధృవీకరించింది. ప్రతిపాదనలోని పలు అంశాలపై వివరణలు, సంప్రదింపులు అవసరమవుతాయని ఖతార్‌ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌రహమాన్‌ బిన్‌ జాసిమ్‌ అల్‌ థానీ అభిప్రాయపడ్డారు. ప్రణాళికను అన్ని పక్షాలు నిర్మాణాత్మకంగా పరిశీలించి, యుద్ధాన్ని నివారించే అవకాశాన్ని కల్పిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కొనసాగుతున్న దాడులు
ఇదిలావుండగా గాజాలో ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా దాడుల్లో అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. గాజా స్ట్రిప్‌లోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న 20 మంది అన్నార్తులు ఇజ్రాయిల్‌ దాడులకు బలయ్యారు. నగరంలో నిమిషానికి ఓ పేలుడు జరుగుతోందని అల్‌ జజీరా మీడియా సంస్థకు చెందిన పాత్రికేయుడు తారెక్‌ అబూ అజోమ్‌ తెలిపారు. సెంట్రల్‌ గాజాలో ఇజ్రాయిల్‌ జరిపిన డ్రోన్‌ దాడిలో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి, పాత్రికేయుడు ఉన్నారు. నుసెరత్‌ శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడిలో నలుగురు మరణించగా పలువురు గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -