Thursday, April 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకేరళం ముఖ్యమంత్రిపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరిగాదు

కేరళం ముఖ్యమంత్రిపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరిగాదు

- Advertisement -

ఇండియా కూటమికి నష్టం కలిగించేలా ఉన్నాయి
వ్యక్తిత్వ హనానికి పాల్పడొద్దు
అసంఘటిత కార్మికుల కోసం త్వరలో పోరాటం
నియోజకవర్గాల పునర్విభజనపై నిపుణుల కమిటీ వేయాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేరళం ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను అదానీతో పోల్చడం, మోడీకి, విజయన్‌కు మధ్య తేడా లేదని వ్యాఖ్యానించడం తెలంగాణ సీఎం ఎ.రేవంత్‌రెడ్డికి సరిగాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఒక్క రాష్ట్ర ఎన్నికల కోసం ఆయన ఇండియా కూటమికి నష్టం కలిగించేలా, బీజేపీకి లాభం చేకూర్చేలా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. పాలనాపర లోపాలు ఎత్తిచూపి ఓట్లు అడగాలే తప్ప ఇదేం పద్ధతని ప్రశ్నించారు. వ్యక్తిత్వ హనానికి పాల్పడటం సరిగాదని హితవు పలికారు. రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం త్వరలో ఉద్యమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సల్వాజుడుంను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి గతంలో ఇచ్చిన తీర్పును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంట్‌ సాక్షిగా అపహాస్యం చేయడాన్ని ఖండించారు. ఇది న్యాయవ్యవస్థను కించపర్చడం, రాజ్యాంగాన్ని అవమానించడం అవుతుందన్నారు.

దేశ స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలదనీ, భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ లాంటి విప్లవ వీరులను అందించడంతో పాటు అనేక సంస్థానాలను విముక్తి చేసి, భూమి, భుక్తి, పేదవర్గాల కోసం పోరాటాలు చేసి 8 గంటల పని విధానాన్ని అందించిన ఘన చరిత్ర ఉందని వివరించారు. దేశ స్వాతంత్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఏమిటో అమిత్‌షా చెప్పాలని డిమాండ్‌ చేశారు. మావోయిస్టులను భౌతికంగా అంతం చేయవచ్చుగానీ, కమ్యూనిజాన్ని, ప్రశ్నించేతత్వాన్ని ఎవ్వరూ అంతం చేయలేరని స్పష్టం చేశారు. ప్రశ్నించే వారిపై అర్బన్‌ నక్సలైట్లు అనే ముద్ర వేస్తూ వేధింపులకు గురి చేసేందుకు కేంద్ర పాలకులు తీసుకొచ్చిన చట్టాలు.. అధికారం కోల్పోయాక అవే వారికి ఉరితాళ్లు అవుతాయని హెచ్చరించారు. దళితులు ముస్లిం, క్రైస్తవ మతాల్లోకి మారితే కులం, రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరారు.

పార్లమెంట్‌ స్థానాల పునర్‌ వ్యవస్థీకరణపై నిపుణుల కమిటీ వేసి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలని సూచించారు. నేరుగా 50 శాతం సీట్లను పెంచితే ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆంతర్యం పెరిగి ఉద్యమాలు పుట్టుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. అసమానతలను పెంచేలా రాష్ట్ర బడ్జెట్‌ ఉందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు మరికొన్ని రోజులు నడిస్తే బాగుండేదన్నారు. తనకు దక్కిన ప్రతి నిమిషాన్ని పేదలు, కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సభ దృష్టికి తీసుకెళ్లడానికి వాడినందుకు సంతృప్తిగా ఉందన్నారు. ఇరాన్‌పై అమెరికా సామ్రాజ్యవాద దేశం చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని తాను పెట్టిన తీర్మానాన్ని బలపరిచి శాసనసభలో తీర్మానం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం ద్వారా ఉద్యమ నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -