సస్పెన్స్ కు తేరా… ఎట్టకేలకు భర్తీ..
నడిపల్లి ఈవోగా గంగాధర్ బాధ్యతల స్వీకరణ…
నవతెలంగాణ – డిచ్ పల్లి
మేజర్ గ్రామ పంచాయతీ నడిపల్లి ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో) గా గడ్కోల్ గంగాధర్ గురువారం ఇన్చార్జి కార్యదర్శి రాధిక నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నడిపల్లి గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. గతంలో పనిచేసిన ఈవో కిషన్ రావు పదవి విరమణ చేయడంతో ఇక్కడ పోస్టు ఖాళీ అయింది. గంగాధర్ రూద్రుర్ లో విధులు నిర్వహించారు.ఇక నుండి పూర్తిస్థా యి బాధ్యతలను చేపట్టారు.ఇంచర్జి రాధిక,జూనియర్ అసిస్టెంట్ రజాత్ కుమార్, బిల్ కలెక్టర్లు సంతోష్, రవి, శ్యాం సన్, తోపాటు పంచాయతీ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
నవతెలంగాణకు స్పందన.. ఇన్చార్జి పాలన ఇంకెన్నాళ్లు
మేజర్ గ్రామపంచాయతీకి కార్యదర్శి నియమించేదెన్నడు ఇబ్బందులు పడుతున్న ప్రజలు అనే శీర్షికతో గత నెల 22న నవతెలంగాణలో కథనం ప్రచురించింది. దానికి గాను డిచ్ పల్లి మండల కేంద్రంలోని నడ్పల్లి మేజర్ గ్రామ పంచాయతీకి గత నాలుగు నెలలుగా ఇన్చార్జి కార్యదర్శి పాలనలోనే కొనసాగింది. మండలంలోనే మేజర్ పంచాయతీ కావడంతో కార్యాలయం తెరిచినప్పటి నుంచి సాయంత్రం వరకు గ్రామస్తులు, అధికారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి పంచాయతీకి పర్మినెంట్ కార్యదర్శిని నియమించకపోవడంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు.
గతంలో ఇక్కడ గ్రేడ్ వన్ కార్యదర్శిగా విధులు నిర్వహించిన నిట్టు కిషన్ రావు మార్చి31న ఉద్యోగ విరమణ చేశారు. మరుసటి రోజు పంచాయతీలో ఉన్న జూనియర్ అసిస్టెంట్ రజాత్ కుమార్ వారం పాటు ఇన్చార్జి కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. వారం తిరగక ముందే మండలంలోని ఆరేపల్లి గ్రామపంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్న గ్రేడ్ వన్ కార్యదర్శి రాధిక కు మేజర్ గ్రామపంచాయతీ ఇన్చార్జిగా బాధ్యతలను అప్పజెప్పారు.
ముందు తన గ్రామపంచాయతీకి వెళ్లి పనులు చేసుకుని ఇన్చార్జిగా ఉన్న నడ్పల్లి పంచాయతీకి రావడంతో ప్రజలు ఏదైనా పనులు చేసుకోవాలంటే మధ్యాహ్నం వరకు వేచి చూడక తప్పలేదు. ఇక నుండి ఆ ఇబ్బందులు ఉండవని, పూర్తి స్థాయిలో పంచాయతీ కార్యదర్శిని నియమించడంతో గ్రామస్తులు నవతెలంగాణతో సంతోషం వ్యక్తం చేశారు.