– బస్టాండ్ వద్ద ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం
నవతెలంగాణ -పరకాల
పరకాల బస్టాండ్ మలుపు వద్ద గత నెల 31 న జరిగిన ఘోర ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందిన ఘటనపై అధికారులు స్పందించారు. ‘నవతెలంగాణ’ పత్రికలో ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చింది. రోడ్డుపై ఇష్టారాజ్యంగా వెలిసిన ఆక్రమణలే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని నిర్ధారించిన మున్సిపల్ మరియు ఆర్టీసీ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించారు. శనివారం ఉదయం మున్సిపల్ మరియు ఆర్టీసీ అధికారులు బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రహదారికి అడ్డంగా, ట్రాఫిక్ అంతరాయం కలిగేలా ఉన్న తోపుడు బండ్లు, పండ్ల దుకాణాల యజమానులతో అధికారులు సమావేశమయ్యారు. పాదచారులకు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా వ్యాపారాలు నిర్వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎస్ అంజయ్య, ఆర్టీసీ డిఎం మాట్లాడుతూ.. బస్టాండ్ ప్రవేశ ద్వారం వద్ద మలుపులు తిరిగే సమయంలో డ్రైవర్లకు వ్యూ అడ్డుపడకుండా తక్షణమే ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు.నిబంధనలు అతిక్రమిస్తే సామాగ్రిని జప్తు చేయడమే కాకుండా, పోలీసుల సహకారంతో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బస్టాండ్ సెంటర్లో పాదచారుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ చేపడతామని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాతనైనా అధికారులు స్పందించి ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ చర్యలు రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా అమలు చేస్తారా లేదా వేచి చూడాల్సి ఉందని పలువురు చర్చించుకోవడం గమనార్హం.



