Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రొఫెసర్‌ అన్సారీకి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు అందించాలి

ప్రొఫెసర్‌ అన్సారీకి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు అందించాలి

- Advertisement -

– సీఎం రేవంత్‌రెడ్డికి జాన్‌వెస్లీ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ మహమ్మద్‌ అన్సారీకి రావాల్సిన రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు, పెన్షన్‌తో పాటు వైద్య సహాయాన్ని అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు. ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్‌ విభాగంలో సేవలందించిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ మహమ్మద్‌ అన్సారీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండడంతో చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ బకాయిలు సకాలంలో అందక వైద్య ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మానవతా ధృక్పథంతో అన్సారీకి అందాల్సిన సౌకర్యాలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 1996లో లింగ్విస్టిక్‌ డిపార్ట్‌మెంట్‌లోని లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయగా, మహమ్మద్‌ అన్సారీ దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల భర్తీ ప్రక్రియ ఆలస్యమై, 2003లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా జాయినయ్యారని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 2001 ఏప్రిల్‌ ఒకటి నుండి పాత పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి, 2003 నుండి ఎల్‌ఐసీ లింక్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ స్కీమ్‌ కింద అన్సారీ జీతం నుంచి డబ్బులు కూడా జమ చేసుకుందని పేర్కొన్నారు. అకస్మాత్తుగా ఈ స్కీముకు అర్హుడు కాదని 2018 వరకు జమ చేసుకున్న డబ్బులు తిరిగి అన్సారికి చెల్లించిందని తెలిపారు. దీంతో రెగ్యులర్‌, ఎల్‌ఐసీ లింకుడ్‌ పెన్షన్‌ రెండింటికి అన్సారీ దూరమయ్యారని పేర్కొన్నారు. అన్సారీ సెప్టెంబర్‌ 2003లో విధుల్లో చేరినందున, ఆయన కొత్త పెన్షన్‌ విధానం కిందికి వస్తారని యూనివర్సిటీ చెబుతున్నదని తెలిపారు. అన్సారీ తన సర్వీసును 2003 నుండి కాకుండా, నోటిఫికేషన్‌ వెలువడిన 1996 నుండి లెక్కించాలని, తనకు పాత రెగ్యులర్‌ పెన్షన్‌ స్కీంనే వర్తింపజేయాలని గత మూడేండ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారని తెలిపారు. అన్సారీ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. యూనివర్సిటీ కేంద్రంగా అనేకమంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దారని తెలిపారు. రిటైర్డ్‌ ఉద్యోగుల ప్రయోజనాలను సకాలంలో చెల్లించాలని గౌరవ హైకోర్టు ఆదేశించినప్పటికీ, ఇంతటి ఉద్యమ నేపథ్యమున్న విద్యావేత్తకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని పేర్కొన్నారు. తక్షణమే ప్రొఫెసర్‌ అన్సారికి రావాల్సిన రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లతో పాటు, పెన్షన్‌ బకాయీలు వర్తింపజేసి చెల్లించాలని, వారికి తక్షణ వైద్యసహాయం అందించేందుకు సీఎం అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -