7న 866 మంది డాక్టర్లకు నియామకపత్రాలివ్వనున్న
మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్టు), 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఫలితాలను శనివారం సాయంత్రం విడుదల చేసింది. మిగిలిన 433 అసిస్టెంట్ ప్రొఫెసర్, 924 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మే నెలలో పూర్తిచేయనున్నది. ఈ నెల ఏడో తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన 871 మంది డాక్టర్లకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నియామక పత్రాలను అందజేయనున్నారు. మొత్తం 1616 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్), 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకుగానూ గైనకాలజీ, అనస్తేషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ స్పెషాలిటీలకు సంబంధించిన 174 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేసింది. 1616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులకుగానూ గైనకాలజీ, అనస్తేషియా, పీడియాట్రిక్స్ స్పెషాలిటీలకు సంబంధించిన 692 పోస్టులకు ఎంపికైన డాక్టర్ల లిస్టును బోర్డు విడుదల చేసింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల వివరాలు
గైనకాలజీ 90
అనస్తేషియా 44
పీడియాట్రిక్స్ 28
ఆర్థోపెడిక్స్ 12
మొత్తం 174
అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టుల వివరాలు
అనస్తేషియా 226
గైనకాలజీ 247
పీడియాట్రిక్స్ 219
మొత్తం 692



