Thursday, November 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురేవంత్‌రెడ్డి మిషన్‌ కమీషన్‌

రేవంత్‌రెడ్డి మిషన్‌ కమీషన్‌

- Advertisement -

రూ.50 వేల కోట్ల విద్యుత్‌ స్కాం…ప్రయివేటీకరణ కోసమే కొత్త డిస్కం
బీజేపీతో కాంగ్రెస్‌ కుమ్మక్కు..కాదంటే విచారణ జరపండి : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిషన్‌ కమీషన్‌ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. మొన్న దేశంలోనే పెద్ద భూకుంభకోణాన్ని బీఆర్‌ఎస్‌ బయటపెట్టిందన్నారు. ఇప్పుడు రూ.50 వేల కోట్ల విద్యుత్‌ కుంభకోణానికి రేవంత్‌ సర్కారు రూపకల్పన చేసిందని చెప్పారు. ఆధారాలతో సహా బయటపెడుతున్నామని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.50 వేల కోట్ల విద్యుత్‌ కుంభకోణంలో దాదాపు 30 నుంచి 40 శాతం కమీషన్లు దండుకోబోతున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏది మాట్లాడినా, ఏం చేసినా.. ఏది చెయ్యకున్నా దాని వెనుక ఒకే ఒక్క మిషన్‌ ఉంటుందనీ, అదే కమీషన్‌ అని అన్నారు. ఏ స్కీంను ఎలా పటిష్టంగా అమలు చేయాలి, ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి మంత్రివర్గం చర్చిస్తుందనీ, కానీ కాంగ్రెస్‌ నేతృత్వంలోని మంత్రివర్గం స్కాంల గురించి ఆలోచన చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్‌ మంత్రివర్గం ఓ దండుపాళ్యం బ్యాచ్‌ అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ పాలన సంక్షేమానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటే, కాంగ్రెస్‌ పాలన బడా స్కాంలకు, అరాచకాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందని అన్నారు. వాటాలు, పంపకాల్లో తేడా రావడంతో మంత్రులే బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారని గుర్తు చేశారు. హెచ్‌ఐఎల్‌టీపీ విధానం సీఎం ఒక్కరి నిర్ణయ ం కాదనీ, మంత్రివర్గ ఉపసంఘానిది అని మంత్రులు మాట్లాడారని అన్నారు. ఈ స్కాంలలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులందరికీ వాటా ఉందన్నారు.

సర్కారు డ్రామా
రామగుండం, పాల్వంచ, మక్తల్‌లో 800 మెగావాట్ల చొప్పున 2,400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని హరీశ్‌రావు చెప్పారు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి ఎన్టీపీసీ, జెన్‌కోకు అవకాశం కల్పిస్తామనీ, ఏది తక్కువ వ్యయంతో నిర్మిస్తే దానికే అవకాశం ఇస్తామంటున్నారని అన్నారు. ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రూ.12.23 కోట్ల ఖర్చు అవుతుందంటూ ఎన్టీపీసీ చెప్పిందన్నారు. అదే విధంగా ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రూ.14 కోట్లు ఖర్చవుతాయంటూ జెన్‌కో పేర్కొందని వివరించారు. ఎన్టీపీసీ, జెన్‌కో డీపీఆర్‌లు ప్రభుత్వం వద్ద ఉన్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నదని అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక మెగావాట్‌ ఉత్పత్తికి యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో రూ.8.63 కోట్లు, భద్రాద్రి విద్యుత్‌ కేంద్రంలో రూ.9.74 కోట్లు, ఎన్టీపీసీలో రూ.12.23 కోట్లు ఖర్చయ్యిందని వివరించారు. కమీషన్లు దండుకోవడానికి జెన్‌కోకు రూ.14 కోట్లకు ఖరారు చేసే అవకాశముందన్నారు. ఒక్కో మెగావాట్‌కు రూ.5,600 కోట్ల చొప్పున 2,400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు. రామగుండంలో ప్రాజెక్టు వ్యయం రూ.10,880 కోట్ల నుంచి రూ.15 వేల కోట్లకు పెరుగుతుందని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రామగుండంలో రూ.నాలుగు వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్టీపీసీ 1,600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసిందని గుర్తు చేశారు. ఇంకా 2,400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. దాని ఉత్పత్తి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తక్కువ ఖర్చుతో విద్యుత్‌ సరఫరా చేయొచ్చని అన్నారు. రేవంత్‌రెడ్డి అపరిచితుడు, చంద్రముఖిలా మారిపోతున్నారని చెప్పారు.

విద్యుత్‌ను అదానీ, అంబానీకి ఇచ్చేందుకు కుట్ర
విద్యుత్‌రంగ ప్రయివేటీకరణ కోసమే కొత్త డిస్కం తెస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. పథకాల కోసం ఒక డిస్కం ఏర్పాటు చేస్తే లాభాలు వచ్చే డిస్కంలను అంబానీ, అదానీలకు ప్రయివేటు పరం చేసేందుకు కుట్ర జరుగుతున్నదని అన్నారు. ఆదాయమే రాని డిస్కంల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం డైరెక్షన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి యాక్షన్‌ చేస్తున్నారని అన్నారు. త్వరలో హైదరాబాద్‌ అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ స్కాం, పంపుడ్‌ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ స్కాం బయటపెడుతామన్నారు. త్వరలో రేవంత్‌రెడ్డి చేసే ఇంటర్‌ స్టేట్‌ స్కాంను ఆధారాలతో సహా బయటపెడతామని చెప్పారు. తాము ప్రతిపక్షంగా ప్రజల తరుపున ప్రభుత్వ స్కాంలు, అన్యాయాలపై ప్రశ్నిస్తే తమపై విచారణలంటూ బెదిరిస్తున్నారని అన్నారు. ఈ స్కాంలపై అవసరమైతే బీఆర్‌ఎస్‌ న్యాయ పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటి కాకుంటే ఈ స్కాంలపై విచారణ జరపాలనీ, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -