మానవాభివృద్ధి సూచిలో అగ్రస్థానంలో ఆ రాష్ట్రం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ – ముషీరాబాద్
కేరళం రాష్ట్రంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ గోల్కొండ చౌరస్తాలోని పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ముఖ్య కార్యకర్తల శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అక్కడి వామపక్ష ప్రభుత్వం, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కేరళంలో వామపక్ష ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించడంలో ముందుందని, విద్యా, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. మానవాభివృద్ధి సూచికలో కేరళం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు కేరళంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో విద్యారంగం ప్రయివేటు రంగంలో ఉన్నదని, ప్రభుత్వ విద్యాసంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ శాతం మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య రంగం కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉందని, ప్రజలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. తెలంగాణలో పేదరికం సంగతి ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది సీపీఐ(ఎం) అని అన్నారు. తమ పార్టీపై దురుద్దేశపూరిత వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా భారత్‌లో కమర్షియల్ గ్యాస్, వంటగ్యాస్ కొరత ఏర్పడిందన్నారు. అనేక హోటళ్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయని తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాల వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. భారత ప్రధాని మోడీ యుద్ధాన్ని వ్యతిరేకించే ధైర్యం చూపడం లేదన్నారు. పొరుగున ఉన్న పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి మధ్యవర్తిత్వానికి ప్రయత్నం చేస్తుంటే విశ్వగురు అని చెప్పుకుంటున్న భారత ప్రధాని చతికిలపడ్డారని విమర్శించారు. ప్రజలందరూ అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించగా, నగర కార్యదర్శి ఎం.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కేరళంపై రేవంత్‌రెడ్డివి అవాస్తవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



