నాయకుల ముందస్తు అరెస్టులు
సచివాలయాన్ని ముట్టడించిన డీవైఎఫ్‌ఐ నేతలు
నోటిఫికేషన్లను ప్రకటించాలని డిమాండ్
జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి
అరెస్టులకు నిరసనగా నేడు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించింది. యువజన సంఘాల నాయకులను గురువారం సాయంత్రం నుంచే హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల్లో ముందస్తుగానే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అడుగడుగు నా ఆంక్షలను విధించారు. నిరుద్యోగులు హైదరా బాద్‌కు రాకుండా నిఘా పెట్టారు. హైదరాబాద్‌లో ఉండే నాయకులను కూడా సచివాలయం వద్దకు వెళ్లనీయకుండా నిర్బంధాన్ని ప్రయోగించారు. ప్రభుత్వం, పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) నాయకులు సచివాలయ ముట్టడికి యత్నించారు. బీఆర్‌కేఆర్ భవన్ నుంచి ప్రదర్శనగా సచివాలయం వైపు వచ్చారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు డీవైఎఫ్‌ఐ నాయకులను అడ్డుకున్నారు. ఈ సమయంలో తోపులాట, వాగ్వివాదం చోటుచే సుకుంది. సచివాలయంవైపు వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో కొంతసేపు ఉద్రిక్తత జరిగింది. దొరికిన వారిని దొరికినట్టుగానే వాహనాల్లోకి ఎక్కించారు. అరెస్టు చేసి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
జాబ్ క్యాలెండర్‌ను అమలు చేసి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేయాలని కోరుతూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టుల మీద పెట్టిన శ్రద్ధను జాబ్ క్యాలెండర్ అమలు, ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ల విడుదలపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరుతో అడుగడుగునా అక్రమ అరెస్టులు చేయడం దారుణమని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా యువజన నాయకులను ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగ యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పటివరకు కేవలం గత ప్రభుత్వ నోటిఫికేషన్లతో కలిపి 55 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని చెప్పారు. ఇంకా 1.45 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు. బీఆర్‌ఎస్ చేసిన తప్పులనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్నారు.
ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నదని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేంత వరకు నిరుద్యోగ భృతి రూ.నాలుగు వేలు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. నిధులు కేటాయించకుండా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. యువతకు స్వయం ఉపాధి రుణాల కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు లబ్దిదారులను ఎంపిక చేయలేదనీ, రుణాలను మంజూరు చేయలేదని అన్నారు. ఎలాంటి షరతుల్లేకుండా రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయం ముట్టడికి రాకుండా ఉండేందుకు డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌తోపాటు అన్ని జిల్లాల నాయకులు, కార్యకర్తలను సుమారు 220 మందిని పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి తప్ప అరెస్టులు, నిర్బంధాలతో కట్టడి చేయడం సరికాదన్నారు. అరెస్టులను నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జావీద్, ఏ కృష్ణా నాయక్, జిల్లా నాయకులు రాజయ్య, కృష్ణ, శ్రీను నాయక్, రాజేష్, వినోద్, నిరుద్యోగులు నవీన్, సందీప్, రాజేందర్, రామ్, రాకేశ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
నిరుద్యోగులపై నిర్బంధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES