అమెరికా నిర్ణయం
పోర్టులో భారత్ కార్యకలాపాలకు బ్రేక్
వాషింగ్టన్ : ఇరాన్‌లోని ఛాబహార్ ఓడరేవుపై గడచిన ఏడు సంవత్సరాలుగా ఆంక్షలను ఎత్తివేస్తున్న అమెరికా ఇప్పుడు వాటిని తిరిగి అమలులోకి తెస్తానని ప్రకటించింది. భారత్ ప్రస్తుతం ఈ ఓడరేవు ద్వారానే ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాతో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది. ఇప్పుడు తిరిగి ఆంక్షలను అమలు చేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయంతో మన దేశానికి ఆ దారి మూసుకుపోయినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఈ నెల 29 నుంచి ఛాబహార్ ఓడరేవుపై అమెరికా ఆంక్షలు అమలులోకి వస్తాయి. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తాజాగా ఆంక్షలు విధించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశంగా కన్పిస్తోంది. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న ‘గరిష్ట ఒత్తిడి’ విధానానికి అనుగుణంగా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్-ప్రొలిఫరేషన్ యాక్ట్ (ఐఎఫ్‌సీఏ) ప్రకారం ఓడరేవుపై విధించిన ఆంక్షలకు 2018లో మినహాయింపు ఇచ్చారు. ఛాబహార్ ఓడరేవులో భారత్ కార్యకలాపాలు కొనసాగించడానికి ఈ మినహాయింపు వీలు కల్పించింది. ఇకపై ఓడరేవులో కార్యకలాపాలు సాగించే ఏ దేశమైనా అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రంప్ ఫిబ్రవరిలో సంతకం చేసిన జాతీయ భద్రతా మెమొరాండం మేరకు విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించినప్పుడు ఛాబహార్‌లో ప్రభుత్వ రంగంలోని ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపీజీఎల్)కు కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి హక్కులు కల్పించే దీర్ఘకాలిక లీజు ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఒప్పందం ప్రకారం ఈ లీజు ఒప్పందం పది సంవత్సరాలు అమలులో ఉండాలి. కానీ ట్రంప్ నిర్ణయంతో అది రద్దయింది.