ఇక్కడ హామీలు అమలు చేయకుండా కేరళలో అవాకులు, చివాకులు
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
సుప్రీం తీర్పు మత స్వేచ్ఛకు భంగం
మతమార్పిడి సాధ్యమవుతుంది కానీ కులం మారడం సాధ్యం కావట్లే
నవతెలంగాణ – కంఠేశ్వర్
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వాటిని ఇక్కడ అమలు చేయకపోగా.. కేరళలో మళ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ అమలు చేస్తామని ప్రగర్భాలు పలుకుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ధ్వజమెత్తారు. శనివారం నగరంలోని నాందేవాడల గల సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధికి, రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కొనసాగుతున్న అభివృద్ధికి కనీస పొంతన లేదని అన్నారు.
కానీ రేవంత్ రెడ్డి వాస్తవాలు కాకుండా అవాస్తవాలు మాట్లాడుతూ.. బోగస్ ప్రచారం చేస్తున్న బోగస్ ముఖ్యమంత్రి అని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.2500, వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు ఆర్థిక సాయం, కళ్యాణ లక్ష్మి, ఎంటర్ తులం బంగారం, 2 లక్షల ఉద్యోగాల కల్పన, పేదలకు ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీని పట్టణ ప్రాంతంలో, ఎస్సీ, ఎస్టీలకు దళిత బంధు కింద పది లక్షలు ఇలాంటి హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు.
ఇక్కడ ఏమి అమలు చేయకుండానే కేరళలో ప్రచారం చేయడం మోసం చేయడమే అవుతుందని అన్నారు. కేరళలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం కడుపేదలు లేని రాష్ట్రంగా కేరళను తీర్చిదిద్దిందని దేశంలో కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘనత సాధించిన దాఖలాలు లేవని అన్నారు. తెలంగాణలో 76 శాతం అక్షరాస్యత ఉంటే కేరళలో 100 శాతం ఉందని మరోసారి గుర్తు చేశారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ఉపాధి హామీ అమలు చేస్తుందని, వైద్యం పూర్తిగా అక్కడ ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. కానీ ఇక్కడ వైద్యాన్ని వ్యాపారంగా మార్చారని అన్నారు. సామాజిక న్యాయంలో, మత సామరస్యం పాటించడంలో, దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఆదర్శంగా పనిచేస్తుందని తెలిపారు. దళితులకు, అణగారిన వర్గాలకు పూజారులుగా నియమించిన ఏకైక రాష్ట్రం కేరళ అని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రైవేట్ కాలేజీలకు చెల్లించకపోవడం దారుణమని, దీనిపై హైకోర్టు విద్యార్థుల నుంచి వసూలు చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. పేదలకు ఉచిత విద్య అందించాల్సి ఉండగా దాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చేశారని విమర్శించారు. ఉద్యోగాల కల్పన కోసం నిరుద్యోగ జేఏసీ, డివైఎఫ్ఐ ఉద్యమాలు చేస్తే అరెస్టులతో నిర్బంధిస్తున్నారని వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితులు క్రిస్టియన్‌లోకి మారిన వారిపై వివక్ష పోవడం లేదని, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు.
ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉందని, నచ్చిన మతాన్ని అనుసరించే అవకాశం ఉందని కానీ సుప్రీంకోర్టు తీర్పు మత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని అన్నారు. దేశంలో మతం మారడం సాధ్యమవుతుంది కానీ కులం మారడం మాత్రం సాధ్యం కావడం లేదని, మతం మారినా వివక్ష దాడులు కొనసాగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు.
ఇటీవల కురిసిన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో పసుపు మరియు తదితర పంటలకు నష్టం వాటిల్లిందని, వాటికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్‌లో వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ బి. వెంకట్, మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం మార్చి పేదలకు కల్పిస్తున్న ఉపాధి ని దెబ్బతీసే చర్యల కు పూనుకున్నారు అని విద్యుత్ చట్టాన్ని సవరించి రైతుల కు నష్టం చేస్తున్నారు అని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, ఆశ న్న పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు, పల్లపు వెంకటేష్,శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు గంగాధర్, సుజాత, మరియు శిల్ప లింగం, రాజు, అంజయ్య, అనిత, శ్రీదేవి, ఓడ్డేన్న, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



