Monday, April 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంతైవాన్‌తో సంబంధాల పునరుద్ధరణ

తైవాన్‌తో సంబంధాల పునరుద్ధరణ

- Advertisement -

కేఎంటీ నాయకురాలితో జిన్‌పింగ్‌ భేటీ
బీజింగ్‌ :
తైవాన్‌తో నిలిపివేసిన కొన్ని సంబంధాలను పునరుద్ధరిస్తామని చైనా ప్రకటించింది. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శి షీ జిన్‌పింగ్‌, కేంద్ర కమిటీ సభ్యులకు, చైనా కువోమింటాంగ్‌ (కేఎంటీ) పార్టీ అధ్యక్షురాలు చెంగ్‌ లి-వున్‌, ప్రతినిధులకు మధ్య శుక్రవారం బీజింగ్‌లో సమావేశం జరిగింది. కేఎంటీ బృందం పర్యటన బీజింగ్‌ సహా చైనాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా సీపీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. చైనా, తైవాన్‌లోని వివిధ ప్రాంతాల మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. తైవాన్‌లోని వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులుసహా నాణ్యమైన వస్తువులపై ఉన్న ఆంక్షలను తొలగించి, చైనా మార్కెట్లలోకి అనుమతించనున్నారు. సీపీసీ, కేఎంటీల మధ్య ఒక క్రమబద్ధమైన సంప్రదింపుల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. తైవాన్‌కు అత్యంత సమీపంలోని ప్రధాన భూభాగ ప్రాంతమైన ఫుజియాన్‌ ప్రావిన్స్‌లోని తీర ప్రాంతాలకు, సముద్రతీర ద్వీపాలు కిన్వెన్‌, మాట్సులకు విద్యుత్‌, గ్యాస్‌ సరఫరా అందించాలని, భవిష్యత్‌లో వాటికి సముద్ర వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొంది. 1992 ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని, ”తైవాన్‌ స్వాతంత్య్రాన్ని” వ్యతిరేకించడం అనే ఉమ్మడి రాజకీయ అవగాహన మేరకు ఇరు పార్టీలు చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి.

పదేండ్ల తర్వాత సీపీసీ, కేఎంటీ నాయకుల మధ్య జరిగిన ఈ సమావేశంలో షీ జిన్‌పింగ్‌ మాట్లాడుతూ తైవాన్‌ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనీయులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. జాతీయ పునరుజ్జీవనాన్ని సాధించడానికి ఉమ్మడి ప్రయత్నాలు చేయాలని కోరారు. 1992 నాటి ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని అన్నారు. ”తైవాన్‌ స్వాతంత్య్రాన్ని” కోరుతూ వేర్పాటువాద ఆలోచనలను విడిచిపెట్టి, చర్చల ద్వారా శాంతియుత పరిస్థితులను నెలకొల్పాలని, ఇరు దేశాల ప్రజల శ్రేయస్సుకు కట్టుబడి ఉండాలని చెప్పారు. కెఎంటితోపాటు తైవాన్‌లోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు, అన్ని రంగాలకు చెందిన బృందాలు, వ్యక్తులతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. శాంతియుత అభివృద్ధి ద్వారా ఉమ్మడి మాతృభూమిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. తైవాన్‌ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ సందర్భంగా కెఎంటి నాయకురాలు చెంగ్‌ మాట్లాడుతూ తైవాన్‌ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు చైనీయులేనని, ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. పరస్పర రాజకీయ విశ్వాసాన్ని బలోపేతం చేయాలని, అన్ని రంగాల్లో సహకారాన్ని విస్తరించాలని చెంగ్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -