Saturday, April 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేవంత్‌ పోవాలి.. మార్పు రావాలి

రేవంత్‌ పోవాలి.. మార్పు రావాలి

- Advertisement -

ప్రాజెక్టుల పునరుద్ధరణలో నిర్లక్ష్యం
ఏదో ఒక పార్టీలో చేరాల్సిన ఆవశ్యకత ఉంది : మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
నవతెలంగాణ-జగిత్యాలటౌన్‌

‘రెండేండ్ల పాలనతోనే విసిగిన ప్రజల్లో.. సీఎం రేవంత్‌రెడ్డి పోవాలి.. మార్పు రావాలి’ అనే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. గతంలో కూడా కేసీఆర్‌ పోయి మార్పు రావాలనే నినాదంతోనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని అన్నారు. ఈ రెండేండ్ల కాలంలో రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర సంతృప్తితో ఉన్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. ఇంతకాలం కాంగ్రెస్‌లో తన అడ్డు తొలగించుకునేందుకే నామినేటెడ్‌ పదవుల్లో జాప్యం చేశారని, తాను రాజీనామా చేశాక పలు నామినేట్‌ పదవులను భర్తీ చేశారని ఆరోపించారు.

ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని.. సభ్యత్వమే తీసుకోకుండా, పార్టీ కోసం ఎలాంటి కృషీ చేయని వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. తాను పార్టీలో ఉన్నప్పుడు నామినేటెడ్‌ పదవులకు సంబంధించి పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, తాను రాజీనామా చేసిన వెంటనే ఒకదాని తర్వాత ఒకటి భర్తీ చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు రాజకీయ కోణంలో మాత్రమే ఉన్నాయని, కానీ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మొత్తం ప్రాజెక్ట్‌లో చిన్న భాగమేనని తెలిపారు.

మూడు బ్యారేజీలను పునరుద్ధరించడానికి సుమారు రూ.500 కోట్లలోపే ఖర్చవుతుందని, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని చెప్పారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చినా అమలు చేయలేదన్నారు. ప్రాణహిత నది జలాలను వినియోగించుకునే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కనీసం సరైన డిజైన్‌ కూడా రూపొందించ లేదని అన్నారు. బడ్జెట్‌లో రూ.152 కోట్లు మాత్రమే కేటాయించడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కడెం, ఎస్‌ఆర్‌ఎస్పీ ద్వారా 100 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టడం లేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ తెలంగాణకు జీవనాధారమని, హైదరాబాద్‌ తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, మూసీ ప్రక్షాళన అన్నీ దీనిపైనే ఆధారపడుతున్నాయని చెప్పారు. మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టకపోతే దాదాపు 18 లక్షల ఎకరాల సాగు భూమి, హైదరాబాద్‌ అవసరాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రజా సేవ చేసే విషయంలో తప్పకుండా ఏదో ఒక పార్టీలో చేరాల్సిన ఆవశ్యకత ఉందన్న జీవన్‌ రెడ్డి.. భవిష్యత్‌ రాజకీయ నిర్ణయాలు.. అనుచరుల అభిప్రాయం మేరకు తీసుకుంటానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -