వీబీ జీ రామ్ జీ ని రద్దు చేయండి : సీఐటీయూ మహాసభ డిమాండ్
అనంతలవట్టం అనందన్ నగర్ (విశాఖ) నుంచి నవతెలంగాణ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమల్లోకి తీసుకువచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని తక్షణమే అమలుల్లోకి తీసుకురావాలని సీఐటీయూ అఖిలభారత మహాసభ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కాశ్మీర్ సింగ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, పంజాబ్‌కు చెందిన అమర్‌నాథ్ బలపర్చారు. ‘నిధులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా ఇస్తూ, 200 రోజుల పనిదినాలను కల్పిస్తూ మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి’ అని తీర్మానంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశలో నిర్ణయం తీసుకునేంతవరకు కార్మికులు, ప్రజలు ఐక్యంగా పోరాడాలని మహాసభ పిలుపునిచ్చింది. నరేంద్రమోడీ ప్రభుత్వం అమానుషంగా, దురుద్ధేశ్యపూర్వకంగా మహాత్మాగాంధీ చట్టాన్ని రద్దు చేసిందని తెలిపారు. ‘గ్రామీణ పేదలకు జీవనాడిగా ఉన్న ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ సర్కార్ తొలినుంచీ కుట్ర పన్నింది. అందులో భాగంగానే బడ్జెట్ కేటాయింపుల్లో కోత విధించింది. ఇప్పుడు ఏకంగా పనిహక్కే లేకుండా చేసింది’ అని పేర్కొన్నారు.
కార్పొరేట్ హిందుత్వ శక్తుల పట్టుకోసమే
‘మహాత్మాగాంధీ పేరు ఉన్న ఉపాధిహామీ చట్టంను తొలగించి. దాని స్థానంలో ఉపాధికి పూచీ లేని ‘జీ రామ్ జీ’ చట్టంను తీసుకురావడం వెనుక ధనిక రైతులు, భూ స్వాములు, పెట్టుబడిదారులకు మేలు చేసే లక్ష్యం ఉంది’ అని మహాసభ తీర్మానంలో పేర్కొంది.’ గ్రామీణ పేద రైతులు వ్యవసాయ కార్మికుల హక్కులపై కొత్త చట్టం దాడి చేస్తోంది. ఇది ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావిత బీజేపీి ప్రభుత్వం కార్పొరేట్, హిందుత్వ శక్తుల పట్టును బలపర్చేందుకు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న ప్రయత్నం. ఇది పాలకుల విభజన రాజకీయాలకు, నయా ఉదారవాద అజెండా అమలు తీరుకు నిదర్శనం’ అని మహాసభ తీర్మానంలో తెలిపింది.
తిరోగమన చట్టం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దరించాలనీ నిధులు పెంచి బలోపేతం చేయాలని మరో తీర్మానాన్ని కాశ్మీర్ సింగ్ ఠాకూర్ ప్రవేశ పెట్టగా..అమర్‌నాద్ బలపర్చారు. మహాసభ ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ అండ్ ఆజవిక మిషన్(గ్రామీణ) చట్టం (వీబీ-జీ రామ్‌జీ2025)ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ మహాసభ డిమాండ్ చేసింది.ఉపాధి హామీ పథకాన్ని మెరుగైన వేతనాలతో మరిన్ని పనిదినాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రాంజీ చట్టం ఒక తిరోగమన చర్య అని విమర్శించింది.
ఎందుకు వ్యతిరేకించాలి?
-కార్మికుడు కోరినప్పుడల్లా పని కల్పించరు. డిమాండ్ ఆధారిత విధానం రద్దు అవుతుంది.
-కేంద్రం నిర్ధేశించిన బడ్జెట్ పరిమితి కారణంగా సరఫరా ఆధారిత విధానంగా మారింది.
-40శాతం ఖర్చును రాష్ట్రాలపై తోసివేసింది. ఈ అదనపు భారం గ్రామీణ కార్మికుల ఉద్యోగాలు, వేతనాలపై ప్రభావం పడుతోంది.
-వేతనాల నిర్ణయం, పథకం అమలయ్యే ప్రాంతాలు, కాల పరిమితి అన్నింటిపైనా కేంద్రానిదే అధికారం.
-గ్రామసభల ప్రాధాన్యతను తగ్గించడం 73వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకం
-జాబ్ కార్డుల రేషనలైజేషన్, డిజిటల్ హాజరు తప్పనిసరి చేయడం గ్రామీణ పేదలను పథకానికి దూరం చేస్తుంది.



