Tuesday, April 7, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅసలైన కమ్యూనలిస్ట్‌ రేవంత్‌

అసలైన కమ్యూనలిస్ట్‌ రేవంత్‌

- Advertisement -

కేరళ ఎన్నికల ప్రచారంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరంగా గానీ, సైద్ధాంతికంగా గానీ ఏ మాత్రం పొంతనలేని ఆరోపణలు. ముఖ్యంగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ”కమ్యూనలిస్ట్‌”గా అభివర్ణించడం అంటే కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్లెవరూ ఉపేక్షించరు. రేవంత్‌కు ”కమ్యునల్‌” అనే పదానికి సరైన అర్థం గానీ, దాని నిర్వచనం గానీ బొత్తిగా తెలిసినట్లు లేదు. ఒకవేళ తెలిసి ఉంటే అందుకు సంబంధించిన ఒక్క ఆధారమైన చూపించి మాట్లాడగలిగేవాడు.”కమ్యూనలిజం” అనే పదం భారత రాజకీయాల్లో అత్యంత సున్నితమైనది. ఇది కేవలం ఒక విమర్శ కాదు, ఇది ఒక తీవ్రమైన ఆరోపణ. కమ్యూనలిజం అంటే మతం ఆధారంగా ప్రజలను విభజించడం, ఒక మతాన్ని రాజకీయ లాభం కోసం ఉపయోగించడం, వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచడం. మరి ఈ లక్షణాలు కేరళలో ఎక్కడ కనిపించాయో ”కమ్యునల్‌” భూమిక నుంచి వచ్చిన రేవంత్‌కే తెలియాలి. ముఖ్యంగా పినరయి విజయన్‌ నాయకత్వంలో కనిపిస్తున్నాయా అన్నది పరిశీలిస్తే, జ్ఞానమున్న వారెవరికైనా పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంది.

పినరయి విజయన్‌ నాయకత్వంలోని కేరళం ప్రభుత్వం, లౌకికతను కేవలం మాటల్లో కాకుండా, కార్యాచరణలో చూపించిన అరుదైన ఉదాహరణగా నిలిచింది. సంక్షేమ పథకాల అమలు విషయంలో కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజాపంపిణీ వ్యవస్థ, ప్రభుత్వ వైద్యసేవలు, విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు- ఇవన్నీ సమానత్వాన్ని బలపరిచే విధంగా రూపుదిద్దుకున్నాయి.
కేరళ సమాజం స్వభావత: లౌకిక విలువలను పాటించే సమాజంగా గుర్తింపు పొందింది. హిందూ, ముస్లిం, క్రైస్తవ సమాజాల మధ్య సహజీవనం, పరస్పర గౌరవం అక్కడి సామాజిక నిర్మాణంలో అంతర్భాగంగా ఉంది. పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక ఉద్యమాలు – ఇవన్నీ మతాల మధ్య ఐక్యతను ప్రతిబింబిస్తాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో మత ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్న సమయంలో, కేరళలో శాంతి, సౌహార్ద వాతావరణం కొనసాగడం యాదృచ్ఛికం కాదు, అది అక్కడి విజయన్‌ లాంటి లౌకిక భావాలు కలిగిన సమర్థవంతమైన నాయకత్వంలోని ప్రభుత్వ పాలన, ప్రజాస్వామ్య చైతన్యం ఫలితం. భారతదేశం ఒక సమాఖ్య దేశం. రాష్ట్రాలు పరస్పర గౌరవంతో వ్యవహరించాలి.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో రాష్ట్రంలో ప్రచారం చేస్తూ చేసిన వ్యాఖ్యలు అక్కడి ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. రాజకీయ లాభం కోసం సమాఖ్య స్ఫూర్తిని పక్కన పెట్టిన రేవంత్‌ రెడ్డి అసలైన ”కమ్యూనలిస్ట్‌” ఎన్నికల సమయంలో రాజకీయ లాభం కోసం వాస్తవాలను పక్కనపెట్టి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో రాష్ట్ర ప్రజల ముందు మాట్లాడేటప్పుడు తన మాటల ప్రభావాన్ని అంచనా వేయాల్సిన బాధ్యత కలిగి ఉంటాడు. అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి వాస్తవాధారిత వ్యాఖ్యలే రావాలి గానీ, భావోద్వేగాలను రెచ్చగొట్టే మాటలు రావడం ప్రజాస్వామ్య సంస్కృతికి అనుకూలం కాదు. రేవంత్‌ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు, కేవలం ఎన్నికల వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి.

ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం కోసం ”కమ్యూనలిజం” అనే తీవ్రమైన పదాన్ని ఉపయోగించడం, ఆ పదం అసలు అర్థాన్ని కూడా తగ్గించే ప్రమాదం కలిగిస్తుంది. విజయన్‌పై రేవంత్‌ చేసిన ఆరోపణలతో అతని స్థాయి అర్థం చేసుకోవచ్చు. విజయన్‌ను కమ్యూనలిస్ట్‌గా అభివర్ణించడంతోనే కేరళంలో ఆ పార్టీకి చెందిన యుడిఎఫ్‌ పతనం ప్రారంభమైందని కూడా భావించవచ్చు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండాలి.కానీ, వాస్త వాల ఆధారంగా ఉంటేనే విమర్శకు గాని, విమర్శ చేసిన వారికి గానీ గౌరవం ఉంటుంది. మతం పేరుతో ప్రజలను విభజించడం కమ్యూ నలిజం అయితే, మతభేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా చూడడం లౌకికత. ఇప్పుడు కేరళలో కనిపిస్తున్నది రెండోది. అందువల్ల, ఆరోపణలు చేయడానికి ముందు వాస్తవాలను అర్థం చేసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత.

విజయ్ పుట్టపాగ
8008028237

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -