న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ భారత్‌లో నిలిచిపోయింది. లీగల్ డిమాండ్ కారణంగా ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసినట్టు తెలుస్తున్నది. అయితే దీనిపై రాయిటర్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే లీగల్ డిమాండ్ కారణంగా భారతదేశంలో విత్‌హెల్డ్‌లో పెట్టినట్టు పేర్కొంటూ ఎక్స్ హాండిల్‌లో కనిపిస్తున్నది. రాయిటర్స్ ఎక్స్ ఖాతా బ్లాక్ అవడంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది.అయితే రాయిటర్స్‌కు సంబంధించిన రాయిటర్స్ టెక్ న్యూస్, రాయిటర్స్ ఫ్యాక్ట్ చెక్, రాయిటర్స్ పిక్చర్స్, రాయిటర్స్ ఏషియా, రాయిటర్స్ చైనా వంటి ఎక్స్ ఖాతాలు భారత్‌లో కనిపిస్తుండటం గమనార్హం. థామ్సన్ రాయిటర్స్‌కు చెందిన న్యూస్, మీడియా విభాగం రాయిటర్స్. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలో 2600 మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు.