– దానం నాగేందర్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి
– సీఎం, స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయండి : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి హరీశ్‌రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పందించాలని రాహుల్ గాంధీని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఆదేశాలను జారీ చేయాలన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి హరీశ్‌రావు శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించాలని కోరారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తోందనీ, కానీ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఆ మాటలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను రక్షిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు ఆ హామీకి భిన్నంగా ఉన్నదని విమర్శించారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ బీ-ఫారం మీద పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తు చేశారు. ఇది ఊహాగానం కాదనీ, ప్రజలకు తెలిసిన వాస్తవమనీ, అందుకు సంబంధించిన అఫిడవిట్ కూడా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఉందని వివరించారు. ఈ అంశంపై స్పీకర్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని చెప్పడం ఆశ్చర్యకరమని తెలిపారు. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరో పార్టీ బీ-ఫారం మీద ఎన్నికల్లో పోటీ చేయడం కూడా పార్టీ మారినట్టు ఆధారం కాకపోతే, మరెమిటని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవడం కోసమే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తెచ్చారని గుర్తు చేశారు. ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి కూడా ఎమ్మెల్యేగా కొనసాగితే ప్రజాస్వామ్యానికి అది ప్రమాదకరమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు సూచనలు చేసి దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కేవలం ప్రసంగాలతో కాకుండా చర్యలతో కాపాడాలని సూచించారు.
పార్టీ ఫిరాయింపులపై స్పందించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



