వంట పనిలో మునిగి ఉన్న నాకు ఉన్నట్టుండి ఇంటి గంట మోగడంతో ఒళ్ళు మండింది. చేతిలో ఉన్న గరిట పక్కన పెట్టి విసుగుగా వెళ్లి తలుపు తీశాను. గుమ్మం అవతల నిలబడి ఉన్న అపరిచిత వ్యక్తిని చూసి, ”వారు ఇంట్లో లేరు” అన్నాను. ఆందోళనగా కనిపించిన అతడు నా మాట పట్టించుకోకుండా, ”నిర్మల గారేనా మీరు?” అని అడిగాడు.
”అవును” అనగానే, ”నేను మాధవి భర్తను” అంటూ జేబులోంచి మాధవి చిత్రాన్ని తీసి చూపించాడు. నేను ఆశ్చర్యంగా చూశాను.
”మీరు నమ్మడానికి, గుర్తించడానికి ఈ చిత్రం. మీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు.
మాధవి తన భర్త గురించి చెప్పిన విషయాలు గుర్తుకురావడంతో భయపడుతూ, ”నాతో ఏం మాట్లాడతారు?” అని అడిగాను.
”ఒక్క ఐదు నిమిషాలు చాలు,” అన్నాడు. సాధారణంగా అందరినీ ఆదరంగా లోపలికి ఆహ్వానించే నేను, ఆ రోజు అతడిని మనస్ఫూర్తిగా పిలవలేకపోయాను. వంటగదిలో పని ఉండడంతో గుమ్మంలో తలుపుకు ఆనుకుని, చెప్పమని సైగ చేశాను.
”నిన్న సాయంత్రం మాధవి మీ ఇంటికి వచ్చిందా?”
”వచ్చింది”
”వెంట సునంద కూడా ఉందా? వాళ్లు ఎంతసేపు ఇక్కడ ఉన్నారు?”
నాలో సహనం నశించింది. ”మీరు ఈ ప్రశ్నలన్నీ ఎందుకడుగుతున్నారో తెలుసుకోవచ్చా?” అని అడిగాను.
”మరేం లేదు. రాత్రి మాధవి ఒక సంచి తెచ్చింది. అది మీ ఇంట్లో వదిలిందేమోనని తీసుకెళ్లడానికి వచ్చాను,” అన్నాడు.
నాకు ఆ సంచిలో విలువైన నగలు ఉన్నాయేమోనని అనుమానం వచ్చింది. మాధవి తరచుగా నగల దుకాణాలకు వెళ్లడం నాకు తెలుసు.
”ఆమె సంచితో మా ఇంటికి వచ్చిన మాట నిజమే. కానీ ఆమె వెళ్ళేటప్పుడు ఆ సంచిని తనతోనే తీసుకెళ్ళింది” అన్నాను.
”అయితే సరేలెండి. నేను దాని కోసమే వచ్చాను. ఇక వెళ్తాను” అంటూ వెళ్లిపోయాడు. ఇంతసేపు అతడిని అలా నిలబెట్టి మాట్లాడినందుకు నా మనసు బాధపడినా, అతడికి మర్యాద చేయాలనిపించలేదు.
ఆ సాయంత్రం మావారు ఆఫీసు నుండి వచ్చి టీ తాగుతూ నాకెదురుగా కూర్చున్నారు.
”పొద్దున మాధవి భర్త మన ఇంటికి వచ్చారండీ” అన్నాను.
మావారు జ్ఞాపకం తెచ్చుకుంటూ ”ఆ… కథలు రాస్తుంది, ఆ మాధవే కదా! ఏమిటి విశేషం?” అన్నారు.
నేను జరిగింది చెప్పాను. అందులో అతడిని నిలబెట్టి మాట్లాడిన సంగతి కూడా దాచలేదు. రెండు క్షణాల తర్వాత ఆయన ”నువ్వు చేసిన పని బాగుండలేదు” అన్నారు. నేను ఉలిక్కిపడ్డాను. ”పాపం! అతడు నీకేదో చెప్పాలనో, లేక నీ నుండి ఏదైనా తెలుసుకోవాలనో వచ్చి ఉంటాడు. నువ్వు అతడికి చేసిన మర్యాదను చూసి కడుపు నిండి వెళ్లిపోయి ఉంటాడు”
”మీరు ఎన్ని చెప్పినా, అతడిని చూస్తే నాకు ఎందుకో కసిలాంటి భావం కలిగింది. ఆదరణ చూపించాలని అనిపించలేదు” అన్నాను.
”అవును, నీకెలా అనిపిస్తుంది? ఏదో కొద్ది పరిచయంతో అతి చనువు పెంచుకుని, తన ఇంటి విషయాలు నీకు చెప్పుకుని, నీ నుండి బండెడు సానుభూతి సంపాదించడమే కాక, తన భర్త పట్ల ద్వేషాన్ని కూడా రగిలించుకుపోయింది” నిష్టూరంగా అన్నారు.
”ఎంతైనా మగాడివి కదా! పక్షపాతం పోనివ్వరు” అన్నాను.
”అది కాదు నిర్మలా.. ఏ ఫిర్యాదులైనా, సమస్యలైనా ఒక వైపు నుండి విని నమ్మకూడదు. రెండు వైపులా విని ఒక నిర్ణయానికి రావాలి” అన్నారు.
ఆ రాత్రి పడుకున్న తర్వాత కూడా చాలాసేపు ఆలోచించాను.
కానీ మాధవి పట్ల అతడి ప్రవర్తనను క్షమించలేకపోయాను.
మొదటిసారి మాధవిని నేను ఒక రచయితల సమావేశంలో చూశాను. మరొక రచయిత ద్వారా ఆమె నాకు పరిచయమైంది. ఆమె కలుపుగోలుతనానికి ఆనందం కలిగింది. అలా పరిచయమైన మాధవిని ఏదో వేడుకల్లో రెండుసార్లు కలిశాను. తర్వాత రెండుసార్లు మా ఇంటికి వచ్చింది. ఎక్కడ కనిపించినా నా దగ్గరకొచ్చి గబగబా కబుర్లు చెప్పేది. రచయితల గురించీ, రచనల గురించీ ఎన్నో మాట్లాడేది. ఒకరోజు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చిన మాధవిని ఆదరంగా ఆహ్వానించాను. ఆమె చేతిలో ఆమె రాసిన గేయాల సంపుటి ఉంది. నేను అవి చదువుతూ కూర్చున్నాను. ఆమె అద్భుతంగా రాయగలదనిపించింది. కొంచెం ఆగి అన్నాను ”మీరు బాగా రాస్తారు”
ఇంకో రెండు పేజీలు తిప్పి ఆమె ముఖంలోకి చూశాను. నవ్వుతూ కళకళలాడే ఆమె ముఖంలో విషాదఛాయలు స్పష్టంగా కనిపించాయి. ”అలా ఉన్నారేం?” అన్నాను ఆందోళనగా.
”ఏం లేదు. మిమ్మల్ని చూస్తుంటే అక్కను చూసినట్లుంది. నా మనసు విప్పి మీ ముందు పెట్టాలని ఉంది. ఏమిటో నిర్మల గారూ! నాకు జీవితం మీద విసుగు కలుగుతోంది. అందుకే నా ప్రియబాంధవి కోసం ఎదురుచూస్తున్నాను. నేను ఆశ్చర్యంగా ఆమె మాటలు వింటున్నాను. ”నా ప్రియబాంధవి ఎవరో తెలుసా?” తెలియదన్నట్లు తలూపాను. ”మత్యుదేవత!” నేను ఉలిక్కిపడ్డాను.
”నీవు చిన్నదానివి. భర్త, బిడ్డలు ఉన్నదానివి. ఈ వయసులో నీవిలా మాట్లాడటం న్యాయం కాదు. నీవెందుకలా కోరుకుంటున్నావో నాకర్ధంకావటం లేదు” అన్నాను.
”అవును, ఎవరికీ అర్థం కాదు. నాది సలక్షణమైన సంసారమనీ, నా భర్త చదువు, సంస్కారం కలవాడనీ, నేనొక రచయిత్రిననీ అందరికీ తెలుసు. కానీ ఈ నా రచనలు మీముందు ఉంచటానికి నేను పడే ఇబ్బందులు భగవంతుడికి తెలుసు” అంది.
”అంటే?” అని అడిగాను.
”మీకు ఎలా చెప్పను? నాచేత కథలు రాయించడం మాన్పించాలని మా వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ లాభం లేకపోయింది.. నాలో చెలరేగే భావాలకు తట్టుకోలేక, ఆ భావాలను కాగితం మీద పెట్టే అవకాశం లేక, నేను అల్లాడిపోతున్నాను. మీరు చెప్పండి. ఇది న్యాయమేనా?”
”అంటే మీవారికి మీరు కథలు రాయటం ఇష్టం లేదా?”
”ముమ్మాటికీ ఇష్టంలేదు. ఎప్పుడైనా ఒకటి, అర రాసినా, కాగితాలు ఆయన కంటపడితే అవి కాలి మసి కావాల్సిందే.
కానీ… రాయడం మాత్రం మానలేకపోతున్నాను. నాకు ప్రాణప్రదమైన వీణను మూలన పడేశాను. అందరినీ అలరించే నా సంగీతానికి స్వస్తిచెప్పాను. ఆయన కోసం ఇవన్నీ మానేశాను. అందుకే ఏ అర్ధరాత్రో ఆయన నిద్రపోయిన తర్వాత రాసుకొని చాలా జాగ్రత్తగా దాచి పత్రికలకు పంపిస్తాను”
నేను వింటూ కూర్చున్నాను.
”భార్య అభిలాషలను అంతగా అడ్డగించే నా భర్త, నాకు ఇష్టం లేని పనులు చేస్తాడు. అయినా నేనేమీ అనకూడదు. అసలు నా పట్ల గౌరవం లేదు, నాకు జాలి, దయ కాదు, గుర్తింపు కావాలి. ఇప్పుడు చెప్పండి, నన్నేం చేయమంటారు?”
”మాధవీ, నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవు కదూ. స్త్రీకి భర్త, సంసారం. వీటి తర్వాతే ఏ వ్యాపకమైనా ఉండాలి. మీ భర్తకు అంతగా ఇష్టం లేని ఆ రచన మీరు మానేస్తే మీ సంసారం సుఖంగా ఉంటుంది కదా?”
ఆడవారి నుండి మంచి రచనలు రావటం లేదనే విమర్శ ఉన్న ఈ రోజుల్లో చక్కటి రచనలు అందిస్తున్న ఆమెను మానమని చెప్పనా? మనసు ఎదురు తిరిగినా ఆమె భవిష్యత్తు కోసం అలా చెప్పక తప్పలేదు.
”ఆయనకోసం నేను ఎన్నో వదులుకున్నాను. కానీ నాకోసం ఒక్కటి… నాకు ఇష్టంలేని పని ఒక్కటి ఆయన వదులుకోలేదు? మరి అలాంటప్పుడు నాకు ఆనందాన్నిచ్చే ఈ ఒక్క వ్యాపకాన్ని నేను ఎందుకు వదులు కోవాలి. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది నిర్మల గారూ” అంది.
”అయితే పరిష్కారం నీవే ఆలోచించుకోవాలి” అన్నాను.
”మనసంతా వికలమైపోయింది”.
ఒక్కటే చెప్పాను ”నీ ఆత్మవిశ్వాసం మీద చాలా గౌరవం ఉంది”.
”ఆ గౌరవం కట్టుకున్నవాడికి లేక పోయింది. ఒక రచయిత్రిగా, సాటి స్త్రీ గా నన్ను ఇంత అభిమానించి గౌరవించే వారిని మిమ్మలనే చూశాను” అని ఆటో ఎక్కి వెళ్లి పోయింది.
ఆ రోజు నాకు బాగా గుర్తు. మాధవి మా ఇంటికి వచ్చినప్పుడు చాలా అందంగా అలంకరించుకుంది. పట్టుచీర, నగలతో నిండుగా ఉంది. చేతిలో ఒక పెద్ద కవర్ కూడా ఉంది.
ఎంతో హుషారుగా వచ్చింది. ”చూశారా, మావారు మీ ఇంటికి రావటానికి మాత్రం అభ్యంతరం చెప్పడం లేదు. మీ గురించి ఆయన స్నేహితులు గొప్పగా చెప్పారట. మీరంటే ఆయనకెంతో గౌరవం” అంది.
”చిత్రంగా ఉందే. నన్నొక్కసారి కూడా ఆయన చూడకుండానే” అన్నాను నవ్వి.
తర్వాత మాధవి వెళ్తూ హడావిడిగా చాలా చెప్పింది సాధారణంగా రచయిత్రులు రాయలేని అనేక నాటకాలు ఆమె రాసింది. వాటికి మంచి పేరు కూడా వచ్చింది. ఆ రాత్రి చాలాసేపటికి కానీ నిద్ర రాలేదు.
సాయంత్రం నాలుగు గంటలకు మాధవి భర్త మళ్ళీ వచ్చాడు. నేను పని చేసుకుంటున్నాను.
”రండి, లోపల కూర్చోండి” అని అతనిని గదిలో కూర్చోబెట్టాను. అతడిలో నిన్నటికి, ఈ రోజుకి చాలా మార్పు కనిపించింది. మనిషి ఆందోళనగా, నీరసంగా కనిపించాడు.
”మాధవి నన్ను వదిలి వెళ్లిపోయిందండి” అన్నాడు.
అతని కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. ఆశ్చర్యంతో ఏమీ మాట్లాడలేకపోయాను.
”ఆమె భర్తగా నన్ను గౌరవించలేదు. అభిమానించలేదు. గహిణిగా ఏనాడూ ఇంటి బాధ్యత స్వీకరించలేదు. మా పెద్దమ్మాయిని పని మనిషి మీద వదిలి తాను సంఘాలనీ, రచనలనీ, స్నేహితులనీ తిరుగుతుండేది. రాత్రి తొమ్మిది, పది గంటలకు ఇల్లుచేరేది. ఆమె చేసేవన్నీ చూస్తూ భరించాను. ఎందుకంటారు? ఏమైనా అంటే పుట్టింటికిపోయి కూర్చుంటుంది. ఆమెను వదిలి నేను ఉండలేను.
ఇలా ఎన్నోసార్లు ఆమె వెళ్లడం, నేను బతిమలాడడం, ఆమె అన్నలు నచ్చజెప్పి పంపడం జరిగింది. కానీ ఇప్పుడు అసలే వెళ్లిపోయింది” అని అతను మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. పైగా మీరైనా అర్థం చేసుకుంటారని అనగానే…
”ఆపండి. ఒక విషయం అడగాలని ఉంది”
”అడగండి”
”ఆమె మంచి రచయిత్రి. అలాంటి వ్యక్తిని రాయొద్దనడం, మీరు నిర్బంధించడం బాగుందంటారా?”
”…”
”రచయిత్రికి కొంత మూడ్ ఉంటుంది. అది అర్థం చేసుకుని సహకరించాలి కదా!”
”నేను వద్దని అనలేదు, ఇంట్లో పని చేసుకుని రాయొచ్చు కదా అన్నాను”
అర్థమైంది. ఆమె లేకపోయే సరికి ఒడ్డున పడ్డ చేపలా గిలగిలలాడుతున్నాడు.
వివాహ బంధాన్ని విడిచిపెట్టడానికి ఆమె ఎంత మానసిక క్షోభ అనుభవించిందో! తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఎంత పరితపించిందో ఇతన్ని చూస్తేనే అర్ధమయింది
రెండు నెలల తర్వాత ఒక పత్రికలో కథ చదువుతుంటే ఇది మాధవి రాసిందే అనిపించింది. కానీ ఆ కథ వేరే పేరుతో ఉంది. ఆ తర్వాత మాధవి స్నేహితురాలు సునంద కనిపించింది. అది మాధవి కథేనని చెప్పింది. కలం పేరుతో రాస్తోంది అని చెప్పింది.
క్రమంగా మాధవిని మరచిపోయినా, అప్పుడప్పుడూ గుర్తు వస్తూనే ఉండేది. నాలుగు సంవత్సరాల తర్వాత అన్నయ్యకి రైల్లో సునంద కనిపించిందట. అప్పుడు తనే ”నిర్మలకి చెప్పండి ఏడాది క్రితం మాధవి కోర్టు ద్వారా భర్త నుండి విడాకులు పొందిందని, అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని, అయితే ప్రస్తుతం మాధవి ఎక్కడుందో తెలియదని చెప్పింది.
కానీ నాకు ఎప్పటికీ అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక రోజు ”హాయ్ నా ప్రాణ స్నేహితురాలా” అంటూ మాధవి నా తలుపు కొడుతుంది.
ఏ గౌరవం కోసం ఆమె తన జీవితంలో చాలా ముఖ్యమయిన పెళ్లిని కూడా కాదనుకుని వెళ్లిందో, ఆ గౌరవం, ఆమె అందరి నుంచి పొందాలని మనసార కోరుకున్నాను.
- మణి వడ్లమాని, 9652067891



