– ఫెడరేషన్ ఖండన
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో మీడియాపై ఆంక్షలు విధించడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) యాక్టింగ్ ప్రెసిడెంట్ పిల్లి రాంచందర్, ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య ఖండించారు. నీటిపారుదల శాఖ సమాచారం లీక్ అవుతోందన్న అనుమానాలతో నిఘా పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజాసమస్యలను మీడియా వెలికితీస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 19(1)(ఏ) ప్రకారం మీడయాకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని గుర్తు చేశారు. జలసౌధలో గోడలపై ఆంక్షలకు సంబంధించిన పోస్టర్లను అంటించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యోగులను సైతం ఐడీ కార్డులను చూపించాకే లోపలికి పంపించడం ఒక నాటకమని అభిప్రాయపడ్డారు. మీడియాను జలసౌధలోకి వెళ్లకుండా నియంత్రించడాకే ఉద్యోగులను సైతం ఐడీ కార్డులు చూపించాలంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిన్‌గేటు దగ్గర మీడియాను అడ్డుకునేందుకు ఇద్దరుముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. వార్తాసేకరణకు వెళ్లే మీడియాను గేటు వద్దే ఆపేస్తుండటం ఎంతమాత్రం సమంజసం కాదని చెప్పారు. లోపలికి విజిటింగ్ కార్డు లేదా స్లీప్ పంపిన తర్వాత సంబంధిత అధికారులు అంగీకరిస్తేనే లోపలికి పంపుతామని షరతులు విధించడాన్ని నిరసించారు. ఈ విషయంపై సమాచారం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక దృష్టిసారించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జలసౌధలో మీడియాపై ఆంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



