Saturday, March 28, 2026
E-PAPER
Homeజాతీయంఓట్లు, సీట్ల కోసం అవకాశవాదానికి పాల్పడం

ఓట్లు, సీట్ల కోసం అవకాశవాదానికి పాల్పడం

- Advertisement -

– బీజేపీ విజయాలకు సాయపడింది వారే
– కాంగ్రెస్‌ ఆరోపణలను ఖండించిన కేరళ సీఎం విజయన్‌
– ఎల్‌డీఎఫ్‌ అభివృద్ధి నమూనాపై వివరణ
– బీజేపీ అధికార వాణిగా మారుతున్న దూరదర్శన్‌, ఆకాశవాణి

త్రిస్సూర్‌ : ఆర్‌ఎస్‌ఎస్‌తో సీపీఐ(ఎం) కుమ్మక్కైందని ప్రతిపక్ష నేత వి.డి.సతీశన్‌ చేసిన ఆరోపణలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. తీవ్రమైన మూర్ఖత్వంతో చేసిన ఆరోపణలు అంటూ కొట్టిపారేశారు. అవకాశవాద పొత్తుల చరిత్ర కాంగ్రెస్‌దేనని విమర్శించారు. త్రిస్సూర్‌లో పత్రికా సమావేశంలో విజయన్‌ మాట్లాడారు. తన రాజకీయ జీవితం ఆరంభం నుండీ ఆర్‌ఎస్‌ఎస్‌కు తాను ప్రధాన లక్ష్యంగా వున్నానని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తనను ఎలా చూస్తుందో ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. వారి ప్రధాన లక్ష్యాల్లో నేను ఒకడిని. ఇప్పుడు, ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడానికి కూడా వారు వెనకాడనట్లు కనిపిస్తోందని అన్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసం మతోన్మాద శక్తులతో పదేపదే పొత్తులు పెట్టుకునే చరిత్ర కాంగ్రెస్‌దని తీవ్రంగా విమర్శించారు. మార్క్సిస్టుల నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖకు రక్షణ కల్పించినట్లు స్వయంగా కాంగ్రెస్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడే (కన్నూర్‌కు చెందిన) ఒకరు స్వయంగా అంగీకరించారని చెప్పారు. పట్టాంబిలో ఇఎంఎస్‌.నంబూద్రిపాద్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌ ఎవరితో పొత్తు పెట్టుకుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అప్పటి అవగాహనలో భాగంగానే జనసంఘం తన అభ్యర్ధిని అక్కడ ఉపసంహరించుకుందని విమర్శించారు. ‘అది చరిత్రకు సంబంధించిన విషయం కాదా?’ అని ఆయన ప్రశ్నించారు. ఎ.కె.గోపాలన్‌ పోటీ చేసినప్పటి పాలక్కాడ్‌ ఎన్నికను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ కలిసి ఉమ్మడి అభ్యర్ధికి మద్దతిచ్చాయని,ఆ వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అని విజయన్‌ పేర్కొన్నారు. ”ఆనాడు అంతటి సిగ్గుచేటైన పనులకు పాల్పడిన వారు ఆ తర్వాత, ఇప్పుడు కూడా ..మతోన్మాదం, ఫాసిజంపై నిరంతరంగా కఠిన వైఖరి తీసుకునే వామపక్షాలపై చేస్తున్న ఆరోపణలను సీరియస్‌గా తీసుకోగలమా? అని ఆయన ప్రశ్నించారు. ”నేను తరచుగా చెప్పేదానే మరోసారి చెబుతున్నా-కొన్ని ఓట్ల కోసం లేదా కొద్ది సీట్ల కోసం రాజకీయ అవకాశవాదానికి మేం పాల్పడబోం.” అని విజయన్‌ స్పష్టం చేశారు.

ఎల్‌డీిఎఫ్‌ అభివృద్ధి నమూనా
ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకున్న లైఫ్‌ మిషన్‌ హౌసింగ్‌ పథకానికి త్రిస్సూర్‌లో అనవసరమైన ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పారు. ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 19వేల కోట్లను పెట్టుబడులుగా పెట్టిందన్నారు. ఇందులో కేంద్రం వాటా కేవలం రూ.2300కోట్లేనని చెప్పారు. మరో ప్రధాన కార్యక్రమం మత్స్యకారులకు ఉద్దేశించిన పునర్గేహం పథకం, ఇందులో రూ.2480కోట్లు పెట్టుబడులు పెట్టామన్నారు. ఎల్‌డిఎఫ్‌ అభివృద్ధి నమూనాను నొక్కి చెబుతూ ఆయన, అభివృద్ధి, సామాజిక సంక్షేమాన్ని కలిపి ఒకే తాటిపై ముందుకు తీసుకెళ్ళడానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. వామపక్ష సంఘటన ఎన్నికల ప్రచారంలో తమ కీలకమైన నినాదం కూడా అదేనన్నారు.

బీజేపీ గత విజయాలకు సాయపడిన కాంగ్రెస్‌ : సీపీఐ(ఎం)
2024లో త్రిస్సూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో, 2016లో నేమమ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి విజయాలు సాధించేందుకు కాంగ్రెస్‌ సాయపడిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.గోవిందన్‌ శుక్రవారం విమర్శించారు. సిపిఎం, బిజెపి మధ్య ఒప్పందం కుదిరిందంటూ యుడిఎఫ్‌ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలను వామపక్షాలు నిరంతరంగా వ్యతిరేకిస్తునే వున్నాయన్నారు. అదేసమయంలో కాంగ్రెస్‌ ముఖ్యంగా వి.డి.సతీశన్‌ నాయకత్వం మాత్రం సంఘ పరివార్‌ నేతలతో చర్చలు జరిపారని తెలిపారు. కేరళ అసెంబ్లీలో బిజెపి ఏకైక విజయం నేమమ్‌ నుండే వచ్చిందన్నారు. అలాగే ఏకైక లోక్‌సభా స్థానం త్రిస్సూర్‌లో కూడా గెలిచిందన్నారు. కాంగ్రెస్‌ ఓట్లలో క్షీణత వల్లనే ఇది జరిగిందని ఆయన పేర్కొన్నారు. 2016లో నేమమ్‌లో బిజెపి తన ఖాతాను ప్రారంభించిందని, కానీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు మళ్లీ ఆ సీటును సాధించుకున్నాయన్నారు. గతేడాది స్థానిక సంస్థ ఎన్నికల ధోరణిని బట్టి చూస్తే త్రిస్సూర్‌లో కూడా ఇదే రకమైన ఫలితం చోటు చేసుకోగలదని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ”పార్లమెంటరీ ఎన్నికల్లో, త్రిస్సూర్‌లో కాంగ్రెస్‌ ఓట్లు 84వేలు తగ్గాయి. ఫలితం బిజెపి 74వేల ఓట్ల తేడాతో గెలిచింది. అక్కడ మన ఓట్లు16వేలు పెరిగాయి. అటువంటపుడు బీజేపీ విజయానికి ఎవరు వెసులుబాటు కల్పించారు.” అని ఆయన ప్రశ్నించారు.

త్రిస్సూర్‌లో కాంగ్రెస్‌ మూడో స్థానానికి ఎలా పడిపోయిందో ఓటర్లు అర్ధం చేసుకోగలరన్నారు. ”నేమమ్‌లో యుడిఎఫ్‌ ఓట్లు 29వేలు తగ్గాయి. ఫలితంగా బిజెపి నేత ఓ.రాజగోపాల్‌ విజయానికి వెసులుబాటు కలిగింది. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికలో మేం ఆ సీటను తిరిగి సాధించుకోగలిగాం.” అని చెప్పారు. అభివృద్దికి వ్యతిరేకంగా వుండే ప్రతిపక్షం కాంగ్రెస్‌ అని గోవిందన్‌ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఇదే ప్రధాన సవాలుగా వుంటుందన్నారు.

దూరదర్శన్‌ కార్యక్రమాన్ని బహిష్కరించిన వినరు విశ్వం
బిజెపిని విమర్శిస్తున్న తన ఎన్నికల కార్యక్రమంలోని ఒక భాగాన్ని దూరదర్శన్‌ సెన్సార్‌ చేసిందని సిపిఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి వినరు విశ్వం శుక్రవారం విమర్శించారు. దీంతో, ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాలని తమ పార్టీ నిర్ణయించిందన్నారు. ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. దూరదర్శన్‌ బిజెపి అధికార వాణిగా వ్యవహరించరాదన్నారు. ”ఈ కార్యక్రమానికి సంబంధించిన పాఠాన్ని ముందుగానే నేను అందచేశాను. బిజెపి సూచనల ప్రకారం ఆ పాఠంలో కొన్ని భాగాలను సెన్సార్‌ చేశారు. ఏం మాట్లాడాలని బిజెపి కోరుకుంటుందో దాన్నే మాట్లాడాలని సిపిఐ కోరుకోవడం లేదని, అందువల్ల ఆ కార్యక్రమాన్ని బహిష్కరించానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -