కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత
నన్ను బీఆర్‌ఎస్ నుంచి పంపించి ఐదేండ్లయ్యింది
కోళ్ళ ఫారాలు కూల్చారు.. భూములు గుంజుకున్నరు : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాల పునాదుల మీద గెలిచారనీ, ఆ అబద్ధాల పునాదుల మీదనే అయన పాలన కొనసాగిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఆదివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామిర్‌పేటలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనీ, మీడియాను మేనేజ్ చేస్తూ, పైకి బుకాయిస్తూ, దబాయిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో దోచుకున్నదంతా కక్కిస్తా అని అప్పుడు రేవంత్‌రెడ్డి అనీ, ఇప్పుడు ఎందుకు కక్కించడం లేదని ప్రశ్నించారు. సీఎం భక్వాస్ మాటలు మాట్లాడుతున్నారనీ, భూములు అన్యాక్రంతమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
తనను కేసీఆర్ బీఆర్‌ఎస్ నుంచి బయటికి పంపించి ఐదేండ్లు అవుతుందనీ, ఇప్పుడు తాము పార్టీ మారుతున్నానని కొంతమంది పోస్టర్లు వేస్తున్నారని ఖండించారు. పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదనీ, తానే పార్టీలు మారకూడదనే సందేశం ఇచ్చినట్టు తెలిపారు. 25 ఏండ్లు బీఆర్‌ఎస్‌లో ఉన్నందుకు అత్యధికంగా పరిచయం ఉన్నవారు, అభిమానించేవారు ఆ పార్టీలో ఇంకా ఉన్నారని చెప్పారు. తనను పోగొట్టుకుని కేసీఆర్ తప్పు చేశారని ప్రజలు అంటున్నారనీ, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్నారు. మళ్ళీ వీరందరూ కేసీఆర్‌తో కలుస్తారనే చర్చ జరుగుతోందనీ, ఇందులో నిజం లేదన్నారు. తనను బీఆర్‌ఎస్‌లో బర్తరఫ్ చేయడమే కాకుండా ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు.
కోళ్ళ ఫార్మ్‌లు కూల్చారనీ, భూములు గుంజుకున్నారనీ, తాను లీగల్‌లుగా కొనుక్కున్నవి సైతం చెరబట్టారనీ, ఈ విషయమై సీఎంకు లేఖ రాస్తానని తెలిపారు. బీజేపీ ఎంపీలు ఆరు మంది ఉన్నారనీ, తమ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిదిలో జరిగే ఎన్నికలపై సర్వేలు చేస్తున్నామనీ, తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌లోకి వెళ్లి ఉంటే మంత్రినో, డిప్యూటీ సీఎంనో అయి ఉండేవాడిని అని తెలిపారు. తాను పదవుల కోసం పాకులాడననీ, తన పట్ల చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు.
తన పార్లమెంట్ పరిధిలో తనకున్న అవగాహన వేరే వారికి ఉండదనీ, డివిజన్ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలో తనకు తెలుసని తెలిపారు. హుజూరాబాద్ తన పరిధి కాదని చెప్పడంతో ఎన్నికలప్పుడు అటు పోలేదనీ, హుజురాబాద్‌లో తాను ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మెన్ ఓడిపోలేదని గుర్తు చేశారు. ఈ సారి ఆ పార్లమెంట్ పరిధిలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పడంతోనే కలుగజేసుకోలేదని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గెలిచే వారికే టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ సమస్యలపై, సీఎస్‌ఆర్ నిధులపై తాము కూడా ప్రధానికి లేఖ రాసినట్టు తెలిపారు. హుజూరాబాద్ డంపింగ్‌యార్డ్‌పై అక్కడి ప్రజలు పిలిస్తే వెళ్లి నాయకత్వం వహిస్తానని తెలిపారు.
అబద్ధాల పునాదుల మీద గెలిచిన రేవంత్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



