నేడు, రేపు పత్తి మార్కెట్లలో సీపీఐ(ఎం) బృందాల పర్యటనలు : జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పత్తి కొనుగోళ్లపై సీసీఐ విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధ, గురువారాల్లో తమ పార్టీ బృందాలు పత్తి మార్కెట్లలో సందర్శిస్తాయని ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతులకు పిలుపునిచ్చింది. మంగళ వారం ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిన్నింగ్‌మిల్లుల యజమానులు బంద్‌తో వ్యాపారులు, గుమా స్తాలు, కార్మికులు ఆందోళన చేస్తున్నారనీ, నిర వధిక బంద్ వల్ల పత్తి లోడ్లతో మిల్లుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు బారులుతీరి రైతులు ఇబ్బందు లకు గురవుతున్నారని తెలిపారు. అకాలవర్షాల నేపథ్యంలో అండగా ఉండాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుబట్టారు. సమస్య పరిష్కారం కోసం రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజీపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పత్తి తడిసిపోయిందనీ, సీసీఐ ద్వారా క్వింటాకు రూ.8100 మద్ధతు ధర కేంద్రం ప్రకటించినా ఎక్కడా అమలు కావడంలేదని తెలిపారు. ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనాలనే నిబంధనను సీసీఐ ఏడు క్వింటాళ్లకు కుదించడం దారుణమని విమర్శించారు. 12 శాతం తేమ పేరుతో పంటను కొనుగోలు చేయకపోవడం అన్యాయమనీ, తీవ్ర చలి ఉన్న నేపథ్యంలో 12 శాతం లోపు తేమ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రోజుకో నిబంధన పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదని సూచించారు. మధ్య దళారీల చేతిలో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారని తెలిపారు. పెట్టుబడి కూడా రాక అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. కపాస్ కిసాన్ యాప్ సాంకేతిక సమస్యలతో స్లాట్లు బుక్ కాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరును వివరించారు. ఆ యాప్‌ను వెంటనే తొలగించాలనీ, పత్తి కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
పత్తి కొనుగోళ్లపై ఆంక్షలు ఎత్తేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



